Begin typing your search above and press return to search.

టీ సర్కారు మీద కేంద్ర జలసంఘం కామెంట్లు విన్నారా?

By:  Tupaki Desk   |   5 May 2016 9:10 AM GMT
టీ సర్కారు మీద కేంద్ర జలసంఘం కామెంట్లు విన్నారా?
X
రెండు తెలుగు రాష్ట్రాల మీద సాగునీటి ప్రాజెక్టుల మీద మాటల యుద్ధం జరుగుతున్న సమయంలోనే మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కృష్ణా నదిపై తెలంగాణ సర్కారు నిర్మించాలని భావిస్తున్న పాలమూరు – రంగారెడ్డి.. డిండి ఎత్తిపోతల పథకంపై ఇప్పటికే ఏపీ అధికారపక్షం తమ అభ్యంతరాల్ని వ్యక్తం చేస్తూ కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. మరోవైపు ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్.. ఈ పథకం కారణంగా ఏపీ మాత్రమే కాదు తెలంగాణలోని ఖమ్మం.. నల్గొండ జిల్లా ప్రజలకు ఇబ్బందేనన్న వాదనను వినిపిస్తూ..ఈ నెలలో మూడురోజుల పాటు నిరసన దీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించారు.

ఇదిలా ఉంటే పాలమూరు ఎత్తిపోతల విషయంలో ఏపీ అధికార.. విపక్షాల తీరుపై తెలంగాణ ముఖ్యమంత్రి తీవ్రస్థాయిలో మండిపడటం తెలిసిందే. తెలంగాణ ప్రాజెక్టుల్ని ఏపీ అడ్డుకునే ప్రయత్నం చేస్తుందని.. చంద్రబాబు.. జగన్ తమ రాజకీయాల కోసం నాటకాలు ఆడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీ వాళ్లు రాళ్లతో కొడితే తాము ఇటుకలతో కొడతామంటూ పెద్దమాటనే వాడేశారు. తెలంగాణ ప్రాజెక్టుల కోసం దేనికైనా తెగిస్తామంటూ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసిన కేసీఆర్ తీరుకు తోడుగా తెలంగాణ ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు సైతం ఏపీ తీరు పట్ల నిప్పులు చెరిగారు.

పాలమూరు ఎత్తిపోతల వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించగా.. ఇంతలో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఏపీ అధికారపక్షం.. విపక్షంతో పాటు తెలంగాణ విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పాలమూరు – రంగారెడ్డి.. డిండి ప్రాజెక్టుల ఎత్తిపోతలకు అనుమతులు లేవంటూ సుప్రీంకోర్టుకు కేంద్ర జలసంఘం అఫిడవిట్ దాఖలు చేసింది. రాష్ట్ర విభజన చట్టంలోని 11వ షెడ్యూల్ లో ఈ ప్రాజెక్టులు లేవని పేర్కొంది. 11వ షెడ్యూల్ ప్రకారం కృష్ణా నదిపై నిర్మించే కొత్త ప్రాజెక్టులకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు అనుమతి తీసుకోవాలని స్పష్టం చేయటం గమనార్హం.

కొత్తగా ప్రాజెక్టుల వివరాలు.. జలవనరుల లెక్కింపు.. ఈ జలాల్ని ఎలా వినియోగించుకుంటున్న విషయాల్ని బోర్డు దృష్టికి తీసుకెళ్లి.. అనుమతి తీసుకోవాల్సిందేనని సుప్రీంకోర్టుకు దాఖలు చేసిన అఫిడవిట్ లో స్పష్టం చేయటం గమనార్హం. ఓపక్క పాలమూరు ప్రాజెక్టుకు అన్ని అనుమతులు ఉన్నట్లుగా తెలంగాణ ముఖ్యమంత్రి.. మంత్రి చెబుతుంటే.. మరోవైపు కృష్ణా యాజమాన్య బోర్డు మాత్రం అందుకు భిన్నంగా ఈ కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన వివరాల్ని తమ దృష్టికి తీసుకురాలేదని.. తమ అనుమతి పొందలేదన్న విషయంపై కేసీఆర్ అండ్ కో ఏం బదులిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.