Begin typing your search above and press return to search.

వెంకయ్య స్వర్ణ పంజరంలో చిలుక..

By:  Tupaki Desk   |   13 Jun 2018 5:46 AM GMT
వెంకయ్య స్వర్ణ పంజరంలో చిలుక..
X
అవి ఆంధ్రప్రదేశ్ విడిపోతున్న రోజులు.. రాజ్యసభలో బిల్లుపై చర్చ సందర్భంగా అప్పటి ప్రతిపక్షంలోని నాయకుడు వెంకయ్య నాయుడు ప్రత్యేక హోదా కోసం పట్టుబట్టాడు. ఏపీకి 5 ఏళ్లు కాదు.. ప్లీజ్ 10 ఏళ్లు ప్రత్యేక హోదా ఇవ్వండంటూ కోరాడు. వెంకయ్య కోరికో మరేదో కానీ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్లు ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఒప్పుకుంది. కానీ అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఓడిపోయి.. ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ గద్దెనెక్కింది. వెంకయ్య నాయుడు కేంద్ర మంత్రి కూడా అయ్యారు. తిరుమల వెంకన్న సాక్షిగా అభయమిచ్చిన మోడీ ఆ తరువాత నాలుక మడతేశాడు.దీంతో హోదా కోసం గొంతుచించుకున్న వెంకయ్య కూడా తరువాత హోదా సంజీవని కాదు.. ప్యాకేజీ ముద్దు అంటూ ప్రకటించాడు. పలు నిధులు తీసుకొని వచ్చాడు. ఏపీలో ప్యాకేజీయే బెటర్ అంటూ బాబుతో కలిసి సన్మానాలు అందుకున్నారు. ఇదంతా గతం.. అక్కడికి కట్ చేస్తే.. ప్రస్తుతం వెంకయ్య రాజకీయాల నుంచి శాశ్వతంగా వైదొలిగారు. కేంద్రమంత్రి పోయి ఉపరాష్ట్రపతిగా సెటిల్ అయ్యారు.

నిజానికి అన్ని విషయాల్లో యాక్టివ్ గా ఉంటున్న వెంకయ్య దక్షిణాది... అదీ ఏపీ నేత కావడంతో అమిత్ షా-మోడీ ద్వయం వ్యూహాత్మకంగా ఆయన్ను రాజకీయాల నుంచి దూరం పెట్టారనే గుసగుసలు వినిపించాయి. దేశంలోనే అత్యున్నత మైన రెండో పదవిలో ఉండి కూడా వెంకయ్య ఇప్పుడు ఆనందంగా లేరని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. సీరియస్ పాలిటిక్స్ చేస్తూ దేశంపై తనదైన ముద్రవేయాల్సిన వెంకయ్య ఇప్పుడు ఉత్సవ విగ్రహంలా మారిపోయాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రత్యేక హోదా బీజేపీ ఇవ్వదని తెలుసు. దీనికోసం ఇప్పుడు బీజేపీని నిలదీసే గొంతుకే లేకుండా పోయింది. బీజేపీతో సన్నిహిత సంబంధాలున్న వెంకయ్య ఉపరాష్ట్రపతిగా పోవడంతో ఇప్పుడు బీజేపీని అడిగే పెద్దదిక్కు ఏపీకి లేకుండా పోయింది..ఏపీకి వచ్చిన ఈ దుస్థితిని చూసి ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ తాజాగా ఆవేదన వ్యక్తం చేశారు..

చలసాని మాట్లాడుతూ ‘వెంకయ్యనాయుడు ఇప్పుడు స్వర్ణ పంజరంలో ఉన్న చిలుక’ అంటూ ఆయన మీద సానుభూతిని కురిపించారు. అంతేకాదు.. ఏపీకి ఎలాంటి సాయం చేయలేని స్థితిలోకి వెంకయ్యను చేర్చి ప్రధాని నరేంద్రమోడీ ఆయనకు కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితిని కల్పించారంటూ వాపోయారు. నిజమే నరేంద్రమోడీ చాకచక్యంగానే వెంకయ్యను దూరం చేశారు. బాబు-వెంకయ్యల జోడీని విడగొట్టారు. ఏపీకి వచ్చే కాస్త నిధులను రాకుండా చేశారు. ఏపీకి గొంతుక లేకుండా చేశారు. చలసాని వ్యాఖ్యలు చూశాక నిజంగానే పంజరంలో చిలుకలా వెంకయ్య ఉన్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.