Begin typing your search above and press return to search.

బాబు ఢిల్లీ ధర్నా.. సీపీఎం కడిగేసింది..

By:  Tupaki Desk   |   11 Feb 2019 11:04 AM GMT
బాబు ఢిల్లీ ధర్నా.. సీపీఎం కడిగేసింది..
X
తెలుగుదేశం పార్టీ అధినేత - ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో ఏపీ ప్రత్యేక హోదా కోసం చేస్తున్న ధర్మదీక్షలు - ధర్నాలపై సీపీఎం నేత పీ. మధు మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ నాటకాలాడుతోందని ధ్వజమెత్తారు.

‘టీడీపీ ఢిల్లీలో ఏపీ ప్రత్యేక హోదా కోసం ధర్నా చేస్తోంది. కానీ నాలుగేళ్లుగా బీజేపీతో అంటకాగినప్పుడు ఎందుకు చంద్రబాబుకు హోదా గుర్తుకు రాలేదు. అప్పుడు హోదా వద్దు.. ప్యాకేజీ ముద్దు అని చంద్రబాబు బీజేపీ ప్రతిపాదనకు ఒప్పుకున్నాడు. ఇప్పుడు బీజేపీతో తెగతెంపులు చేసుకున్నాక చంద్రబాబు హోదా ఎందుకు గుర్తుకువచ్చింది.? ఎందుకు పోరాడుతున్నాడు.’ అని సీపీఎం నేత మధు.. చంద్రబాబు తీరును ఎండగట్టాడు.

టీడీపీ తీరు శవాలపై పేలాలు ఏరుకున్న చందంగా ఉందని సీపీఎం నేత మధు మండిపడ్డారు. రాయలసీమలో కరువు - నీటి కొరత విషయంలో టీడీపీ ఏం చేయడం లేదు. ప్రజలను ట్యాంకర్లు కొని నీళ్లు తెచ్చుకోమంటారు. కరువు ప్రాంతాల ప్రజలకు నీళ్లు ఇవ్వలేని వీళ్లు ఢిల్లీలో నాటకాలు మొదలు పెట్టారని మధు మండిపడ్డారు.

జనసేన-వామపక్ష పార్టీలు రేపటి నుంచి కరువుతో అల్లాడుతున్న రాయలసీమ ప్రజల దాహార్తి తీర్చేందుకు ప్రభుత్వంపై పోరాడుతాయని సీపీఎం నేత మధు పేర్కొన్నారు. రాయలసీమకు న్యాయం జరిగేంత వరకు వెనుకడుగు వేయమని స్పష్టం చేశారు.

కాగా ప్రత్యేక హోదా కోసం ఓవైపు ఢిల్లీ టీడీపీ అగ్గి రాజేస్తుంటే.. దాన్ని డైవర్ట్ చేసేందుకా అన్నట్టు వాపక్షాలతో కలిసి పవన్ రాయలసీమ కరువుపై దృష్టిపెట్టడం రాజకీయంగా సంచలనంగా మారింది. ఏపీ హామీల గురించి చర్చ జరుగుతున్న సమయంలో పవన్ తీసుకున్న ఈ స్టెప్ చర్చనీయాంశంగా మారింది.