Begin typing your search above and press return to search.

బాబుకు చెలగాటం.. అధికారులకు ప్రాణ సంకటం

By:  Tupaki Desk   |   19 April 2019 3:56 PM GMT
బాబుకు చెలగాటం.. అధికారులకు ప్రాణ సంకటం
X
చంద్రబాబు సమీక్షల వ్యవహారంపై ఈసీ సీరియస్ అయింది. ఈ సమీక్షల్లో అధికారులు పాల్గొనడంపై ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేది ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంను వివరణ కోరారు. సమీక్షల్లో పాల్గొన్న అధికారులకు నోటీసులిచ్చారు. నిన్న పోలవరం నిర్మాణంపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అనంతరం రాజధాని నిర్మాణ పనులపై సమీక్ష నిర్వహించి ఎమ్మెల్యే క్వార్టర్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని - కనెక్టివిటీ రోడ్ల నిర్మాణాన్ని న్యాయ వివాదాలు లేకుండా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

ఈ సమీక్షలపై ఎన్నికల ప్రధాన అధికారికి వైసీపీ ఫిర్యాదు చేసింది. సీఎం చంద్రబాబు నిర్వహించిన సమీక్షలపై వైసీపీ ఫిర్యాదు చేసిందని - దీనిపై సీఎస్ ద్వారా సంబంధిత శాఖాధికారులను వివరణ కోరుతామని ద్వివేది స్పష్టం చేశారు. ఆయా శాఖల నుంచి వచ్చే సమాధానం ఆధారంగా చర్యలు తీసుకుంటామని ద్వివేది తెలిపారు.

కాగా...ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం దూరంగా ఉన్నారు. ఎన్నికల కమిషన్‌ నిబంధనలకు మేరకు సీఎస్‌ ...ముఖ్యమంత్రి సమీక్షలకు హాజరు కాలేదు. కాగా పోలింగ్‌ ముగిసినప్పటికీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి వచ్చే నెల 27వ తేదీ వరకు అమల్లో ఉంది. అప్పటి వరకు ముఖ్యమంత్రిగానీ - మంత్రులు గానీ ఎటువంటి అధికారిక సమీక్షలు నిర్వహించరాదని ఎన్నికల నియావళి స్పష్టం చేస్తోంది. కేవలం ప్రకృతి వైపరీత్యాల సంభవించిన సమయంలో లేదా శాంతి భద్రతలకు విఘాతం సంభవించడం వంటి అత్యవసర పరిస్థితిల్లో చక్కపెట్టేందుకు మాత్రమే సీఎం వ్యక్తిగత పర్యవేక్షణ - సమీక్ష చేయవచ్చునని - మిగతా ఎటువంటి సమీక్షలు చేయరాదని ఎన్నికల ప్రవర్తనా నియామవళి స్పష్టం చేస్తోంది.

అయితే గతంలో ఏ ముఖ్యమంత్రి వ్యవహరించని విధంగా చంద్రబాబు ఇప్పుడు నియావళిని తుంగలో తొక్కుతూ బుధవారం పోలవరం ప్రాజెక్టుపై ప్రజావేదిక నుంచి సమీక్ష నిర్వహించగా గురువారం ఏకంగా సచివాలయానికి వచ్చి సీఎం కుర్చీలో కూర్చుని మరీ సీఆర్‌ డీఏ పనులపై సమీక్ష నిర్వహించారు. సీఎం సమీక్షలకు అధికారులు హాజరు కాకూడదు. అలాగే ముఖ్యమంత్రి కూడా అధికారులను ఆహ్వానించరాదు. కానీ.. చంద్రబాబు పిలవడంతో మొహమాటానికి వచ్చిన అధికారులు ఇప్పుడు ఇబ్బుందులు పడుతున్నారు.