Begin typing your search above and press return to search.

ఏపీలో మళ్లీ నదుల అనుసంధానం...

By:  Tupaki Desk   |   19 Oct 2017 4:35 AM GMT
ఏపీలో మళ్లీ నదుల అనుసంధానం...
X
ఇటీవ‌లి కాలంలో న‌దుల అనుసంధానం అంటే...ఏపీ ముఖ్య‌మంత్రి - తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు గుర్తుకు వ‌చ్చేలా ప్ర‌చారం సాగిన సంగ‌తి తెలిసిందే. ఈ ప్రచారం సంగ‌తి పక్క‌న‌పెడితే...కీల‌క‌మైన న‌దుల అనుసంధానానికి ఏపీ వేదిక కానుంది. గోదావరి నదితో మహానదిని అనుసంధానం చేసే ప్రాజెక్టుకు రూపకల్పన జరుగుతోంది. ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తాజా డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్)పై కసరత్తుచేపట్టింది. కేంద్ర నదుల అనుసంధాన ప్రాజెక్టులో భాగంగా మహానది - గోదావరి - పెన్నా - కావేరి నదుల అనుసంధానం జరగనుంది. ఇందుకు సంబంధించి డీపీఆర్ కేంద్రం తయారుచేస్తోంది. గతంలో డీపీఆర్ తయారు చేసినప్పటికీ మరింత ఎక్కువ నీటిని గోదావరి నదిలోకి తీసుకొచ్చేందుకు అవసరమైన పరిశీలన చేస్తోంది. భువనేశ్వర్‌ లోని జాతీయ జల వనరుల మండలి డిపిఆర్ అందిన వెంటనే నిర్మాణ పనులు చేపట్టనుంది.

మహానది నుంచి 12,165 మిలియన్ క్యూబిక్ మీటర్ల నీటిని గోదావరి నదిలో కలపడం ఈ పథకం ప్రధాన ఉద్ధేశం. ఈ పథకంవల్ల ఏపీ - ఒడిశా రాష్ట్రాల్లో 3.50 లక్షల హెక్టార్ల భూమికి సాగునీరు అందిస్తారు. 366 మిలియన్ క్యూబిక్ మీటర్ల జలాలను తాగునీటి నిమిత్తం మళ్లిస్తారు. 436 క్యూబిక్ మీటర్లు పారిశ్రామిక అవసరాలకు వినియోగించుకోవచ్చు. మహానది నుంచి గోదావరి నదికి ఈ జలాలను కాల్వల ద్వారా చేర్చేందుకు 1073 మిలియన్ క్యూబిక్ మీటర్ల జలాలు సరఫరా నష్టం పోను నికరంగా గోదావరి నదిలోకి 6500 మిలియన్ క్యూబిక్ మీటర్ల జలాలు చేరతాయి. ఒడిశా రాష్ట్రంలోని మహానదిపై నిర్మించిన మణిభద్ర డ్యాం నుంచి గోదావరి నది వరకు మొత్తం 822 కిలో మీటర్ల మేర కాల్వల వ్యవస్థను నిర్మిస్తారు. ఒడిశా రాష్ట్రంలోని నయాగర్ ప్రాంతం నుంచి కాల్వల వ్యవస్థ మొదలై కుర్ధా - గంజాం - గజపతి జిల్లాల మీదుగా ఏపీలోకి ప్రవేశిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌ లో ప్రవేశించిన తర్వాత శ్రీకాకుళం - విజయనగరం - విశాఖ జిల్లాల మీదుగా తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రవేశిస్తుంది. ధవళేశ్వరంలోని సర్ ఆర్ధర్ కాటన్ బ్యారేజికి ఎగువన 15 కిలోమీటర్ల వద్ద అంటే దాదాపు తొర్రేడు వద్ద మహానది జలాలు గోదావరిలో అనుసంధానం అవుతాయి. మణిభద్ర ప్రాజెక్టు వద్ద కాల్వల వ్యవస్థ మొదలయ్యే చోట 70 మెగావాట్ల పవర్‌ హౌస్‌ ను కూడా నిర్మిస్తారు. గత ఏడాది ఇందుకు సంబంధించి డీపీఆర్ తయారుచేశారు. కేంద్ర ప్రభుత్వం నదుల అనుసంధానం ప్రాజెక్టులను వేగవంతం చేయడంతో డీపీఆర్‌కు రూపకల్పనకు రంగం సిద్ధమైంది. గత డీపీఆర్ ప్రకారం ఈ ప్రాజెక్టుకు రూ.18,000 కోట్లు ఖర్చవుతుందని అంచనావేశారు. కొత్త డీపీఆర్‌ లో కేవలం నిధుల అంచనా వ్యయం మాత్రమే మారుతుందని తెలుస్తోంది.

822 కిలో మీటర్ల కాల్వల వ్యవస్థ కోసం సుమారు 22 వేల ఎకరాల భూమి అవసరం అవుతుంది. ఒడిస్సా రాష్ట్రంలో 340 కిలో మీటర్ల మేర కాల్వలు ఉంటాయి. మిగిలిన కాల్వలన్నీ వంశదార మీదుగా శ్రీకాకుళం - విజయనగరం జిల్లాల్లో ఉంటాయి. గోదావరి నుంచి ఈ నీటిని కృష్ణా - అక్కడ నుంచి నెల్లూరులోని పెన్నా నదికి - అక్కడ నుంచి సోమశిల ప్రాజెక్టు ద్వారా తమిళనాడు - కర్ణాటకలోని కావేరి నదికి అనుసంధానం చేస్తారు. మహానదితో గోదావరి అనుసంధానం వల్ల నదీ బేసిన్లన్నీ సమతుల్యత సాధిస్తాయి. ఒక బేసిన్ నుంచి మరో బేసిన్‌ కు జలాలను సర్దుబాటు చేయడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల ఏ బేసిన్‌ లో వర్షాభావ పరిస్థితులున్నప్పటికీ నీటిని సర్దుబాటు చేసుకుని, నికరంగా నీటిని పంపిణీ చేసుకునే వీలు క‌లుగుతుంది. గోదావరి - మహానది - కృష్ణా - కావేరి - పెన్నా బేసిన్లలో నీటికి ఎటువంటి ఇబ్బంది తలెత్తదు. ఈ నదుల బేసిన్ల అనుసంధాన ప్రక్రియ వల్ల విశేషమైన అభివృద్ధికి అవకాశముంటుందని జాతీయ వాటర్ డవలప్‌ మెంట్ ఏజెన్సీ (ఎన్‌ డబ్ల్యుడిఎ) అధ్యయనం చేసింది. ఈ అధ్యయనం ఆధారంగానే నదుల అనుసంధానం నిర్ణయాన్ని చేపట్టారు. ఎన్‌ డబ్ల్యుడిఎ వార్షికంగా 12,200 మిలియన్ క్యూబిక్ మీటర్ల జలాలను గోదావరి నదికి అనుసంధానం చేయొచ్చని అంచనావేసింది. నదుల అనుసంధానంవల్ల ఆయా ప్రాంతాల్లో 85శాతం కొత్త ఆయకట్టును సృష్టించవచ్చని అంచనావేశారు. ట్రాపెజొడాల్ రూపంలో (సన్నగా మొదలై వెడల్పుగా సాగే) మహానది నుంచి గోదావరి నదికి కాల్వను నిర్మిస్తారు. మహానది గోదావరి నదీ అనుసంధాన కొత్త డీపీఆర్ డిసెంబర్‌ కల్లా పూర్తి కానుందని తెలుస్తోంది. ఆ త‌ర్వాత కార్యాచ‌ర‌ణ ఉండ‌నున్న‌ట్లు స‌మాచారం.