Begin typing your search above and press return to search.

ఉరిశిక్ష‌తో ఈజీగా లేపేయ‌వ‌చ్చంటున్న కేంద్రం

By:  Tupaki Desk   |   24 April 2018 10:49 AM GMT
ఉరిశిక్ష‌తో ఈజీగా లేపేయ‌వ‌చ్చంటున్న కేంద్రం
X
పన్నెండేళ్ల‌లోపు చిన్నారులపై లైంగికదాడులకు పాల్పడే వారికి మరణదండన విధించేలా కేంద్రం ఆర్డినెన్స్‌ను జారీచేసిన ఉదంతంపై కోర్టులో కేంద్ర ప్ర‌భుత్వం అఫిడ‌విట్ దాఖ‌లు చేసింది. ఉరిశిక్షకు బదులుగా ఇతర పద్దతుల్లో శిక్షను అమలు చేయాలని అడ్వొకేట్‌ రోషి మల్హోత్రా అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేయ‌గా...ఉరే స‌రి అని..విషపు ఇంజక్షన్లు - తుపాకితో చంపడం కంటే ఉరిశిక్ష ద్వారా చంపడమే సులువైన పద్దతిగా ఉంటుందని కేంద్రం అభిప్రాయపడింది. వాద‌న‌లు విన్న సుప్రీంకోర్టు విచార‌ణ‌ను వాయిదావేసింది.

లైంగికదాడులకు పాల్పడే వారికి మరణదండన విధించే ఆర్డినెన్స్‌ ను రాజకీయ పార్టీ లు, నేతలు స్వాగతిస్తుండగా బాలల హక్కుల సంఘాలు మాత్రం భిన్నంగా స్పందిస్తున్నాయి. బాలలపై లైంగికదాడి కేసుల్లో కుటుంబ సభ్యులే ఎక్కువ శాతం నిందితులుగా ఉండటంతోపాటు మరణ దండన వంటి కఠిన శిక్షలతో అసలు నేరాలే బయటకు రావని పేర్కొంటున్నారు. దేశవ్యాప్తంగా బాలల హక్కుల కార్యకర్తలు కేంద్ర క్యాబినెట్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న క్ర‌మంలోనే...ఉరి శిక్ష రద్దును చేసి ఇతర మార్గాల ద్వారా మరణ శిక్షను అమలుపరచాలని, ఈ మేరకు చట్టంలో సవరణ చేయాలని అడ్వొకేట్‌ రోషి మల్హోత్రా.. అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. ఉరి ముమ్మాటికీ వ్యక్తి స్వేచ్ఛా హక్కులను అగౌరవపరిచినట్లేనని ఆయన వాదనలు వినిపించారు. ఈ పిటిష‌న్‌ను విచార‌ణ‌కు తీసుకున్న సుప్రీంకోర్టు కేంద్రాన్ని అఫిడ‌విట్ దాఖ‌లు చేయాల‌ని కోరింది. తాజాగా కేంద్రం అఫిడ‌విట్ దాఖ‌లు చేసింది. విషపు ఇంజెక్షన్లు ఇచ్చి చంపటం, తుపాకులతో కాల్చి చంపటం కన్నా ఉరి శిక్ష చాలా సులువైన పద్ధతని.. సురక్షితంగా, త్వరగతిన అమలు చేసేందుకు వీలవుతుందని కౌంటర్‌ అఫిడవిట్‌లో కేంద్రం పేర్కొంది. కాగా, విచార‌ణ‌ను న్యాయ‌స్థానం వాయిదా వేసింది.

మ‌రోవైపు బాలల హక్కుల కేంద్రం కార్యకర్త భారతి అలీ మీడియాతో మాట్లాడుతూ లైంగికదాడుల్లో 95% కు టుంబ సభ్యుల వల్లే జరుగుతున్నాయని.. కేవలం 24% కేసుల్లోనే నిందితులపై నేర నిర్ధారణ జరుగుతున్నదని, పోస్కో చట్టం కింద కేవలం 20% కేసు ల్లోనే నేరనిర్ధారణ జరుగుతున్నదన్నారు. `రేప్ కేసుల్లో 90 రోజుల్లోపు నేర నిర్ధారణ జరుగకపోవడమే అతిపెద్ద సమస్య. ప్రపంచవ్యాప్తంగా చూస్తే కఠిన శిక్షల కంటే సత్వర న్యాయంతోనే నేరాలు తగ్గుతాయని అర్థమవుతోంది` అని భారతి అలీ తెలిపారు. `నేర నిర్ధారణే కష్టమైన మన దేశంలో ప్రభుత్వం మరిన్ని కఠిన చట్టాలు తెస్తోంది. బాలలపై ఎక్కువ లైంగికదాడులు కుటుంబ సభ్యులు, తెలిసిన వ్యక్తుల వల్లే జరుగుతున్నాయి. ఎక్కువ శాతం కేసులు వ్యవస్థ దృష్టికే రావు. పిల్లలపై లైంగికదాడులకు మరణదండన కేవలం 13 దేశాల్లో అది కూడా ఎక్కువగా ఇస్లామిక్ దేశాల్లోనే అమలులో ఉంది` అని విశ్లేషించారు. మరణదండన వంటి కఠిన శిక్షలతో సాక్షులు మారిపోవడం వంటి కారణాలతో నేర నిర్ధారణ రేటు తగ్గుతుందని బాలల హక్కుల రక్షణ జాతీయ కమిషన్ మాజీ సభ్యుడు వినోద్ టికూ అన్నారు. పిల్లల రేప్ కేసుల పరిష్కారానికి ప్రస్తుతం ఉన్న కోర్టులకు రెండు దశాబ్దాలు పడుతుందని కైలాశ్ సత్యార్థి చిల్డ్రెన్ ఫౌండేషన్ అధ్యయనం తెలిపింది.