Begin typing your search above and press return to search.

కుండ‌బ‌ద్ధ‌లు: ప‌్ర‌త్యేక హోదా లేద‌నేశారు

By:  Tupaki Desk   |   29 April 2016 3:13 PM GMT
కుండ‌బ‌ద్ధ‌లు: ప‌్ర‌త్యేక హోదా లేద‌నేశారు
X
ఏపీ ప్ర‌త్యేక హోదా మీద ఉన్న దింపుడు క‌ళ్లెం ఆశ‌లు కూడా లేన‌ట్లే. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇచ్చే విష‌యంలో కేంద్ర‌మంత్రి ఒక‌రు రాజ్య‌స‌భ‌లో కుండ‌బ‌ద్ధ‌లు కొట్టిన తీరు చూసిన‌ప్పుడు.. ఏపీకి మొండి చేయి ఖాయ‌మ‌ని అర్థ‌మ‌వుతుంది. ఏపీ ప్ర‌త్యేక హోదాపై ప్ర‌వేశ‌పెట్టిన ప్రైవేటు మెంబ‌రు బిల్లుపై చ‌ర్చ జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా ఏపీ కాంగ్రెస్‌.. బీజేపీ.. తెలుగుదేశం నేత‌లు వాగ్వాదం చోటు చేసుకుంది.

ఏపీ కాంగ్రెస్ నేత జేడీ శీలం చేసిన ప్ర‌సంగానికి స‌మాధానం చెప్పే ప‌నిలో భాగంగా కేంద్ర‌మంత్రి హెచ్‌ పీ చౌద‌రి మాట్లాడుతూ.. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వాల్సిన అవ‌స‌రం లేద‌ని తేల్చి చెప్ప‌టం గ‌మ‌నార్హం. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి ఏం కావాల‌న్న‌ది చ‌ట్టంలో ఉంద‌ని.. వాటిని అమ‌లు చేస్తున్న‌ట్లు చెప్పారు. విభ‌జ‌న చ‌ట్టంలోనిఅంశాల్ని నీతి ఆయోగ్ అధ్య‌య‌నం చేస్తుంద‌ని.. ఏపీకి ఆర్థిక సాయం చేసే విష‌యంలో నీతి ఆయోగ్ నివేదిక ఇస్తుంద‌ని. .దాని కోసం కేంద్రం ఎదురుచూస్తున్న‌ట్లుగా చెప్పారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌లు ఏమాత్రం కోరుకోని విభ‌జ‌న‌తో ఏపీ పీక‌ను కాంగ్రెస్ నొక్కేస్తే.. ప్ర‌త్యేక హోదా.. ఆర్థిక సాయం లాంటి వ‌రాల‌తో ఏపీకి కొన ఊపిరి అయినా ఉండేలా చేస్తుంద‌ని మోడీ స‌ర్కారు మీద పెట్టుకున్న ఆశ‌లు అడియాస‌లు చేయ‌ట‌మే కాదు.. స‌మీప భ‌విష్య‌త్తులో ఏపీ కోలుకోకుండా దెబ్బ కొట్టేసింది ఎన్డీయే స‌ర్కారు.

విభ‌జ‌న స‌మ‌యంలో సాక్ష్యాత్తు నాటి దేశ ప్ర‌దాని ఏపీకి ప్ర‌త్యేక హోదా గురించి హామీ ఇచ్చిన విష‌యాన్ని ఇన్నాళ్లు.. చెప్పి చెప్ప‌న‌ట్లుగా చెబుతూ బండి న‌డిపిస్తున్న మోడీ స‌ర్కారు.. ఇప్పుడు ఉన్న ప‌ళంగా ప్ర‌త్యేక హోదా అవ‌స‌రం లేద‌ని తేల్చేసిన తీరు చూస్తే.. ఏపీ ప‌ట్ల మోడీ స‌ర్కారుకు ఎలాంటి అభిమానం లేద‌న్న విష‌యం స్ప‌ష్టం అవుతుంది. అభిమానం లేకున్నా ఫ‌ర్లేదు.. గ‌త ప్ర‌ధాని ఇచ్చిన హామీల్ని నెర‌వేర్చాల‌న్న ఆలోచ‌న లేద‌న్న విష‌యం అర్థం కాక మాన‌దు.

విభ‌జ‌న కార‌ణంగా ఏపీకి జ‌రిగిన న‌ష్టం ఎంత తీవ్ర‌మైన‌ద‌న్న విష‌యం తాజాగా చోటు చేసుకున్న ప‌రిణామాలు చూస్తే తెలుస్తుంది. ప‌క్క‌నే ఉన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి త‌మ‌ది సంప‌న్న రాష్ట్ర‌మ‌ని చెప్పుకుంటూ భారీగా అభివృద్ధి కార్య‌క్ర‌మాల్ని చేప‌డుతుంటే.. మ‌రోవైపు నిధుల కోసం క‌ట‌క‌ట‌తో ఏపీ స‌ర్కారు కిందామీదా ప‌డే దుస్థితి. ఇలాంటి ఇబ్బందుల‌కు ప్ర‌త్యేక హోదా ఎంతోకొంత ప‌రిష్కారం చూపుతుంద‌ని భావించినా.. అలాంటిదేమీ లేద‌న్న విష‌యాన్ని కేంద్ర‌మంత్రి చౌద‌రి తేల్చి చెప్ప‌టం ద్వారా.. ఏపీ చేతికి చిప్పేన‌న్న విష‌యం తేలిపోయింది.