Begin typing your search above and press return to search.

మోడీ నితీశ్ ను బీహార్ సీఎం చేస్తున్నారా..?

By:  Tupaki Desk   |   9 Oct 2015 7:43 AM GMT
మోడీ నితీశ్ ను బీహార్ సీఎం చేస్తున్నారా..?
X
బీహార్‌ ఓటర్లు ఈసారి ఎన్నికల్లో ఎటువైపు మొగ్గు చూపుతారన్నది అంతటా ఆసక్తిగా మారింది... ఫలితాలపై అంచనా సర్వేలు కూడా ఇతమిద్ధంగా ఏ విషయం చెప్పలేకపోతున్నాయి. ఒక్కో సర్వే తీరు ఒక్కోలా ఉంటోంది... అయితే.... ఏ సర్వే ఎలా ఉన్నప్పటికీ ప్రధాని మోడీ నేతృత్వంలోని బీజేపీ మాత్రం బీహార్లో అద్భుతాలేమీ సృష్టించబోవడం లేదని చెబుతున్నాయి. ఎలాగైనా బీహారీ ఓటరును బుట్టలో వేసుకోవాలన్న ఒకే ఒక్క ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల కడుపుకొట్టి బీహార్ కు ఏకంగా లక్షా ఇరవై వేల కోట్ల ప్యాకేజీని అనౌన్స్ చేశారు ప్రధాని మోడీ... కానీ, ఆ ప్రభావం.. మోడీ ఛరిష్మా వంటివేమీ బీహారీలను ఆకట్టుకున్నట్లు లేవు. తాజాగా సిఎన్‌ ఎన్‌-ఐబిఎన్‌ సర్వేలో బిజెపికి ఓటమి తప్పదన్నట్లు తెలుస్తోంది. జెడియూ కూటమి స్వల్ప ఆధిక్యంతో బయటపడుతొందని ఈ సర్వే వెల్లడించింది. అయితే... సి ఓటర్ సర్వే మాత్రం బీజేపీకి 119 సీట్లు వస్తాయని చెబుతోంది. అయితే... ఇది కూడా అధికారం దక్కించుకోవడానికి సరిపడా మెజార్టీ కాదు. ఇండియాటుడే సర్వే ప్రకారం మాత్రం అధికారం అందుకునేది బీజేపీయే.

సీఎన్ ఎన్- ఐబీఎన్ సర్వే ప్రకారం జెడియూ-ఆర్జేడి కూటమికి 129-145 సీట్లు వచ్చే అవకాశాలుండగా, బిజెపి కూటమికి 87-103 స్థానాలు రావొచ్చని అంచనా. ములాయం, ఎమ్‌ ఐఎమ్‌ తదితర పార్టీలకు 8-14 సీట్లు వస్తాయని అంచనావేస్తున్నారు. 243 స్థానాలున్న బీహార్‌ అసెంబ్లీలో 122 సీట్లు సాధిస్తే అధికారం దక్కుతుంది. ఇండియా టీవి- సీ ఓటర్‌ నిర్వహించిన సర్వేలో ఎన్డీయేకు 119 స్థానాలు, జెడియూ కూటమి 116 స్థానాలు దక్కనున్నట్లు తెలిపింది. ఇండియా టుడే - సిసిరో సంయుక్త సర్వేలో బిజెపి కూటమికి 125 స్థానాలు, జెడియూ 106 స్థానాలు దక్కతున్నాయని వెల్లడైంది.

సీఎన్ ఎన్- ఐబీఎన్ సర్వే ప్రకారం నితిష్ కుమార్ పార్టీ జెడియు స్వంతంగా తాను పోటీ చేసిన 100 సీట్లలో 64-74 గెలుచుకుంటుంది. లాలూ ప్రసాద్ యాద‌వ్ పార్టీ ఆర్జేడీ... తాను పోటీ చేసిన 100 సీట్లలో దాదాపు 46 నుంచి 50 దాకా గెలుచుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ మొత్తం 40 సీట్లలో పోటీచేస్తుండగా 19 నుంచి 21 సీట్లు రావొచ్చని భావిస్తున్నారు.

ఇక ఎన్డీయే కూటమిలోని బీజేపీకి 77 నుంచి 87 సీట్లు, రామ్ విలాస్ పాశ్వాన్ పార్టీ లోక్ జ‌న‌శ‌క్తి కేవ‌లం 1 నుంచి 3 సీట్లు, ఉపేంద్ర కుశ్వాహ‌కు చెందిన ఆరెస్సెల్పీ 2 నుంచి 4 సీట్లు, మాజీ ముఖ్యమంత్రి జిత‌న్ రామ్ మాంజికి చెందిన పార్టీ 7 నుంచి 9 సీట్లను గెలుచుకోవచ్చని అంచనా.

మొత్తానికి లెక్కలన్నీ నితీశ్ కుమార్ బీహార్ సీఎం అవుతారని చెప్పకనే చెబుతున్నాయి. ఇదే జరిగితే మోడీ మొఖం ఎక్కడ పెట్టుకోవాలో..!! కాగా తాను ప్రధాని అయిన తరువాత ఢిల్లీలో ఒకమారు దెబ్బతిన్న మోడీ ఇప్పడు బీహార్ లోనూ దెబ్బతింటే విపక్షాల చేతికి చిక్కినట్లే. ఆయన ప్రభ ఏడాదిలోనే మసకబారినట్లు అర్థం చేసుకోవచ్చు. ఇది దేశంలోనే కాదు అంతర్జాతీయంగానూ మోడీకి నష్టం తేవడం గ్యారంటీ.