Begin typing your search above and press return to search.

కేసీఆర్ ను స్మృతి మేడ‌మ్ అంత మాట అనేసిందే!

By:  Tupaki Desk   |   5 Nov 2018 5:15 AM GMT
కేసీఆర్ ను స్మృతి మేడ‌మ్ అంత మాట అనేసిందే!
X
రాజ‌కీయం అంటేనే అలా ఉంటుంది మ‌రి. ఏదో వ‌చ్చామా? వెళ్లిపోయామా? అన్న‌ది కాకుండా.. తాము వ‌చ్చిన ప‌నిని నూటికి 200 శాతం చేసేవారు కొంద‌రుంటారు. తాజాగా అదే తీరును ప్ర‌ద‌ర్శించారు కేంద్ర జౌళి శాఖామంత్రి స్మృతి ఇరానీ. బీజేపీ ఎన్నిక‌ల ప్ర‌చారానికి తెలంగాణ‌కు వ‌చ్చిన ఆమె సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

ఓవైపు టీఆర్ఎస్‌-బీజేపీకి ఎన్నిక‌ల అనంత‌రం క‌లిసి పోతార‌న్న వార్త‌లు అంత‌కంత‌కూ పెరుగుతున్న వేళ‌.. స్మృతి ప్ర‌చారం టీఆర్ఎస్ వ‌ర్గాల‌కు మంట పుట్టేలా ఉండ‌టం గ‌మ‌నార్హం. అంతేనా.. ఎప్పుడూ లేని విధంగా కేసీఆర్ పై ఆమె చేసిన వ్యాఖ్య సంచ‌ల‌నంగా మారింది.

రానున్న ఎన్నిక‌ల్లో టీఆర్ ఎస్ కు బుద్ది చెప్పాల‌ని ఒక‌వైపు చెబుతూనే మ‌రోవైపు అంత‌కు మించిన మాట‌నే అనేశారు. ఎన్నిక‌ల పోలింగ్ జ‌రిగే డిసెంబ‌రు 7ను తెలంగాణ విమోచ‌న దినోత్స‌వంగా ఆమె అభివ‌ర్ణించారు. కేసీఆర్ పాల‌న నుంచి తెలంగాణ ప్ర‌జ‌లు విముక్తి కోరుకుంటున్నార‌ని చెప్పారు.

ప్ర‌జాస్వామ్యం అంటే కుటుంబ పాల‌నగా టీఆర్ఎస్ అనుకుంటోంద‌ని ఆమె ఎద్దేవా చేస్తూ.. తెలంగాణ విమోచ‌న దినోత్స‌వ‌మైన సెప్టెంబ‌రు 17ను కేసీఆర్ స‌ర్కారు ఎందుకు నిర్వ‌హించ‌లేద‌ని ప్ర‌శ్నించారు. పేద‌ల ఆరోగ్యం కోసం కేంద్రం ఆయుష్మాన్ భార‌త్ ప‌థ‌కాన్ని షురూ చేస్తే.. టీఆర్ఎస్ ప్ర‌భుత్వం అమ‌లు చేయ‌క‌పోవ‌టాన్ని త‌ప్పు ప‌ట్టారు.

ఆయుష్మాన్ భార‌త్ ప‌థ‌కాన్ని తెలంగాణ‌లో అమ‌లు చేస్తే.. ఆ క్రెడిట్ మోడీకి ఎక్క‌డ వెళుతుందోన‌న్న సందేహంతోనే ఆ ప‌థ‌కాన్ని తెలంగాణ‌లో అమ‌లు కాకుండా ఆపార‌న్నారు.

ఒక ప‌థ‌కాన్ని ఆప‌టం ద్వారా మోడీకి పేరు రాకుండా చేశామ‌నుకోవ‌టం స‌రికాద‌ని.. ఈ తీరులో టీఆర్ ఎస్ పార్టీ ఆలోచిస్తే అంత‌కు మించిన భ్ర‌మ మ‌రొక‌టి ఉండ‌ద‌న్నారు. మోడీకి దేశ‌వ్యాప్తంగా ఆద‌ర‌ణ ఉంద‌న్న విష‌యాన్ని కేసీఆర్ మ‌ర్చిపోకూడ‌ద‌న్నారు.

కిష‌న్ రెడ్డి నిజాయితీప‌రుడిగా.. ఆయ‌న గెలుపే అస‌లు సిస‌లు దీపావ‌ళి అవుతుంద‌ని ఆమె అభివ‌ర్ణించారు. మొత్తానికి కేసీఆర్ పాల‌న‌ పైన తీవ్ర వ్యాఖ్య‌లు చేయ‌ట‌మే కాదు.. టైమ్లీగా తెలంగాణ ప్ర‌జ‌ల్ని భావోద్వేగానికి గురి చేసేలా మ‌సాలా మాట‌ల్ని క‌మ‌ల‌నాథులు రెఢీ చేసుకున్నార‌న్న విష‌యం తాజాగా స్మృతి మాట‌లు చెప్ప‌క‌నే చెప్పేశాయ‌ని చెప్పాలి. ఈ నేప‌థ్యంలో రానున్న రోజుల్లో ప్ర‌చారం మ‌రింత వేడెక్క‌టం ఖాయం.