Begin typing your search above and press return to search.

విభ‌జ‌న త‌ర్వాత ఆంధ్రాలో ఇలాంటిది ఎవ‌రూ ఊహించ‌రంతే!

By:  Tupaki Desk   |   22 Feb 2019 4:56 AM GMT
విభ‌జ‌న త‌ర్వాత ఆంధ్రాలో ఇలాంటిది ఎవ‌రూ ఊహించ‌రంతే!
X
ఆంధ్రోళ్లు అలాంటోళ్లు.. ఇలాంటోళ్లు.. వారికి అహంకారం ఎక్కువ‌. తమ‌కు మించినోళ్లు లేర‌న్న ఫీలింగ్ ఎక్కువే. తెలంగాణ యాస‌ని.. భాష‌ను.. సంస్కృతిని.. ఆచార వ్య‌వ‌హారాల్ని ఎట‌కారం చేస్తార‌ని.. త‌క్కువ చేసి చూపిస్తారంటూ టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ తో స‌హా.. ప‌లువురు నేత‌లు స‌మ‌యానుకూలంగా వ్యాఖ్య‌లు చేస్తుండ‌టం క‌నిపిస్తుంటుంది. ఉమ్మ‌డి రాష్ట్ర పాల‌కుల హ‌యాంలో అలా జ‌రిగింది? ఇన్ని కోట్ల మంది తెలంగాణ‌వాదుల్లో ఒక్క‌రికి కూడా ఆ ప‌ద‌వి ఎందుకు ద‌క్క‌లేదు? అర్హ‌త లేదా? ఇలాంటి లెక్క‌లు డొక్క‌లు చాలానే కేసీఆర్ నోటి నుంచి రావ‌టం.. వాటికి ప్ర‌చార మాధ్య‌మాల్లో విప‌రీత‌మైన ప్ర‌చారం జ‌ర‌గ‌టం తెలిసిందే.

ఆంధ్రోళ్ల చేత‌కానిత‌నం కానీ..ఏపీ మేధావుల మౌనం కానీ.. మితిమీరిన ఆత్మ‌విశ్వాసం.. బ‌ద్ధకం కార‌ణం ఏమైనా కానీ చ‌రిత్ర‌లో మ‌రే జాతి ఎదుర్కోన‌న్ని నింద‌లు ఆంధ్రోళ్లు ప‌డ్డార‌న్న భావ‌న ప‌లువురు ఏపీ వాసుల్లో క‌నిపిస్తూ ఉంటుంది. త‌న ప‌దునైన వాద‌న‌తో లేనివి ఉన్న‌ట్లుగా చేయ‌టంలో కేసీఆర్ స‌క్సెస్ అయ్యార‌ని.. సీమాంధ్ర నేత‌ల చేత‌కానిత‌నంతో ఏపీ వాసుల త్యాగాల్ని.. వారి మంచిత‌నం ఎలివేట్ కాలేద‌న్న ఆరోప‌ణ ఉంది.

ఈ వాద‌న‌కు బ‌లం చేకూర్చే ఘ‌ట‌న ఒక‌టి తాజాగా చోటు చేసుకుంది. వాస్త‌వానికి ఈ అంశం మామూలుగా అయితే బ‌య‌ట‌కు వ‌చ్చేది కాదు. కానీ.. సోష‌ల్ మీడియా పుణ్య‌మా అని ప‌రిమిత గ్రూపుల్లో క‌నిపించిన ఈ వార్త ఆస‌క్తిక‌రంగానే కాదు.. తెలంగాణ‌వాదులు క‌చ్ఛితంగా చ‌దివి తీరాల్సిన వార్త‌గా దీన్ని చెప్ప‌క త‌ప్ప‌దు.

ఆంధ్రోళ్ల మ‌న‌సులు ఇరుకుగా ఉంటాయ‌ని.. వారికి ప్రాంతీయ పీలింగ్ ఎక్కువ‌న్న‌ట్లుగా కొంద‌రు త‌మ వాద‌న‌ల్ని వినిపిస్తూ ఉంటారు. అయితే.. చ‌రిత్ర‌లో మ‌రెక్క‌డా లేని రీతిలో వ్య‌వ‌హ‌రించ‌టం ఆంధ్రోళ్ల‌కు మాత్ర‌మే చెల్లుతుంద‌న్న మాట‌ను కొంద‌రు చెప్ప‌ట‌మే కాదు.. అందుకు త‌గ్గ‌ట్లు ఉదాహ‌ర‌ణ‌లు చూపించ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. తెలంగాణ‌లో జ‌రిగిన సాయుద‌ పోరాటానికి మ‌ద్ద‌తుగా త‌మ సోద‌రులైన తెలంగాణ వారికి ద‌న్నుగా నిల‌వ‌టం కోసం ప‌లువురు పెద్ద ఎత్తున తెలంగాణ‌కు చేరుకొని పోరాటం చేయ‌టం ఒక ఎత్తు అయితే.. నిజాం నియంత పాల‌న‌లో తెలంగాణ ప్రాంతంలో చోటు చేసుకుంటున్న దాష్టీకాల్ని తెలుసుకొని ర‌గిలిపోయి.. ఆ ప్రాంతానికి వెళ్లి అసువులు బాసిన వారెంద‌రో ఉన్నారు.

కేసీఆర్ చెప్పే తెలంగాణ చ‌రిత్ర‌లో అలాంటి వారికి ఎలాంటి ప్రాధాన్య‌త ల‌భించ‌దు స‌రిక‌దా.. అలాంటివి అస‌లు ఉన్నాయ‌న్న విష‌యం ఇప్ప‌టి త‌రాల‌కు తెలీని ప‌రిస్థితి. అలాంటి వారిని గుర్తు చేయ‌టంతో పాటు.. నిజాంకు వ్య‌తిరేకంగా స‌మ‌ర‌శంఖం పూరించి ప్రాణాలు కోల్పోయిన వారికి గుర్తుగా స్మార‌క స్థూపాన్ని గుంటూరు జిల్లా బాప‌ట్ల‌లో అప్పుడెప్పుడో ఏర్పాటు చేసిన విష‌యాన్ని ఎవ‌రూ ఎప్పుడూ ప్ర‌స్తావించ‌రు.

జ‌రిగిపోయిన జ‌మానా ముచ్చ‌ట ఎందుక‌నే కొంద‌రి మాట‌ల్నే తీసుకుంటే.. రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగిన త‌ర్వాత‌.. ఆంధ్రా.. తెలంగాణ మ‌ధ్య క‌నిపించ‌ని పెద్ద గోడ క‌ట్టేసిన‌ప్ప‌టికీ ఆంధ్రోళ్ల ఆలోచ‌న తీరు ఎలా ఉంటుందో తాజాగా చోటు చేసుకున్న ఒక ఉదంతం ఒక పెద్ద ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తుంది. తెలంగాణ‌లో ఆంధ్రా వార్త‌లు ఎందుకంటే టీఆర్ ఎస్ వ‌ర్కింగ్ కేటీఆర్ మా గొప్ప మాట‌ను చెప్పిన త‌ర్వాతే ఇప్పుడు చెప్పే ఉదంతం చోటు చేసుకుంది.

గుంటూరు జిల్లా బాప‌ట్ల అనే ప‌ట్ట‌ణంలో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాక‌లి ఐల‌మ్మ విగ్ర‌హాన్ని ప‌ట్ట‌ణంలో ఏర్పాటు చేసేందుకు బాప‌ట్ల పుర‌పాల‌క సంఘం ఆమోదించింది. ప్రాంతీయ త‌త్వ్తాన్ని నిండుగా నింపుకున్న కేసీఆర్ లాంటోళ్లు.. దీనికి ఏమ‌ని బ‌దులిస్తారు?. ఆడ‌బిడ్డ‌ల‌కు అందించే కిట్ కు కేసీఆర్ కిట్ అనే పేరు పెట్టారే కానీ.. తెలంగాణ మ‌హిళ‌ల‌కు స్ఫూర్తిదాత అయిన చాక‌లి ఐల‌మ్మ కిట్ అని ఎందుకు పెట్ట‌లేదు?

ఉద్య‌మ వేళ‌లో తెలంగాణ యోధులు గుర్తుకు రారా? ఎంత‌సేప‌టికి ఆంధ్రోళ్ల భ‌జ‌నేనా? అంటూ ప్ర‌శ్నించిన కేసీఆర్.. త‌న ప‌థ‌కాల్లో సింహ‌భాగం తెలంగాణ ప్ర‌ముఖుల పేరుతో ఎందుకు అమ‌లు చేయ‌టం లేదు? దీంతో పోలిస్తే.. విభ‌జ‌న త‌ర్వాత కూడా తెలంగాణ ప్రాంతానికి చెందిన స్ఫూర్తి దాత‌ల్ని స్మ‌రించుకుంటూ వారి విగ్ర‌హాల్ని ఏపీలో ఏర్పాటు చేసిన తీరును ఏమందాం? దీన్ని కూడా ఆంధ్రా అహంకారం అనేద్దామా?