Begin typing your search above and press return to search.

బాబుకు మ‌ళ్లీ కేంద్రం వార్నింగిచ్చిందా?

By:  Tupaki Desk   |   25 Feb 2017 5:31 AM GMT
బాబుకు మ‌ళ్లీ కేంద్రం వార్నింగిచ్చిందా?
X
ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుకు కేంద్ర ప్ర‌భుత్వం మ‌రోమారు హెచ్చరిక‌తో కూడిన స‌ల‌హా ఇచ్చింద‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. బౌద్ధమత గురువు దలైలామాతో రాష్ట్ర ప్రభుత్వం నెరపుతున్న స్నేహ పూర్వక సంబంధాల విషయంలో కేంద్రం అసహనంగా ఉన్నట్లు సమాచారం. దలైలామాతో చెలిమి వల్ల ఇతర దేశాలతో స్నేహానికి విఘాతం కలగరాదన్న భావాన్ని కేంద్రం వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. అందుకే ఇకపై అత్యుత్సాహం లేకుండా ఆచితూచి వ్యవహరించాలని కూడా నేరుగా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం హితవు పలికినట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. గతం నుంచి చైనా - దలైలామా మధ్య విభేదాలున్నాయి. తాము టిబెట్‌ ను విడిచి వెళ్లడానికి చైనాయే కారణమని గతంలో దలైలామా అనేక పర్యాయాలు పేర్కొన్నారు. దలైలామా దేశ ద్రోహ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాడని చైనా ఆగ్రహిస్తుంది.

ఇటీవ‌ల రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చైనా వైపు మొగ్గు చూపిస్తున్నాయి. వ్యాపార - వాణిజ్య - పారిశ్రామిక రంగాల్లో చైనాతో అనేక ఒప్పందాలు కూడా చేసుకుంటున్నాయి. వాస్తవానికి మోడీ సర్కారుకు చైనాతో సంబంధాలు అంతంతమాత్రంగానే ఉండగా, ఇటీవల నష్ట నివారణ చర్యలు ప్రారంభించింది. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ ప్రభుత్వం చైనాకు దగ్గర‌య్యేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగానే దౌత్యవేత్తలను కూడా చైనాతో చర్చలకు పంపించడం, మోడీ కూడా చైనాతో నేరుగా చర్చలు సాగిస్తుండడం వంటి చర్యలకు ఉపక్రమిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్ర‌బాబు అయితే నేరుగా ఎర్రచందనం నురం అమరావతి నగర నిర్మాణం - పరిశ్రమలు వంటి అనేక కోణాల్లో చైనాతో చాలా దగ్గరగా వ్యవహరిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం దలైలామా రాష్ట్రానికి రాగా, చంద్రబాబు సర్కారు ఆయనకు ఘన స్వాగతం పలికింది. దలైలామా అడుగు పెట్టడమే రాష్ట్రానికి ఒక వరంగా బాబు సర్కారు అభివర్ణించింది. ఒకవిధంగా ఆయనను రాష్ట్ర అతిథి స్థాయిలో గౌరవించింది.

ఒకవైపు చైనాతో సత్సంబంధాలు నెరపుతూ మరోవైపు చైనాకు గిట్టని దలైలామాను అక్కున చేర్చుకోవడంపై అధికార వర్గాల్లోనే అనేక చర్చలు సాగాయి. ఈ అంశంపై కేంద్రం కూడా ఆరా తీసినట్లు తెలిసింది. చైనాతో వ్యాపార, వాణిజ్య సంబంధాలు పెంచుకునే తరుణంలో దలైలామాను అక్కున చేర్చుకోవడం ఎంతవరకు సమంజసమని కేంద్రం నుంచి కొంతమంది రాష్ట్ర నేతలను ప్రశ్నించినట్లు చెప్తున్నారు. ఇకపై ఇటువంటి చర్యలకు దూరంగా ఉంటే మంచిదని కూడా సున్నితంగా హెచ్చరించినట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. దీంతో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా రానున్న కాలంలో దలైలామా వంటి నేతలు రాష్ట్రానికి వచ్చిన నేపథ్యంలో ఆచితూచి వ్యవహరించాలని భావిస్తున్నట్లు చెప్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/