ధొలెరా..ఏపీకి మోదీ చేసిన మోసానికి ప్రత్యక్ష సాక్షి

Sat Jun 02 2018 13:50:08 GMT+0530 (IST)

ధొలెరా ఎస్ ఐఆర్... గుజరాత్ రాష్ట్రంలో నిర్మిస్తున్న మహానగరం ఇది. ఇంకా చెప్పాలంటే ప్రధాని మోదీ కలల నగరం. దీన్ని ప్రపంచానికే వాణిజ్య రాజధానిని చేయాలన్నది ఆయన కోరిక. ఇది  ఎంత పెద్దదో తెలుసా..? మోదీ చెప్పిన ప్రకారం ఇది దేశ రాజధాని దిల్లీ కంటే రెండు రెట్లు పెద్దది. చైనా వాణిజ్య రాజధాని షాంఘై కంటే 6 రెట్లు పెద్దది. మరి ఏపీ రాజధాని అమరావతి... ఇందులో నాలుగో వంతు కూడా ఉండదు. కానీ.. ఏపీకి ఎందుకంత రాజధాని మోదీ సహా బీజేపీ నేతలు ప్రశ్నిస్తుంటారు. ఏపీకి ఎందుకంత రాజధాని అంటూ ఇప్పటికే ఎంతో అభివృద్ధి చెందిన గుజరాత్ లో ఇంతటి భారీ నగర నిర్మాణాన్ని పరుగులు తీయిస్తుండడాన్ని ఏమనుకోవాలి. మోదీది మోసం కాదా.. ఏపీ ప్రజలను ఆయన మోసగించడం లేదా? చిన్నచూపు చూడడం లేదా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర - ఇక్కడి ప్రజల అభివృద్ధిని అడ్డుకోవడం లేదా?
    
ఇంతకీ ధొలెరా నగర విస్తీర్ణమెంతో తెలుసా..? 920 చదరపు కిలోమీటర్లు. ఒక చదరపు కిలోమీటరుకు 247.105 ఎకరాలు. ఆ లెక్కన ధొలెరా నగర విస్తీర్ణం 227366.6 ఎకరాలు. అక్షరాలా.. 2 లక్షల 27 వేల 366 ఎకరాలన్నమాట. అమరావతి కంటే ఇది ఎంత పెద్దదో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇందులో పూర్తిస్థాయిలో డెవలప్ చేస్తున్న ప్రాంతం 423 చ.కి.మీ. అంటే.. 105513 ఎకరాలు.
    
ఇక ధొలెరాపై ఆయనకున్న ప్లానింగ్ తెలిస్తే షాకవుతాం. ఈ ప్రాంతాన్ని స్మార్ట్ సిటీగా రూపుదిద్దాలన్నది ప్రధాని అభిలాష. చైనా వాణిజ్య రాజధాని షాంగైలా.. ధోలెరాను తయారు చేయాలన్నది ప్రధాని మోడీ లక్ష్యం. దానికి తగ్గట్లే.. ఈ ప్రాంతం విస్తీర్ణం ఉండేలా ప్లాన్ చేశారు. ధోలెరా కోసం మొత్తం 920 చదరపు కిలోమీటర్ల భూమి సేకరించారు. ధొలెరాలో ప్రపంచ స్థాయి ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. ఎటుచూసినా నింగినంటే బహుళ అంతస్తులే కనిపిస్తాయి. అపార్ట్ మెంట్లు - విల్లాలు - ఆఫీసులు - పరిశ్రమలు - రోడ్లు - రవాణా సౌకర్యాలు అన్నీ ప్రపంచ స్థాయిలోనే ఉంటాయి.
    
ఇక్కడ హై యాక్సస్ కారిడార్ ప్రాంతంలో అయితే సిటీ సెంటర్ - ఇండస్ట్రియల్ లాజిస్టిక్ - నాలెడ్జ్-ఐడీ - రిక్రియేషన్-స్పోర్ట్స్ - ఎంటర్టైన్ మెంట్ విభాగాలు ఉంటాయి. ఇక్కడ నుంచి దేశంలోని ఇతర ప్రముఖ నగరాలకు రాకపోకల నిమిత్తం ట్రాన్స్ పోర్ట్ కు భారీ ప్రణాళికలే నిర్దేశించుకున్నారు. ఈ సూపర్ సిటీ నుంచి మెగా సిటీలైన అహ్మదాబాద్ - భావ్ నగర్ - వడోదరలకు భారీ రోడ్డు మార్గాలు నిర్మిస్తున్నారు. మెట్రో రైల్ తో పాటూ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మిస్తున్నారు. 1000 ఎకరాల్లో ఎయిర్ పోర్ట్ నిర్మాణం సాగనుంది. ఇక ఎస్ ఐఆర్ కు నౌకాశ్రయమూ దగ్గర్లోనే ఉంది. 2019నాటికి ధొలెరాలో కార్యకలాపాలు ప్రారంభించాలన్నది మోడీ టార్గెట్.
    
దీంతో ఏపీని నిర్లక్ష్యం చేస్తూ మోదీ సొంత రాష్ట్రంలోని ఈ నగరానికి భారీగా నిధులు కేటాయించారని ఆరోపిస్తున్నారు. ఏకంగా 44 వేల కోట్లు ఇచ్చారన్నది ఆయన ఆరోపణ. అయితే.. ధొలెరాను గుజరాత్ ప్రభుత్వం సొంత నిధులతో నిర్మిస్తోందని.. కేంద్రం నుంచి ఏమీ ఇవ్వడం లేదని అమిత్ షా అంటున్నారు. కానీ.. గుజరాత్ ప్రభుత్వ ప్రకటనల ప్రకారం చూస్తే కేంద్రం పరోక్షంగా రూ.17 వేల కోట్లు ఇచ్చినట్లు తేలింది. అదెలా అంటే... దిల్లీ-ముంబయి ఇండస్ట్రియల్ కారిడార్ కోసం కేంద్రం ఈ నిధులిచ్చింది. ఈ కారిడార్ లో ఉన్న ఎనిమిది స్మార్ట్ ఇన్వెస్టిమెంట్ రీజియన్లలో ధొలెరా ఒకటి. దీనికోసం 3 వేల కోట్లు కేంద్రం ఇస్తోంది. అందులో 1293 కోట్లు ఇప్పటికే రిలీజ్ చేశారు. మరోవైపు అమరావతి భాగంగా ఉన్న విశాఖ-చెన్నై ఇండస్ర్టియల్ కారిడార్ కు కేంద్రం పైసా కూడా ఇవ్వలేదు. ఇప్పటి వరకు అమరావతికి కేంద్రం 1500 కోట్లు ప్రకటించి అందులో 1000 కోట్లు మాత్రమే విడుదల చేసింది.
    
గుజరాత్ లో అహ్మదాబాద్ - బరోడా - సూరత్ - గాంధీనగర్ - భావ్ నగర్ వంటి ప్రధాన నగరాలున్నాయి. ఇవన్నీ వాణిజ్యపరంగా - పారిశ్రామికంగా బాగా అభివృద్ధి చెందినవే. కానీ.. ఏపీ విషయానికొస్తే రాజధానిని కోల్పోయింది. విశాఖ మినహా చెప్పుకోదగ్గ నగరమే లేదు. ఇలాంటి పరిస్థితిలో ఏపీని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ మోదీ తన కలల ప్రాజెక్టును ఇంతగా నెత్తిన మోయడం వివాదాస్పదమవుతోంది.