Begin typing your search above and press return to search.

నాన్నను మార్చలేం కదా.. కవిత నిర్వేదం

By:  Tupaki Desk   |   23 Feb 2019 5:48 AM GMT
నాన్నను మార్చలేం కదా.. కవిత నిర్వేదం
X
రెండో దఫా తెలంగాణ కేబినెట్ విస్తరణ జరిగింది. ఈసారి కూడా సీఎం కేసీఆర్ అదే విమర్శలను ఎదుర్కొంటున్నారు. తెలంగాణ ఏర్పడ్డాక తొలి ప్రభుత్వంలో మహిళలకు చోటివ్వలేదు కేసీఆర్. ఆ ఐదేళ్లు ప్రతిపక్షాల నుంచి మహిళల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు రెండో సారి కూడా నాన్చి నాన్చి చివరకు మహిళలకు తొలి కేబినెట్ విస్తరణలో ప్రాతినిధ్యం కల్పించలేదు. ఇదే విషయంపై మంత్రి జగదీశ్ రెడ్డిని విలేకరులు ప్రశ్నిస్తే ‘మహిళలు ఇంట్లో ఉంటారు కదా.. కేబినెట్ లో ఎందుకు?’ అంటూ చేసిన పరుష వ్యాఖ్యలు కలకలం రేపాయి.

ఇటువంటి పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న మహిళా నేత - నిజామాబాద్ ఎంపీ - కేసీఆర్ కూతురు కవిత కూడా విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది. తాజాగా ఆమెకు ఇదే ప్రశ్న ఎదురైంది. కేసీఆర్ కేబినెట్ లో ఈసారి కూడా మహిళలకు స్థానం ఉంటుందా అని తాజాగా కవితను కొందరు ప్రశ్నించగా ఆమె నిర్వేదంతో మాట్లాడారు.. ‘నా తండ్రి మనసును మార్చలేం.. ఆయన్ను ప్రభావితం చేసేంత స్థాయి ఎవ్వరికీ లేదు కదా’ అంటూ వాపోయారట..

ఈ సందర్భంగా కవిత కవర్ చేసే ప్రయత్నం కూడా చేసింది. దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా మహిళలకు సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదని చెప్పుకొచ్చింది. టీఆర్ ఎస్ - కాంగ్రెస్ సహా ఏ ఇతర పార్టీ అయినా రాజకీయాల్లో మహిళలకు సమానమైన స్థానం ఇవ్వడం లేదని పేర్కొంది. టీఆర్ ఎస్ లోని మొత్తం 90మంది ఎమ్మెల్యేల్లో కేవలం నలుగురు మాత్రమే మహిళలు ఉండడం దురదృష్టం అంటూ వ్యాఖ్యానించింది. సంఖ్య తక్కువైనా మహిళలకు కేబినెట్ లో ప్రాతినిధ్యం తప్పనిసరిగా కల్పించాలని కవిత స్పష్టం చేసింది.

‘తాను రాజకీయాల్లో జూనియర్ ని.. 30 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న నా తండ్రికి అన్నీ తెలుసు. అందుకే ఆయన్ను ఏ విషయంలోనూ ప్రభావితం చేయలేకపోతున్నా’ అంటూ కవిత సంచలన కామెంట్స్ చేశారు.

కవిత తన తండ్రి సీఎం కేసీఆర్ వైఖరి విషయంలో చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. ఎంపీగా - కేసీఆర్ కుమార్తెగా టీఆర్ ఎస్ లో కీలకంగా ఉన్న కవిత లాంటి నేతలు కూడా తాము ఏమీ చేయలేమని పేర్కొనడం పరిస్థితికి అద్దం పడుతోంది. ప్రజాప్రతినిధిగా మహిళలకోసం పాటుపడుతాను కానీ పదవుల విషయంలో ఏం చేయలేమని కవిత నిస్సహాయత వ్యక్తం చేయడం రాజకీయంగా దుమారం రేపుతోంది. తండ్రి కేసీఆర్ వైఖరిపై కవిత ఇలా తొలిసారి పరోక్షంగా తప్పుపట్టడం సంచలనం రేపుతోంది.