Begin typing your search above and press return to search.

మంట పుట్టించిన సీపీఎం ఎంపీ స‌లీం వ్యాఖ్య‌లు

By:  Tupaki Desk   |   30 Nov 2015 9:05 AM GMT
మంట పుట్టించిన సీపీఎం ఎంపీ స‌లీం వ్యాఖ్య‌లు
X
మ‌త అస‌హ‌నం మీద మొద‌లైన చ‌ర్చ‌.. అస‌హ‌న‌పు వ్యాఖ్య‌ల‌తో ర‌చ్చ ర‌చ్చగా మారింది. ఔట్ లుక్ మ్యాగ్ జైన్‌లో వ‌చ్చిన వ్యాఖ్య‌ల్ని ఉటంకిస్తూ.. సీపీఎం స‌భ్యుడు మ‌హమ్మ‌ద్ స‌లీం చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర దుమారాన్ని రేపాయి. దేశ‌వ్యాప్తంగా మ‌త అస‌హ‌నం మీద ర‌చ్చ జ‌రుగుతుంద‌న్న వాద‌న‌పై లోక్‌ స‌భ‌లో చ‌ర్చను రూల్ నెంబ‌రు 193 కింద చ‌ర్చ మొద‌లు పెట్టారు. ఈ సంద‌ర్భంగా చ‌ర్చ‌ను కేంద్ర హోంమంత్రి రాజ్‌ నాథ్ ప్రారంభించారు. అనంత‌రం సీపీఎం ఎంపీ స‌లీం ప్ర‌సంగించారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు వివాదాస్ప‌ద‌మ‌య్యాయి. 800 ఏళ్ల త‌ర్వాత భార‌త‌దేశానికి ఒక హిందువు ప్ర‌ధాని అయ్యార‌ని.. మ‌ళ్లీ హిందూరాజ్యం వ‌చ్చింద‌ని రాజ్‌ నాథ్ వ్యాఖ్యానించారంటూ స‌లీం మండిప‌డ్డారు. ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల్ని తానేమీ సంఘ్ ప‌రివార్‌ స‌భ‌ల్లో కూర్చొని విన‌లేద‌ని.. ఔట్‌ లుక్ మ్యాగ్ జైన్ లో వ‌చ్చాయ‌ని.. ఒక‌వేళ వాటిని ఖండించాలంటే.. ఆ ప‌త్రిక ఎడిట‌ర్ కు నోటీసులు పంపాల‌న్నారు.

ఏ హోంమంత్రి ఇలాంటి వ్యాఖ్య‌లు చేస్తే.. ఆ ప‌ద‌విలో కూర్చునే అర్హ‌త ఉండ‌బోద‌న్నారు. స‌లీం చేసిన వ్యాఖ్య‌లు లోక్‌స‌భ‌లో మంట‌పుట్టించాయి. త‌న‌పై వ్య‌క్తిగ‌తంగా ఈ స్థాయిలో ఆరోప‌ణ‌లు చేయ‌టం.. స‌భ‌లో ఇలా మాట్లాడ‌తారా అంటూ రాజ్‌ నాథ్ తీవ్ర ఆగ్రహం వ్య‌క్తం చేశారు. దేశంలో అస‌హ‌నం ఉంద‌ని ఎవ‌రూ అన‌టం లేద‌ని.. ఈ త‌ర‌హా ఆరోప‌ణ‌ల‌ను కావాల‌నే కొంద‌రు పుట్టిస్తున్నార‌ని చెప్పిన ఆయ‌న‌.. స‌లీం చేసిన వ్యాఖ్య‌ల‌తో తాను తీవ్ర మ‌న‌స్తాపానికి గురైన‌ట్లుగా పేర్కొన్నారు. స‌లీం తాను చేసిన వ్యాఖ్య‌ల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ చేశారు. త‌న రాజ‌కీయ జీవితంలో ఇలాంటి ప‌రిస్థితి ఎప్పుడూ ఎదురుకాలేద‌ని రాజ్‌ నాథ్ వాపోయారు.

స‌లీం త‌న ప్ర‌సంగాన్ని కొన‌సాగిస్తూ.. దేశంలో నెల‌కొన్న మ‌త అస‌హ‌నం చిన్న విష‌యం కాద‌ని.. ప్ర‌భుత్వాలు వ‌స్తుంటాయి.. పోతుంటాయ‌ని.. కానీ.. ఎవ‌రింట్లో ఏం తింటున్నార‌న్న‌ది ప్ర‌భుత్వానికి అన‌వ‌స‌ర‌మ‌ని.. అన్ని ఇళ్ల‌ల్లో పొయ్యి వెలిగిందా? లేదా? అన్న‌ది మాత్ర‌మే చూడాల‌న్నారు. స‌లీం చేసిన వ్యాఖ్య‌ల్ని రాజ్‌ నాథ్ తీవ్ర‌స్థాయిలో ఖండించారు. తాను ఎప్పుడూ అలాంటి మాట‌లు మాట్లాడ‌లేద‌ని.. మాట్లాడిన‌ట్లుగా స‌రైన ఆధారాలు చూపించాల‌ని డిమాండ్ చేశారు.