Begin typing your search above and press return to search.

గోవాలో కారు డ్రైవరు కూడా హెల్మెట్ పెట్టుకోవాలట

By:  Tupaki Desk   |   4 May 2016 12:11 PM GMT
గోవాలో కారు డ్రైవరు కూడా హెల్మెట్ పెట్టుకోవాలట
X
రాజ తలచుకెుంటే కొరడా దెబ్బలకు కొదవేముందని అంటుంటారు.. ఇప్పుడు రాజులు, రాజ్యాలు లేకపోయినా శిక్షలు, జరిమానాలు వేయడానికి పోలీసులనేవారు తయారయ్యేవారు. దీంతో పోలీసులు తలచుకోవాలే కానీ ఫైనెయ్యడానికి కారణమెందుకు? అన్న కొత్త సామెత పుట్టుకొచ్చింది. గోవాలో ఓ ట్రాఫిక్ పోలీసు చేసిన పని చూస్తే ఈ కొత్త సామెత నూటికి నూరుపాళ్లు నిజమని ఒప్పుకొని తీరాల్సిందే. ఆయన చేసిన పని వల్ల పోలీసులకు అంతో మిగిలిన పరువు అరేబియా సముంద్రంలో కలిసిపోయింది.

గోవాలోని పనాజీ సమీపంలోని కోల్వా బీచ్ సమీపంలోని ఓ గ్రామంలో ఏక్ నాథ్ అనంత్ పాల్కర్ అనే వ్యక్తి కారు నడుపుకుంటూ వెళ్తున్నారు. ఇంతలో ఆ కారును ట్రాఫిక్ ఎస్సై ఎస్ ఎల్ హనుషి కట్టి అడ్డుకున్నారు. కారు డ్రైవర్ కి హెల్మెట్ లేదని.. మోటారు వాహన చట్టంలోని సెక్షన్ 177 ప్రకారం హెల్మెట్ లేకపోతే ఫైను కట్టాల్సిందేనంటూ చలానా రాశారు. మోటారు వాహన చట్టంలో 177 సెక్షన్ ప్రకారం ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్నప్పుడు హెల్మెట్ ధరించకపోయినా, లైసెన్స్ లేకపోయినా చలానా రాస్తారు. కారులో ప్రయాణించే వ్యక్తి హెల్మెట్ ఎలా పెట్టుకుంటాడన్న విషయం మాత్రం ఎస్సై మర్చిపోయినట్లున్నాడు. అయితే... ఆయన పొరపాటుగా అలా రాసి ఉంటారని పోలీసు శాఖ సమర్ధించుకుంది. కారు డ్రైవర్ కు హెల్మెట్ పెట్టుకోలేదని చలానా రాసే మూర్ఖ ట్రాఫిక్ పోలీసులు ఉండరని సీనియర్ పోలీసు అధికారులు అంటున్నారు.

కాగా ఆ కారు డ్రైవరుతో వ్యక్తిగత కక్షల కారణంగానే ట్రాఫిక్ ఎస్సై చలానా రాశాడన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఎలాగైనా చాలానా రాయాలని చాలాకాలంగా అనుకుంటున్నా కుదరకపోవడంతో ఇక లాభం లేదని హెల్మెట్ లేదన్న కారణంతో చలానా ఇచ్చాడని తెలుస్తోంది. ఏదైనా కానీ పోలీసుల్లో కూడా ఇలాంటి మూర్ఖులుంటారని నిరూపించాడా ఎస్సై.