Begin typing your search above and press return to search.

ప‌ది రోజుల్లో కేసీఆర్ ఖ‌ర్చు 70 కోట్లు

By:  Tupaki Desk   |   25 Oct 2016 1:22 PM GMT
ప‌ది రోజుల్లో కేసీఆర్ ఖ‌ర్చు 70 కోట్లు
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప‌రిపాల‌న‌పై ప్ర‌తిప‌క్షాలు విరుచుకుప‌డుతున్నాయి. రాష్ట్ర సచివాలయాన్ని 10 రోజుల్లో ఖాళీ చేసి కూల్చివేతకు రంగం సిద్ధం చేయడం పట్ల సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్ర ఆందోళనను వ్యక్తం చేస్తూ, సచివాలయం తరలింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో అర్హులందరికీ రావలసిన పించన్ - ఉపాధిహామీ - ఫీజు రియంబర్స్ మెంట్ - ఆరోగ్యశ్రీ - పొదుపు గ్రూపులకు లింకేజి లోను, రైతుల రుణమాఫీ తదితర బకాయిలు వేల కోట్లు పేరుకొనిపోయి ఉన్న ప‌రిస్థితుల్లో కోట్ల రూపాయల ప్రజాధనాన్నిదుర్వినియోగపరిచే సచివాలయం తరలింపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాల‌ని సీపీఎం కోరింది. కేసీఆర్‌ తీసుకున్న ఈ నిర్ణ‌యంతో రూ.70 కోట్లు వృథా అవుతుంద‌ని పేర్కొన్నారు.

గత ముఖ్యమంత్రి హయాంలో వాస్తు - పరిపాల‌న అవ‌స‌రాల కొరకు రు.30 కోట్లు ఖ‌ర్చు చేయ‌గా... ప్ర‌స్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ . 40 కోట్లు ఖ‌ర్చుచేశార‌ని సీపీఎం అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది. రాష్ట్ర సచివాలయాన్ని 10 రోజుల్లో ఖాళీ చేసి కూల్చివేయ‌డం ద్వారా ఈ మొత్తం బూడిద‌లో పోసిన ప‌న్నీరు అవుతోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ రకంగా ప్రజల సొమ్మును ప్రజాసంక్షేమం కోసం కాకుండా పాలకుల ఇష్టానుసారం - వ్యక్తిగత అభీష్టాల మేరకు ఖర్చు చేయడం ఏమాత్రం క్షంతవ్యం కాదని పేర్కొంది. ప్రభుత్వ పాఠశాలలు - ఆస్పత్రులలో కనీస వసతుల లేమి, పత్తాలేని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు - కరువు తదితర సమస్యలతో రాష్ట్రం కొట్టుమిట్టాడుతున్న సందర్భంలో ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగపరుస్తూ ప్రభుత్వ కార్యకలాపాల నిర్వహణకు అనువుగా ఉన్న సచివాలయ భవనాన్ని కూల్చివేయడం ఏ మాత్రం సమంజసం కాదని సీపీఎం వ్యాఖ్యానించింది. ఏపీ సచివాలయం అమరావతికి తరలించినందున ఖాళీ అవుతున్న భవనాలు కూడా ఉపయోగించుకునే అవకాశం ఉన్నప్ప‌టికీ సీఎం కేసీఆర్ మొండుగా ఈ విధంగా వ్య‌వ‌హ‌రించ‌డం చిత్రంగా ఉంద‌ని పేర్కొంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/