Begin typing your search above and press return to search.

బాబును ముంచ‌నున్న కుల రాజ‌కీయాలు

By:  Tupaki Desk   |   12 Jun 2018 9:55 AM GMT
బాబును ముంచ‌నున్న కుల రాజ‌కీయాలు
X
రాజకీయాల్లో చంద్ర‌బాబును మించిన అవ‌కాశ‌వాది మ‌రొక‌రు ఉండ‌రు. ఎవరిని ఎప్పుడు వాడుకుని ఎక్క‌డ వ‌దిలేస్తాడో బాబుకే తెలియ‌దు. బాబు స‌మైక్య‌రాష్ట్రంలో ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు మాల‌ - మాదిగ‌ల మ‌ధ్య చిచ్చుపెట్టి మంద‌కృష్ణ‌కు మ‌ద్ద‌తు ఇచ్చాడు. ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ పేరుతో వారిలో వారికే కొట్లాట‌లు పెట్టాడు చంద్ర‌బాబు. ఇప్పుడు లంబాడీలు - ఆదివాసీల‌కు కూడా అంటుకుంది. తెలంగాణ ఉద్య‌మం ఉదృతంగా ఉన్న స‌మ‌యంలో పెద్ద మాదిగ‌ను అంటూ మందకృష్ణ అండ‌తో తెలంగాణ‌లో చంద్ర‌బాబు నాయుడు పాదయాత్ర చేసి ఆంధ్రాలోకి అడుగుపెట్టాడు. తెలంగాణ‌లో ఎక్కువ‌గా ఉన్న మాదిగ‌ల‌ను - ఆంధ్రాలో ఎక్కువ‌గా మాల‌ల‌ను దువ్వేందుకు చంద్ర‌బాబు ప్ర‌య‌త్నాలు చేశాడు. బాబు ఊహ‌ల‌కు భిన్నంగా తెలంగాణ రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగిపోయింది.

ఆంధ్రప్ర‌దేశ్ లో అధికారం ద‌క్కించుకున్న చంద్ర‌బాబు నాయుడు మంద‌కృష్ణ‌కు అనుకోని షాక్ ఇచ్చాడు. ఆంధ్రాలో మాల‌లు అధికంగా ఉన్న నేప‌థ్యంలో ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌ను అట‌కెక్కించాడు. ఆంధ్రాలో మందకృష్ణ ప‌ర్య‌టించ‌డానికి కూడా ఎలాంటి అనుమ‌తి ఇవ్వ‌కుండా చంద్ర‌బాబు నాయుడు జాగ్ర‌త్త ప‌డుతూ వ‌స్తున్నాడు. దీంతో ఆంధ్రప్ర‌దేశ్ లోని మాదిగ సామాజిక వ‌ర్గం చంద్ర‌బాబు మీద గుర్రుగా ఉంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లోవారు బాబు మీద ప‌గ తీర్చుకోవ‌డానికి సిద్దంగా ఉన్నారు.

ఇక గ‌త ఎన్నిక‌ల్లో కాపుల‌ను బీసీల‌లో చేరుస్తాన‌ని హామీ ఇచ్చిన చంద్ర‌బాబు ఆ త‌రువాత దానిని నెర‌వేర్చ‌క‌పోగా వారి ఆందోళ‌న‌లు అణ‌గ‌దొక్క‌డం - పైగా వారి మీద కేసులు పెట్టి హింసించ‌డం కాపులు జీర్ణించుకోలేక పోతున్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాట‌లు విని టీడీపీకి ఓటేస్తే చంద్ర‌బాబు నాయుడు ఇంత మోసం చేస్తాడ‌ని ఊహించ‌లేక‌పోయామ‌ని కాపు నేత‌లు వాపోతున్నారు. కేవ‌లం కార్పోరేష‌న్ ప్ర‌క‌టించి చేతులు దులిపేసుకోవ‌డం వారికి ఏ మాత్రం మింగుడు ప‌డ‌డం లేదు. వారు రాబోయే ఎన్నిక‌ల్లో బాబుకు త‌గిన శాస్తి చేయ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. కాపుల‌ను బీసీల‌లో చేరుస్తాన‌న్న చంద్ర‌బాబు హామీ నేప‌థ్యంలో బీసీల‌లో ఉన్న కులాల నేత‌లు ప‌లువురు చంద్ర‌బాబుకు దూరం అయ్యారు.

ఈ గొడవ ఇలా ఉంటే బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గానికి చెందిన‌ మాజీ ఐఏఎస్ ఐవైఆర్ కృష్ణారావును అవ‌మాన‌క‌రంగా బ్రాహ్మ‌ణ కార్పోరేష‌న్ ప‌ద‌వి నుండి తొల‌గించ‌డంతో ఆ వ‌ర్గం కూడా చంద్ర‌బాబుకు దూరం అయింది. ఇప్పుడు తాజాగా టీటీడీ అర్చ‌కుల ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌సు 65 ఏళ్ల‌కు నిర్దారించడం - త‌న‌ను వ్య‌తిరేకించి ర‌మ‌ణ దీక్షితులు మీద త‌న పార్టీతో ఎదురుదాడి చేయించ‌డం చంద్ర‌బాబుకు న‌ష్టం చేకూర్చ‌డం ఖాయం అని అంటున్నారు. అధికారం కోసం కాపుల‌కు హామీ ఇచ్చి వారిని మోసం చేయ‌డం - అవ‌స‌రానికి మంద‌కృష్ణ‌ను వాడుకుని ఇప్పుడు అంటీముట్ట‌న‌ట్లు ఉండ‌డం - బ్రాహ్మ‌ణ‌వ‌ర్గంతో కోరి వైరం తెచ్చుకోవ‌డం చంద్ర‌బాబు ఓట‌మికి బాట‌లేన‌ని అంటున్నారు.