Begin typing your search above and press return to search.

నాయకులను పక్కకు నెట్టి..అధికార్లతో తేల్చేస్తున్నారు!

By:  Tupaki Desk   |   20 Feb 2018 3:55 PM GMT
నాయకులను పక్కకు నెట్టి..అధికార్లతో తేల్చేస్తున్నారు!
X
చంద్రబాబు కేంద్రం మీద ఇన్నాళ్లుగా వేస్తున్న రంకెలకు ఫలితంగా ఏం దక్కబోతున్నదో గానీ.. ప్రస్తుతానికి కేంద్రం ఆయనను పక్కన పెట్టి, ఆయనతో చర్చలు - మాటలకు తెరదించి.. అధికార్లతో గణాంకాలు తెప్పించుకుని విభజన హామీల గురించి తుదికంటా తేల్చేసే కసరత్తులో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు రాష్ట్రంలోని విభజన హామీలతో నిమిత్తం వివిధ శాఖల ఉన్నతాధికార్ల సహా - చీఫ్ సెక్రటరీ కి కూడా కలిపి హస్తిన కు రావాల్సిందిగా పిలుపు వచ్చింది. 23వ తేదీన జరిగే ఈ సమావేశంలో మొత్తం లెక్కలు తేల్చేస్తారని అంతా అనుకుటున్నారు.

విభజన చట్టానికి సంబంధించిన పెండింగ్ అంశాలను చర్చించేందుకు ఢిల్లీ రావాల్సిందిగా మంగళవారం నాడు చీఫ్ సెక్రటరీ కి ఢిల్లీ ఆర్థిక శాఖ నుంచి లేఖ వచ్చింది. రాష్ట్రానికి దక్కవలసినవి అని భావిస్తున్న రైల్వేజోన్ - రాజధాని - పోర్టు - ఇతర అంశాలన్నింటికీ సంబంధించిన ఇతర అధికారులు అందరూ కూడా తమ వద్ద ఉన్న గణాంక వివరాలతో సహా ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా పురమాయించారు.

ఆయా విభజన హామీలకు సంబంధించి.. అసలు హామీ ఏంటి? ఇప్పటిదాకా చేసిందేమిటి? ఇంకా చేయాల్సి ఉన్నదేమిటి? అనే విషయాలను ఈ భేటీలో తేలుస్తారనే అంచనాలు సాగుతున్నాయి. రాష్ట్రానికి కేంద్రం ఇంకా ఎంత సాయం చేయబోతున్నదో ఈ భేటీ వల్ల స్పష్టత వస్తుందని అనుకుంటున్నారు.

రెండు రాష్ట్రాల మధ్య ఆస్తుల విభజనకు సంబంధించిన పెండింగ్ అంశాన్ని కూడా తేల్చడానికి ఇదే సమావేశానికి తెలంగాణ ఉన్నతాధికారుల్ని కూడా ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది. మీటింగు తరువాత అన్ని విషయాలూ కాగితం మీద లెక్కల సాక్షిగా తేలిపోతాయి.. ఇక చంద్రబాబునాయుడు ఫిర్యాదు చేయడానికి ఏం ఉండదని పలువురు అనుకుంటున్నారు.

కేంద్రం ఏం ఇచ్చింది.. రాష్ట్రం ఏ మొత్తాలను ఏ రూపంలో ఖర్చు పెట్టింది .. అనే విషయంలో ఇరు ప్రభుత్వాలకు చెందిన రాజకీయ నాయకులు ఎవరికి వారు సొంత లెక్కలు చెప్పుకుంటున్నారే తప్ప.. చిత్తశుద్ధితో ఎవరూ మాట్లాడడం జరగలేదు. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు అధికార్ల సమావేశం ఏర్పాటు చేయడం వల్ల - ఈ సమావేశానికి నేతలను దూరం పెట్టడం వల్ల... కేంద్రం ఇచ్చిన ప్రతి రూపాయికీ వారు ఖర్చుల లెక్క చెప్పాల్సి ఉంటుంది. భేటీ పూర్తయ్యే సరికి లెక్కల బ్యాలెన్స్ షీట్ ను కేంద్రం అధికారికంగా విడుదల చేసేస్తే.. ఇక చంద్రబాబు గొంతులో పచ్చివెలక్కాయ పడ్డట్లు అవుతుందని పలువురు అంచనా వేస్తున్నారు.