Begin typing your search above and press return to search.

ప‌శువ‌ధ‌పై కీల‌క నిర్ణ‌యాన్ని తీసుకున్న కేంద్రం

By:  Tupaki Desk   |   27 May 2017 5:09 AM GMT
ప‌శువ‌ధ‌పై కీల‌క నిర్ణ‌యాన్ని తీసుకున్న కేంద్రం
X
గోవ‌ధ‌ను దేశ‌వ్యాప్తంగా నిషేధించాల‌న్న అంశం మీద‌నే భారీ ఎత్తున అభిప్రాయ బేధాలున్న వేళ‌.. ఆ అంశంపై ఒక నిర్ణ‌యాన్ని తీసుకోలేక‌పోతున్న సంద‌ర్భంలో.. తాజాగా ప‌శువ‌ధ‌పై కేంద్రం కొన్ని కీల‌క రూల్స్ ను ఫ్రేం చేసింది. మోడీ స‌ర్కారు అధికారంలోకి వ‌చ్చిన మూడేళ్లు పూర్తి అయిన రోజునే.. ప‌శు వ‌ధ‌పై కీల‌క రూల్స్ ను గెజిట్ రూపంలో విడుద‌ల చేయ‌టం గ‌మ‌నార్హం.

ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని ప‌లు పార్టీలు తీవ్రంగా వ్య‌తిరేకిస్తే.. విశ్వ‌హిందూ ప‌రిష‌త్ మాత్రం ఈ రూల్స్ ఏ మాత్రం స‌రిపోవ‌ని పేర్కొంది. తాజాగా విడుద‌ల చేసిన గెజిట్ కార‌ణంగా చోటు చేసుకునే పెను మార్పు ఏమిటంటే.. నిన్న‌టి వ‌ర‌కూ ప‌శువుల్ని అమ్మ‌టం.. కొన‌టం చాలా ఈజీగా ఉండేది. ఇక‌పై ఇదంత తేలికైన విష‌యం కాదు.

క‌ఠిన‌మైన నిబంధ‌న‌లు అమ‌ల్లోకి రానున్నాయి. ప‌శువుల్ని వ్య‌వ‌సాయానికి మాత్ర‌మే వినియోగించాలే కానీ.. వాటిని వ‌ధించ‌టానికి.. వాటిని ఆహారంగా వినియోగించ‌టం మీద ప‌రిమితులు విధించ‌టం కీల‌కాంశంగా చెప్పాలి. అంతేనా.. ప‌శువుల కొమ్ముల మీద రంగులు వేయ‌టం.. వాటిని వివిధ వ‌స్తువుల‌తో అలంక‌రించ‌టం లాంటివి కూడా చేయ‌కూడ‌దు. అంతేకాదు.. ప‌శుమాంసం.. చ‌ర్మాల ఎగుమ‌తుల వ్యాపారం మీద కూడా తాజా నిబంధ‌న‌ల ప్ర‌భావం భారీగా ప‌డనుంది. ఇంతేకాదు.. ఈ కొత్త నిబంధ‌న‌ల నేప‌థ్యంలో కోట్లాది మంది ఉపాధి అవ‌కాశాలు దెబ్బ తింటాయ‌న్న ఆందోళ‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ప‌ర్యావ‌ర‌ణ మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించిన కొత్త నిబంధ‌న‌ల ప్ర‌కారం ప‌శువుల మార్కెట్ల‌కు.. జ‌ఫ్తు చేసుకున్న ప‌శువుల‌కు మాత్ర‌మే కొత్త నిబంధ‌న‌ల్ని వ‌ర్తింప‌చేయ‌నున్నారు. ఎందుకిలా అంటే.. ప‌శు మాంస త‌యారీకి ప‌శువుల మార్కెట్లే కీల‌కమ‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు.

ఈ కొత్త చ‌ట్టం ప్ర‌కారం ఎద్దులు.. ఆవులు.. గేదెలు.. ఒంటెలు.. త‌దిత‌ర ప‌శువుల‌కు ఈ కొత్త రూల్స్ వ‌ర్తింప‌చేయ‌నున్నారు. రాష్ట్రాల స‌రిహ‌ద్దుల నుంచి 25 కిలోమీట‌ర్ల లోపు.. అంత‌ర్జాతీయ స‌రిహ‌ద్దుల నుంచి 50 కిలోమీట‌ర్ల‌ల లోపు ప‌శువుల మార్కెట్లు ఏర్పాటు చేయ‌కుండా కొత్త రూల్ ను ప్ర‌వేశ పెట్టారు. ఇక‌పై ప‌శువుల్ని అమ్మాల‌నుకున్నా.. కొనాల‌నుకున్నా ప‌శువుల్ని జంతువ‌ధ‌శాల‌కు త‌ర‌లించ‌మ‌న్న విష‌యాన్ని రాత‌పూర్వ‌కంగా అధికారుల‌కు స‌మ‌ర్పించాల్సి ఉంటుంది.

అంతేనా.. అలా రాత‌పూర్వ‌కంగా వివ‌రాలు ఇచ్చే వారు త‌మ చిరునామాతో పాటు.. ఇత‌ర వివ‌రాలు.. జంతువు ఫోటో గుర్తింపు ప‌త్రం న‌క‌లు ఇవ్వాలి. జంతువుల్ని వ్య‌వ‌సాయ అవ‌స‌రాల‌కు మిన‌హా మ‌రి వేటికి ఉప‌యోగించ‌కూడ‌దు. తాజాగా కేంద్రం విడుద‌ల చేసిన గెజిట్ ను కేర‌ళ ప్ర‌భుత్వం తీవ్రంగా అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది. ఇలాంటి రూల్స్ తీసుకొచ్చేట‌ప్పుడు రాష్ట్రాల్ని సంప్ర‌దించాల‌ని చెప్పింది. కోడి మాంసం కొన‌లేని పేద‌ల‌కు ప‌శు మాంస‌మే ఆధార‌మ‌ని.. ఇలాంటి వాటిపై కేంద్రం చ‌ట్టం చేసినా తాము మాత్రం పాటించేది లేద‌ని అఖిల భార‌త జ‌మాత్ ఉల్ ఖురేషీ ఉపాధ్య‌క్షుడు మ‌హ్మ‌ద్ స‌లీం ప్ర‌క‌టించారు. మొత్తంగా చూస్తే.. కేంద్రం విడుద‌ల చేసిన తాజా గెజిట్ కొత్త వివాదానికి తెర తీస్తుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/