Begin typing your search above and press return to search.

లాగేసుకున్న రూ.1274కోట్లు టీ కు ఇస్తున్నారు

By:  Tupaki Desk   |   1 Sep 2015 5:10 AM GMT
లాగేసుకున్న రూ.1274కోట్లు టీ కు ఇస్తున్నారు
X
ఎవరి మీద అయినా సరే.. ఒకటే పంథా.. ఒక విధానం. తమ ప్రయోజనాల కోసం ఎంతవరకు అయినా వెళ్లేందుకు సిద్ధమయ్యే పోరాటతత్వం ఉన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. మరోసారి తన సత్తా చాటారు. విభజన పంచాయితీల్లో భాగంగా తెలంగాణ అబార్కీ శాఖ ఇవ్వాల్సిన పన్ను మొత్తాన్ని తెలంగాణ ప్రభుత్వ అనుమతి లేకుండా ఐటీ శాఖ.. ఆర్ బీఐ సహకారంతో ఏకపక్షంగా రూ.1274కోట్లను తన ఖాతాలోకి బదలాయించుకోవటం తెలిసిందే.

తమకు మాట మాత్రం చెప్పకుండా.. తమ ఖాతాలో ఉన్న మొత్తాన్ని ఐటీ శాఖకు ఎలా బదలాయిస్తారంటూ కేంద్రంపై పోరు మొదలెట్టిన తెలంగాణ ప్రభుత్వం.. తమ దగ్గర నుంచి తీసుకున్న మొత్తాన్ని.. లాగేసుకున్నదిగా నిరూపించటంలో విజయం సాధించారు. అంతేకాదు.. తమకు జరిగిన అన్యాయాన్ని వివిధ వేదికల మీద.. వివిధ మార్గాల్లో వినిపించిన తెలంగాణ సర్కారు ఎట్టకేలకు తమ నుంచి తీసుకున్న మొత్తాన్ని తిరిగి తీసేసుకునేలా సక్సెస్ అయ్యారు.

నిజానికి వారం కిందటే తెలంగాణ సర్కారు నుంచి లాగేసుకున్న మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని ఐటీ శాఖకు కేంద్రం ఆదేశించింది. తాజాగా.. అందుకు సంబంధించిన కేంద్ర ఆర్థిక మంత్రి సంతకం పెట్టేయటంతో.. చేజారిపోయాయి అనుకున్న రూ.1274కోట్ల మొత్తాన్ని తన ఖాతాలోకి తెలంగాణ సర్కారు తెచ్చుకోనుంది. రాష్ట్రాల అనుమతి లేకుండా..వారి వాదన వినకుండా ఏకపక్షంగా ఏ విధంగా తరలిస్తారన్న పాయింట్ ను లేవనెత్తిన తెలంగాణ సర్కారు.. తనకు జరిగిన అన్యాయాన్ని వివిధ వేదికల మీద ప్రస్తావించింది.

తాను పట్టిన పట్టును ఏ దశలోనూ విడిచి పెట్టే అవకాశమే లేదన్న వైఖరిని స్పష్టం చేయటమే కాదు.. తమ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎంతకు తగ్గేది లేదన్న విషయాన్ని తాజా ఉదంతంతో తెలంగాణ సర్కారు మరోసారి చేతల్లో చూపించిందని చెప్పాలి. ఆర్థిక శాఖామంత్రి సంతకంతో అతి త్వరలోనే తెలంగాణ రాష్ట్ర ఖాతాలోకి రూ.1274కోట్లు వచ్చేయనున్నాయి. తెలంగాణ సర్కారు పోరాట పటిమకు తాజా నిదర్శనంగా ఈ ఉదంతాన్ని చెప్పొచ్చు.