Begin typing your search above and press return to search.

ఢిల్లీలో బాబు!... భూగోళం బ‌ద్ధ‌ల‌వ‌లేదే?

By:  Tupaki Desk   |   18 Jun 2018 10:29 AM GMT
ఢిల్లీలో బాబు!... భూగోళం బ‌ద్ధ‌ల‌వ‌లేదే?
X
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో నాలుగేళ్ల దోస్తీకి చెక్ పెట్టిన త‌ర్వాత ఢిల్లీ వెళ్లిన టీడీపీ అధినేత - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు జాతీయ రాజ‌కీయాల్లో ప్ర‌భంజ‌నం సృష్టించ‌డం ఖాయ‌మేనంటూ ఎల్లో మీడియా మొన్న బాకాలు ఊదిన సంగతి తెలిసిందే. 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీగా ప్ర‌చారం చేసుకుంటున్న చంద్ర‌బాబు హ‌స్తినలో అడుగుపెడితే... భూమి బ‌ద్ధ‌ల‌వ‌డం ఖాయ‌మేనంటూ కూడా ఆ మీడియా చంద్రబాబు జ‌బ్బ‌లు చ‌రిచేసింది. సీనియ‌ర్ మోస్ట్ పొలిటీషియ‌న్ హ‌స్తిన వెళితే... మిగిలిన రాష్ట్రాల సీఎంలంతా ఆయ‌న వ‌ద్ద‌కు చేరి... మోదీ సర్కారుకు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించే విధంగా వ్యూహ ర‌చ‌న చేస్తార‌ని, ఈ మొత్తం ప్ర‌క్రియ‌కు చంద్ర‌బాబే క‌ర్త‌ - క‌ర్మ‌ - క్రియ అంటూ ఢాంబికాలు ప‌లికేసింది. మొత్తంగా చంద్ర‌బాబు ఢిల్లీ ఫ్లైట్ ఎక్కిన మ‌రుక్ష‌ణం మోదీ స‌ర్కారుకు త‌డిసిపోవ‌డ‌మేన‌ని కూడా తేల్చేసింది. అయితే బాబు ఢిల్లీలో అడుగుపెట్ట‌డం - అక్క‌డ ఓ మూడు రాష్ట్రాల సీఎంలు... వారిలోనూ ఇద్ద‌రు ద‌క్షిణాది రాష్ట్రాల సీఎంలే చంద్ర‌బాబు వ‌ద్ద క‌నిపించారు. ముగ్గురు స‌హచ‌ర సీఎంల‌తో క‌లిసి బాబు నెర‌పిన మంత్రాంగం ఏ మేర‌కు నెర‌వేరిందో కూడా ఇట్టే తేలిపోయింది. క‌నీసం ఢిల్లీ లెఫ్ట్‌ నెంట్ గ‌వ‌ర్న‌ర్ అపాయింట్‌ మెంట్‌ ను కూడా సంపాదించుకోలేని ఈ మంత్రాంగం ఏ మేర ఫ‌లించిందో కూడా ఎల్లో మీడియానే చెప్పాల‌న్న వాద‌న వినిపిస్తోంది.

ఇక నీతి ఆయోగ్ భేటీ సంద‌ర్భంగా బాబు నెర‌పే వ్యూహంతో ప్ర‌ధాని మోదీ బిక్క‌చ‌చ్చిపోవ‌డం త‌ప్పించి చేసేదేమీ లేద‌ని కూడా ఆ మీడియా బాకాలు ఊదిన సంగ‌తి తెలిసిందే. అయితే భేటీ మొద‌లుకావ‌డానికి ముందే... అటుగా వ‌చ్చిన మోదీని చూసి గ‌జ‌గ‌జ వ‌ణికిపోయిన వాడికి మ‌ల్లే... మోదీ చేయి చాప‌గానే వంగి వంగి మ‌రీ దండాలు పెట్టిన చంద్ర‌బాబు తీరును చూసిన జ‌నం ముక్కున వేలేసుకున్న ప‌రిస్థితి. ఇక చంద్ర‌బాబుతో క‌ర‌చాల‌నానికి మోదీ చాపిన చేయిని ప‌రిశీలిస్తే... మ‌రింత‌గా ఆశ్చ‌ర్యం క‌ల‌గ‌క మాన‌దు. చంద్ర‌బాబుతో క‌ర‌చాల‌నానికి మోదీ కుడి చేయి ఇవ్వ‌లేదు... ఎడ‌మ చేయి ఇచ్చారు. మోదీ ఎడ‌మ చేయి ఇస్తేనే చంద్ర‌బాబు వంగి వంగి దండాలు పెట్టారంటే... అదే మోదీ కుడి చేయి అందించి ఉంటే... చంద్ర‌బాబు అక్క‌డిక‌క్క‌డే పొర్లు దండాలు పెట్టేసేవారేమోన‌న్న సెటైర్లు ఇప్పుడు వైర‌ల్‌ గా మారిపోయాయి. ఇదే విష‌యాన్ని ప్ర‌స్తావించిన సీపీఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణ... చంద్ర‌బాబు తీరును క‌డిగిపారేశారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటన తుస్సుమన్నదని ఎద్దేవా చేసిన ఆయ‌న‌... మోదీ ఎడమ చెయ్యి ఇస్తేనే చంద్రబాబు ఎగిరి గంతులేశారని - అదే పొరపాటున కుడి చెయ్యి ఇస్తే ఆయన కింద నిల్చేవాడే కాదని త‌న‌దైన శైలి సెటైర్లు సంధించారు. చంద్రబాబు పర్యటనతో భూగోళం బద్దలవుబోతున్నట్టు ఎల్లో మీడియా ప్రచారం చేసిందని, చివరికీ ఏం జరిగిందో అందరూ చూశారని ఆయన వ్యాఖ్యానించారు. ఇకనైనా చంద్రబాబు మోసపూరిత మాటలు - మోసపూరిత పర్యటనలు మానుకోవాలని రామ‌కృష్ణ‌ హితవు పలికారు.

మోదీకి చంద్రబాబు ఒంగి నమస్కారం చేయడం వెనుక ఏ రహస్య ఒప్పందం ఉందో బయటపెట్టాలని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత సి రామచంద్రయ్య డిమాండ్‌ చేశారు. నాలుగేళ్ల నుంచి కడప స్టీల్‌ ప్లాంట్‌ గురించి కేంద్రాన్ని నిలదీయకుండా నిద్రపోయారా అంటూ ఆయ‌న బాబుపై మండిపడ్డారు. నాలుగేళ్లు నిమ్మకు నీరెత్తినట్లు ఉన్న టీడీపీ - ఈరోజు డ్రామాలు చేస్తూ దొంగ దీక్షలకు సిద్ధమౌతోందని దుయ్యబట్టారు. ఇక్కడ ఏమో ఢిల్లీకి వెళ్తే ప్రకంపనలు వస్తాయని బాబు డప్పు కొట్టుకుంటున్నారని, కానీ వాస్తవానికి అక్కడ ఏమీ లేదని అన్నారు. చంద్రబాబు మంతనాల రాజకీయాలు చేయడంలో సిద్ధహస్తుడని, ఇందుకోసం కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరిని ఢిల్లీలో బీజేపీతో మంతనాల కోసం పెట్టారని ఆయ‌న ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో చంద్రబాబు బీజేపీతో కలిసినా ఆశ్చర్యపోనవసరం లేదన్నారు. ఇటీవల ఎల్లో మీడియాలో వచ్చిన ఎన్నికల సర్వే మొత్తం బోగస్‌ అని వ్యాఖ్యానించారు. సాక్షాత్తు సర్వే నిర్వహించిన వారితో మాట్లాడామని, వాళ్లు చెప్పింది ఒకటని... కానీ ఎల్లో మీడియా మరొకటి చూపించిందని రామ‌చంద్ర‌య్య‌ విమర్శించారు. మొత్తంగా చంద్ర‌బాబు ఢిల్లీకి వెళ్లి ఏదో పొడిచేస్తార‌ని ఎల్లో మీడియా డ‌బ్బాలు కొడితే... బాబేమో అవేమీ ప‌ట్టించుకోకుండా త‌న స‌హ‌జ శైలిని ప్ర‌ద‌ర్శించార‌న్న విశ్లేష‌ణ‌లు ఇప్పుడు జోరందుకున్నాయి.