Begin typing your search above and press return to search.

త‌లుపు కొట్టి.. మ‌రీ దొంగ‌త‌నం !

By:  Tupaki Desk   |   17 Oct 2017 7:38 AM GMT
త‌లుపు కొట్టి.. మ‌రీ దొంగ‌త‌నం !
X
అధునాత‌న సాంకేతిక వ్య‌వ‌స్థ అందుబాటులోకి వ‌స్తున్న కొద్దీ.. ఎంత మంచి జ‌రుగుతోందో.. అంత‌కు నాలుగింత‌లు చెడూ జ‌రుగుతోంది. చ‌దువుకున్న యువ‌కులు కొంద‌రు సంపాద‌న కోసం సాంకేతిక‌త‌ను వాడుకుంటూ చెడుమార్గాల‌కు మ‌ళ్లుతూ.. స‌మాజానికి స‌వాలుగా మారారు. ఇటీవ‌లి కాలంలో పెద్ద పెద్ద న‌గ‌రాల్లోనూ చైన్ స్నాచింగ్‌లు కామ‌న్ అయిపోయాయి. ఒంట‌రిగా వెళ్తున్న మ‌హిళ‌లే ల‌క్ష్యంగా స్నాచ‌ర్లు రెచ్చిపోయారు. మ‌హిళ‌ల మెడ‌లోని పుస్తెల తాడు మొద‌లుకుని ఏమున్నా ఎత్తుకెళ్లిపోవ‌డం కామ‌న్ అయిపోయింది. ఈ క్ర‌మంలో మ‌హిళ‌ల‌ను రోడ్డుపై ఈడ్చేసి - బైకుల‌తో గుద్దేసి మ‌రీ దంగ‌త‌నాలు చేసిన ఘ‌నుల‌ను మ‌నం చూశాం.

అయితే, తాజాగా ఇలాంటిదే.. కానీ హైరేంజ్‌ లో స్నాచింగ్ ఒక‌టి జ‌రిగింది. ఇంట్లో ఉన్నా మ‌హిళ‌ల ఒంటిపై న‌గ‌ల‌కు భ‌ద్ర‌త లేకుండాపోయింది. హైద‌రాబాద్‌ లో జ‌రిగిన ఓ ఘ‌ట‌న ఇప్పుడు పెను సంచ‌ల‌నంగా మారింది. విష‌యంలోకి వెళ్తే.. చైన్‌ స్నాచర్లు కొత్తకొత్త పద్ధతులు అనుసరిస్తున్నారు. హైద‌రాబాద్‌ లోని అత్యంత ర‌ద్దీ ప్రాంతం సరూర్‌ నగర్‌ పోస్టాఫీసు సమీపంలో సోమవారం మమత అనే మహిళ ఇంట్లో మధ్యాహ్నం సమయంలో ఒంటరిగా ఉంది. ఆ సమయంలో హెల్మెట్‌ ధరించి వచ్చిన ఓ వ్యక్తి తలుపు తట్టాడు. ఆమె ఎవ‌రో వ‌చ్చార‌ని తెలుసుకునేందుకు తలుపు తీస్తుండగానే ఆ వ్యక్తి ఆమె ముఖంపై స్ప్రే కొట్టాడు. అంతే మ‌మ‌త క్ష‌ణాల్లోనే మ‌గ‌త‌లోకి వెళ్లిపోయింది.

దీంతో ఆ దుర్మార్గుడు మ‌మ‌త‌ మెడలోని నాలుగు తులాల పుస్తెల తాడును లాక్కుని ప‌రార‌య్యాడు. కొద్ది సేప‌టికి ఆ మ‌హిళ తేరుకుని ఏం జ‌రిగిందో తెలుసుకుని ల‌బోదిబో మ‌ని రోదించింది. ప‌క్కింటి వారిని పిలిచి విష‌యం చెప్పింది. ఈ క్ర‌మంలో వారంతా స‌రూర్‌ న‌గ‌ర్ పోలీసుల‌కు స‌మాచారం చేర‌వేశారు. దీంతో అక్క‌డికి చేరుకున్న పోలీసులు సీసీ కెమెరాల్లోని ఫుటేజ్‌ ని ప‌రిశీలించారు. బాధితురాలి నుంచి ఫిర్యాదు స్వీక‌రించారు. అయితే, నిందితుడు.. హెల్‌ మెట్ ధ‌రించి ఈ అఘాయిత్యానికి పాల్ప‌డ‌డంతో అత‌ని ముఖాన్ని క‌నిపెట్ట‌డం పోలీసుల‌కు సాధ్యం కాలేదు. దీంతో స‌ద‌రు ఫుటేజ్‌ ను ఫోరెన్సిక్ ల్యాబ్‌ కు పంపి - ముఖాన్ని గుర్తించాల‌ని నిర్ణ‌యించారు. ఈ కేసును అన్ని కోణాల్లోనూ దర్యాప్తు ప్రారంభించారు. కాగా, బైక్‌ లు న‌డిపేట‌ప్పుడు ప్రాణ ర‌క్ష‌ణ‌కు ఉప‌యోగ ప‌డుతుంద‌ని పేర్కొంటున్న హెల్మెట్‌ ను అడ్డం పెట్టుకుని ఇలాంటి దారుణాల‌కు దిగుతుండ‌డం స‌ర్వ‌త్రా విస్మ‌యం క‌లిగిస్తోంది. ఇటీవ‌ల బెంగ‌ళూరులో జ‌రిగిన ప్ర‌ముఖ పాత్రికేయురాలు గౌరీ లంకేష్ హ‌త్య స‌మ‌యంలోనూ నిందితులు హెల్‌ మెట్ ధ‌రించి రావ‌డం గ‌మ‌నార్హం.