Begin typing your search above and press return to search.

కేంద్రం నుంచి పోల‌వ‌రానికి నిధులేమీ ఆగ‌లేదే!

By:  Tupaki Desk   |   21 March 2018 11:49 AM GMT
కేంద్రం నుంచి పోల‌వ‌రానికి నిధులేమీ ఆగ‌లేదే!
X
న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ జీవ‌నాడిగి ప‌రిగ‌ణిస్తున్న పోలవ‌రం ప్రాజెక్టుకు కేంద్రం ఆశించిన మేర నిధులు ఇవ్వ‌డం లేద‌ని ఏపీలో అధికార పార్టీ టీడీపీ వాదిస్తోంది. ఇప్ప‌టిదాకా కేంద్రం ఇచ్చిన నిధుల కంటే కూడా రాష్ట్ర ప్ర‌భుత్వ ఖాతాలో ఖ‌ర్చు పెట్టిన నిధులే ఎక్కువ‌గా ఉన్నాయ‌ని కూడా టీడీపీ నేత‌లు చెబుతున్న విష‌యం తెలిసిందే. అస‌లు విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసే బాధ్య‌త కేంద్రానిదే. అంతేకాకుండా ఆ ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే ఖ‌ర్చు మొత్తం కూడా కేంద్ర‌మే భ‌రించాల‌ని చ‌ట్టం చెబుతోంది. ఈ నిబంధ‌న‌కు కేంద్రంలోని న‌రేంద్ర మోదీ స‌ర్కారు కూడా ఎప్పుడో ఓకే చెప్పేసింది. అయితే ప్రాజెక్టు ప్రారంబించిన నాటికి ఉన్న అంచ‌నాల ప్ర‌కార‌మే నిధులిస్తామ‌ని కేంద్రం తెగేసి కూడా చెప్పేసింది. అయితే 2014లో అధికారంలోకి వ‌చ్చిన టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు... పోల‌వ‌రం అంచ‌నాల‌ను భారీగా పెంచేసి కేంద్రం ముందు పెట్టిన వైనంపై ఇప్ప‌టికే లెక్క‌కు మించి క‌థ‌నాలు వ‌చ్చాయి. పెరిగిన అంచ‌నాల మేర‌కు నిధులివ్వ‌డం కుద‌ర‌ద‌ని, ప్రాజెక్టు ప్రారంభించిన నాడు ఉన్న అంచ‌నాల ప్ర‌కార‌మే నిధుల విడుద‌ల చేస్తామ‌ని కేంద్రం దాదాపుగా మొండికేసింద‌నే చెప్పాలి.

అయినా ప్రాజెక్టు నిర్మాణ బాధ్య‌త త‌మ‌దే క‌నుక తామే ప్రాజెక్టు నిర్మాణం చేప‌డ‌తామ‌ని మోదీ స‌ర్కారు చెప్పింది. అయితే నిధులు మాత్రమే మీరివ్వండి... ప్రాజెక్టు నిర్మాణ ప‌నుల‌ను తాము చూసుకుంటామంటూ చంద్ర‌బాబు మ‌రో ప్ర‌తిపాద‌న పెట్టారు. ఎన్డీఏలో కీల‌క భాగ‌స్వామిగా ఉన్న టీడీపీ అధినేత‌గా చంద్ర‌బాబుకు గౌర‌వమిచ్చిన మోదీ స‌ర్కారు స‌రేనంది. అయితే ఆ త‌ర్వాత పోల‌వరం ప‌నుల‌ను ద‌క్కించుకున్న కంపెనీలు మాయ‌లు చేయ‌డం, ఎక్క‌డిక‌క్క‌డ ప‌నులు నిలిపేయ‌డం, ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రించ‌డం, డ్రాఫ్ట్ లో ఉన్న‌ట్లుగా కాకుండా కొత్త నిర్మాణాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు తెర మీద‌కు తీసుకువ‌చ్చిన నేప‌థ్యంలో కేంద్రం అసంతృప్తి వ్య‌క్తం చేసిన విష‌య‌మూ తెలిసిందే. మొత్తంగా పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి నిధుల విడుద‌ల‌లో ఏపీ - కేంద్ర ప్ర‌భుత్వం మ‌ధ్య ఒకింత విరుద్ధ అభిప్రాయాలు ఉన్నాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. అంతేకాకుండా నిన్న‌టిదాకా వ‌ద్ద‌న్న ప్ర‌త్యేక హోదానే ఇప్పుడు కావాలంటూ పంతం ప‌ట్టిన టీడీపీ... ఎన్డీఏ కూటమి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. హామీ ఇచ్చిన మేరకు నిధులు ఇవ్వ‌డం లేద‌ని ఆరోపిస్తున్న బాబు స‌ర్కారు... పోల‌వ‌రం ప్రాజెక్టుపైనా త‌న‌దైన శైలి కామెంట్లు చేస్తోంది. ఈ క్ర‌మంలో నిన్న‌టి అసెంబ్లీ స‌మావేశాల్లో భాగంగా... *పోలవరం ప్రాజెక్టు విషయంలో ఎవరైనా చేతులు పెట్టాలంటే వారి చేతులు కాలిపోతాయే తప్ప...ఎవరూ ఏమీ చేయలేరు* అని చంద్ర‌బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లే చేశారు.

అయితే బాబు మాట‌ల‌ను ఏమాత్రం ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న‌ట్లుగా క‌నిపించ‌ని కేంద్ర ప్ర‌భుత్వం పోల‌వ‌రం ప్రాజెక్టుకు రూ.1,400 కోట్ల‌ను విడుద‌ల చేసేందుకు దాదాపుగా నిర్ణ‌యించింది. ఈ మేర‌కు కేంద్ర ఆర్థిక శాఖ నుంచి కేంద్ర జ‌ల‌వ‌న‌రుల శాఖ‌కు స‌మాచారం అందిన‌ట్లు తెలుస్తోంది. నాబార్డు నుంచి రుణంగా ఈ నిధుల‌ను కేంద్రం స‌ర్దుబాటు చేస్తున్న‌ట్లుగా స‌మాచారం. అయితే ప్ర‌స్తుతం రూ.ప‌1,795 కోట్లను పోల‌వ‌రానికి విడుద‌ల చేయాల‌ని ఏపీ ప్ర‌భుత్వం కేంద్రానికి లేఖ రాసింది. ఆ నిధుల్లో భాగంగానే ఇప్పుడు రూ.1,400 కోట్ల‌ను విడుద‌ల చేసేందుకు మార్గం సుగ‌మం చేసిన కేంద్రం... పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఆడిట్లు వచ్చిన తరువాత ఏపీ స‌ర్కారు కోరిన విధంగానే మరో రూ. 300 కోట్లు మంజూరు చేయనున్నట్లు ఆర్థిక శాఖ తెలిపింది. మొత్తంగా బాబుతో పొత్తు ఉన్నా, లేకున్నా... తాను ఇచ్చిన హామీ మేర‌కు పోల‌వ‌రం ప్రాజెక్టుకు నిధులు ఇస్తున్న‌ట్లుగా చెప్పుకునేందుకే కేంద్రం ఈ నిధుల‌ను విడుద‌ల చేసిన‌ట్లుగా విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి.