Begin typing your search above and press return to search.

ఢిల్లీ ఓట‌రు మైండ్ సెట్ చెప్పిన తాజా స‌ర్వే!

By:  Tupaki Desk   |   22 Jun 2018 5:15 AM GMT
ఢిల్లీ ఓట‌రు మైండ్ సెట్ చెప్పిన తాజా స‌ర్వే!
X
దేశంలోని రాష్ట్రాల‌న్నీ ఒక ఎత్తు అయితే.. ఢిల్లీ రాష్ట్రంలో రాజ‌కీయం తీరు మ‌రో ఎత్తు. ఇక్క‌డ అధికారంలో ఉన్న రాష్ట్ర ప్ర‌భుత్వ అధికారం అంతంత మాత్ర‌మే. మోడీ ప్ర‌భ‌కు చెక్ పెడుతూ.. ఆమ్ ఆద్మీ పార్టీ సాధించిన చారిత్ర‌క విజ‌యం తెలిసిందే. దేశం మొత్తం మోడీ.. మోడీ అంటూ ఊగిపోతున్న వేళ‌.. దిమ్మ తిరిగేలా షాకిచ్చిన ప్ర‌త్యేక‌త ఢిల్లీ ప్ర‌జ‌ల‌ది. మ‌రి.. అలాంటి వారు ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగే వారేం చేస్తార‌న్న అంశంపై ఏబీపీ న్యూస్ - సి ఓట‌ర్ తాజాగా స‌ర్వే నిర్వ‌హించింది. దీనికి సంబంధించిన ఆస‌క్తిక‌ర అంశాల్ని వెల్ల‌డించింది.

తాజా స‌ర్వే ఫ‌లితం చూస్తే.. అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి షాకింగ్ గా మారితే.. బీజేపీకి మాత్రం స్వీట్ న్యూస్ గా చెబుతున్నారు. ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నిక‌లు జ‌రిగితే ఆమ్ ఆద్మీ.. బీజేపీకి మ‌ధ్య హోరాహోరీగా పోరు సాగుతుంద‌ని చెబుతున్నారు. ఆమ్ ఆద్మీకి 39 శాతం ఓట్లు వ‌స్తే.. బీజేపీకి 38 శాతం రావొచ్చ‌న్న అంచ‌నా వేసింది. తాజా స‌ర్వే తేల్చిన మ‌రో ఆస‌క్తిక‌ర అంశం ఏమిటంటే.. ఆప్ ఓట్లు గ‌ణ‌నీయంగా త‌గ్గితే.. బీజేపీకి పెరుగుతున్న‌ట్లుగా తేల్చారు.

2015 మొద‌ట్లో జ‌రిగిన ఢిల్లీ రాష్ట్ర ఎన్నిక‌ల్లో ఆప్ కు ఏకంగా 54.3 శాతం ఓట్లు న‌మోద‌య్యాయి. తాజా స‌ర్వేలో మాత్రం ఆ పార్టీకి 39 శాతం ఓట్ల‌కు ప‌డిపోతుంద‌ని లెక్క క‌ట్టింది. అదే స‌మ‌యంలో నాటి దారుణ ప‌రాజ‌యం సంద‌ర్భంగా బీజేపీకి 32.3 శాతం ఓట్లు రాగా.. ఇప్పుడు మాత్రం త‌న ఓట్ల‌ను 38 శాతానికి పెంచుకోవ‌టంలో స‌క్సెస్ అయ్యింది.

ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే.. లోక్ స‌భ ఎన్నిక‌ల్లో బీజేపీకి ఓట్లు వేస్తామ‌ని.. అదే స‌మ‌యంలో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రిగితే మాత్రం ఆమ్ ఆద్మీకి ఓటు వేయ‌నున్న‌ట్లు చెప్ప‌టం గ‌మ‌నార్హం. ఇక‌.. కేజ్రీవాల్ స‌ర్కారు ప‌ని తీరుపై 67 శాతం మంది సంతృప్తి వ్య‌క్తం చేయ‌గా.. 32 శాతం మంది అసంతృప్తి వ్య‌క్తం చేశారు. ఒక శాతం మంది ఏమీ చెప్ప‌లేమ‌న్నారు. ఆస‌క్తిక‌ర‌మైన మ‌రో అంశం ఏమిటంటే.. కేజ్రీవాల్ స‌ర్కార్ ప‌ని చేయ‌కుండా కేంద్రంలోని మోడీ స‌ర్కారు మోకాల‌డ్డు పెడుతుంద‌న్న విష‌యాన్ని 50 శాతం మంది చెప్పిన‌ట్లుగా స‌ర్వే పేర్కొంది.

లోక్ స‌భ‌కు ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే ఢిల్లీ ఓట‌ర్ల మ‌ద్ద‌తు బీజేపీకే ఉండ‌నుంది. 40 శాతం మంది ఓట‌ర్లు బీజేపీకి ఓటు వేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. అదే స‌మ‌యంలో అసెంబ్లీకి ఎన్నిక‌లు జ‌రిగితే మాత్రం ఆప్ కే త‌మ మ‌ద్ద‌తు అని చెప్పారు. అయితే.. పోటీ మాత్రం తీవ్రంగా ఉంటుంద‌న్న విష‌యాన్ని తాజా గ‌ణాంకాలు స్ప‌ష్టం చేస్తున్నాయి.