Begin typing your search above and press return to search.

తెలంగాణలో రేపు కేబుల్ బొమ్మ కనపడదా?

By:  Tupaki Desk   |   6 Oct 2015 5:41 AM GMT
తెలంగాణలో రేపు కేబుల్ బొమ్మ కనపడదా?
X
ఎన్నో ఏళ్లుగా నానుతున్న కేబుల్ డిజిటిలైజేషన్ మాట.. మరికొద్ది రోజుల్లో మార్చాల్సిన పరిస్థితి. వీక్షకులకు నాణ్యమైన ప్రసారాలు అందించటం.. డిజిటిలైజేషన్ తో ఈ రంగానికి సంబంధించిన అంశాల్లో మరింత పారదర్శకత పెంపొందేలా చేయాలని కేంద్రం భావిస్తోంది. ఇందుకోసం ఇప్పటికే పలుమార్లు తుది గడువు ఇచ్చినా.. తర్వలో ఆ గడువు ముగియనుంది.

దీంతో.. కేబుల్ టీవీ ఆపరేట్లరంతా సెటప్ బాక్సులు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అయితే.. ఈ విధానంపై గుర్రుగా ఉన్నారు తెలంగాణ కేబుల్ టీవీ ఆపరేటర్ల సంఘం. సెటప్ బాక్సులు ఏర్పాటు చేసి.. డిజిటలైజ్ చేస్తే.. నెలకు కేబుల్ బిల్లు రూ.500 నుంచి రూ.600 వరకు వెళుతుందన్నది ఆపరేటర్ల వాదన. అదే జరిగితే.. వినియోగదారులు అంత మొత్తాన్ని ఇవ్వలేరని.. ఇది ఇబ్బందికరంగా మారతుందని చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో కేంద్ర సర్కారు నిర్ణయాన్ని నిరసిస్తూ.. బుధవారం తెలంగాణ వ్యాప్తంగా కేబుల్ టీవీ ఆపరేటర్లు ప్రసారాల్ని నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. తెలంగాణ కేబుల్ ఆపరేటర్ల సంక్షేమ సంఘం అధ్యక్షులు జితేందర్ మాట్లాడుతూ.. భుధవారం ఉదయం 6 గంటల నుంచి 24 గంటల పాటు తమ సమ్మె సాగుతుందని పేర్కొన్నారు. జీవితంలో టీవీ అన్నది ఒక అవయువంగా మారిపోయిన నేపథ్యంలో.. కేబుల్ టీవీ ప్రసారాలు 24 గంట పాటు ప్రసారం కాకపోవటంపై ఎలాంటి ప్రభావం పడుతుందో చూడాలి. అయితే.. కేబుల్ కనెక్షన్లు లేకుండా.. సెటప్ బాక్సులున్న వారి ప్రసారాలు యథావిధిగా ప్రసారం కానున్నాయి. మొత్తానికి తెలంగాణ వ్యాప్తంగా కేబుల్ టీవీ కనెక్షన్ ఉన్న టీవీలన్నీ 24 గంటల పాటు మూగబోతాయన్న మాట.