Begin typing your search above and press return to search.

మోడీకి క‌లిసి రాని బెంగాల్ టూర్‌

By:  Tupaki Desk   |   16 July 2018 12:38 PM GMT
మోడీకి క‌లిసి రాని బెంగాల్ టూర్‌
X
అంద‌ని ద్రాక్ష ఎప్పుడూ పుల్ల‌నే. కానీ.. మోడీ లాంటోడికి మాత్రం తియ్య‌న‌. త‌న‌కు చిక్క‌కుండా ఎప్ప‌టిక‌ప్పుడు ఊరించే బెంగాల్లో పాగా వేయాల‌న్న‌ది మోడీ క‌ల‌. ఎంత ప్ర‌య‌త్నించినా.. త‌న మాట విన‌ని బెంగాలీలను ఏదోలా మెస్మ‌రైజ్ చేసేందుకు ఆయ‌న తెగ తాప‌త్ర‌య‌ప‌డుతుంటారు. త‌న‌ను చూసేందుకు.. త‌న మాట‌లు వినేందుకు పెద్ద ఎత్తున జ‌నం వ‌చ్చినా.. ఓట్లు గుద్దే స‌మ‌యానికి మాత్రం దీదీ మీద మ‌క్కువ చూపే బెంగాలీల మ‌న‌సుల్ని దోచుకునే ల‌క్ష్యంతో అదే ప‌నిగా బెంగాల్ ప‌ర్య‌ట‌న‌లు చేస్తుంటారు మోడీ.

ప్ర‌ధానికి ఒక చిత్ర‌మైన అల‌వాటు ఉంది. ఎక్క‌డైతే ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతాయో.. అక్క‌డ ఎక్కువ‌గా దృష్టిపెడ‌తారు. వారం.. వారం అన్న‌ట్లుగా ఆయ‌న ప‌ని పెట్టుకొని మ‌రీ టూర్ వేస్తుంటారు. అలా వేసి.. వేసి.. క‌శ్మీర్ ను ఒక కొలిక్కి తేవ‌టాన్ని మ‌ర్చిపోకూడ‌దు. ఒక్క కశ్మీర్ మాత్ర‌మే కాదు.. ఈశాన్య రాష్ట్రాల్లో ఈ రోజు బీజేపీ జెండా ఎగురుతున్న‌దంటే దానికి కార‌ణం.. మోడీనే.

ఆదివారం వ‌స్తే మిగిలిన రాజ‌కీయ నేత‌ల‌కు.. అధినేత‌ల‌కు భిన్నంగా మోడీ.. త‌న‌కు ఏ మాత్రం కొరుకుడుప‌డ‌ని ప్రాంతాల మీద ఫోకస్ చేస్తారు. అదే ప‌నిగా ఆ ప్రాంతంలో పర్య‌టిస్తూ.. ఆ ప్రాంతం ప‌ట్ల త‌న‌కున్న క‌మిట్ మెంట్ ను ప్ర‌ద‌ర్శించే ప్ర‌య‌త్నం చేస్తారు. అదే రీతిలో ప‌శ్చిమ‌బెంగాల్ మీద దృష్టిపెట్టే ఆయ‌న‌.. త‌ర‌చూ ఆ రాష్ట్రంలో ఏదో ఒక కార్య‌క్ర‌మాన్ని పెట్టుకొని మ‌రీ ప‌ర్య‌టిస్తున్నారు.

తాజాగా మిడ్నాపూర్ లో ఒక ర్యాలీ క‌మ్ స‌భ‌ను ఏర్పాటు చేశారు. ప్ర‌ధానిని చూసేందుకు పెద్ద ఎత్తున జ‌నాలు పోటెత్తారు. అంచ‌నాకు త‌గ్గ‌ట్లు ఏర్పాట్లు చేసినా.. అవ‌న్నీ తూతూ మంత్రంగా ఉండ‌టం వ‌ల్ల కావొచ్చు.. ప్ర‌ధాని ప్రసంగిస్తుండ‌గా టెంట్ పాక్షికంగా కూలింది. దీంతో సుమారు 20 మంది గాయ‌ప‌డ్డారు. దెబ్బ‌లు తాకించుకున్న వారిలో ఎక్కువ మంది మ‌హిళ‌లే. వీరిని వెంట‌నే మోటార్ వాహ‌నాలు.. అంబులెన్స్ ల‌లో ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

వారికి సాయంగా ప్ర‌ధాని కాన్వాయ్ కూడా ఫాలో అయ్యింది. దెబ్బలు తిన్న వారికి సాయం అందించాల్సిందిగా ఎస్ పీజీ సిబ్బందికి ప్ర‌ధాని ఆదేశించ‌టంతో వారు సైతం రంగంలోకి దిగారు. త‌న‌ను చూసేందుకు ఉత్సాహం చూపిస్తున్న వారిని ఉద్దేశించి టెంట్ లో కొంత భాగం కూలింద‌ని.. మిగిలిన వారు తోసుకోకుండా జాగ్ర‌త్త‌గా బ‌య‌ట‌కు వెళ్లాల‌ని సూచ‌న‌లు చేశారు. దెబ్బ‌లు తిని ఆసుప‌త్రిలో చికిత్స తీసుకుంటున్న క్ష‌త‌గాత్రుల్ని స్వ‌యంగా ప‌రామ‌ర్శించిన మోడీ.. తిరుగుముఖం ప‌ట్టారు. అయితే.. టెంట్ కూల‌టానికి దాదాపు 40 నిమిషాల పాటు మోడీ ప్ర‌సంగించారు. ఇంత క‌ష్ట‌ప‌డుతున్న మోడీ విష‌యంలో బెంగాల్ ప్ర‌జ‌ల మైండ్ సెట్ ఈసారైనా మారుతుందేమో చూడాలి.