Begin typing your search above and press return to search.

ఆన్‌ లైన్‌ లో జ‌న్మ‌భూమి నిర్వ‌హిస్తారా?

By:  Tupaki Desk   |   10 Jan 2017 1:09 PM GMT
ఆన్‌ లైన్‌ లో జ‌న్మ‌భూమి నిర్వ‌హిస్తారా?
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్రభుత్వ అధికారిక కార్యక్రమమైన జ‌న్మ‌భూమిని సొంత పార్టీ కార్యక్రమంలా మార్చారనీ సీపీఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణ మండిప‌డ్డారు. "వచ్చే ఎన్నికల్లో మళ్ళీ చంద్రబాబుకే ఓట్లేసి గెలిపించండి" అని అనంత‌పురం ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి చెప్పడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. బరితెగించి ప్రభుత్వ కార్యక్రమాల్లో ఓట్లు- సీట్లు- కలెక్షన్లు గురించి మాట్లాడడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనన్నారు. జన్మభూమి కార్యక్రమాలను - ప్రారంభోత్సవ కార్యక్రమాలను తెలుగుదేశం కార్యక్రమాలుగా చేసుకోవడం సరైందికాదని రామ‌కృష్ణ మండిప‌డ్డారు.

విజ‌యవాడ‌లో రామ‌కృష్ణ మీడియాతో మాట్లాడుతూ.... రాష్ట్రంలో వ్యవసాయరంగం కుదేలయ్యిందనీ - ఉపాధి కోల్పోయారన్నారు. ఆంధ్రప్రదేశ్ ను స్వర్ణాంధ్ర అంటున్నారేగానీ 2014కు 2015వ సంవత్సరానికి పోలిస్తే 44.9% రైతుల ఆత్మహత్యలు పెరిగాయనీ, వ్యవసాయంపైన ఆధారపడినవారు ఒక సంవత్సరంలో 916 మంది ఆత్మహత్యలకు చేసుకున్నారని రామ‌కృష్ణ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. రైతుల ఆత్మహత్యల్లో ఏపీ భారతదేశంలో 6వ స్థానంలో ఉందనీ తెలిపారు. నోట్ల రద్దు తదనంతర పరిణామాలపై పాలకులు వాస్తవాలలను వక్రీకరిస్తున్నారనీ, వ్యవసాయరంగం కుదేలయ్యిందనీ, ఉపాధి తగ్గిపోయినా కూడా అంతా బ్రహ్మాండంగా ఉందంటూ కేంద్ర, రాష్ట్ర పాలకులు ఊదరగొట్టడాన్ని రామకృష్ణ తీవ్రంగా దుయ్యబట్టారు. కేంద్రంలో అరుణ్ జైట్లీ - వెంకయ్యనాయుడు - రాష్ట్రంలో చంద్రబాబునాయుడులు పెద్దనోట్ల రద్దును సమర్ధిస్తూ అవినీతి - లంచగొండితనం తగ్గిపోతున్నదనీ - బ్రహ్మాండంగా టాక్స్ కలెక్షన్లు వస్తున్నాయనీ - టెర్రరిస్తు కార్యక్రమాలు తగ్గిపోతున్నాయని గ‌ప్పాలు కొడుతున్నార‌ని వ్యాఖ్యానించారు. కానీ అనేక మంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున ప‌డుతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. పాలకులకు ప్రజలు ఉద్యోగాలు - ఉపాధిలు కోల్పోయినాసరే టాక్సులు వస్తే చాలా అని ప్రశ్నించారు. అసలు ఉద్యోగాలు ఉన్నాయా లేదా? వారికి జీతాలు వస్తున్నాయా లేదా? వారు తింటున్నారా లేదా? గ్రామీణ పరిస్థితి ఏంటి అనేది ఆలోచించకుండా అంతా బ్రహ్మాండంగా ఉందనడం హాస్యాస్పదమని రామ‌కృష్ణ అన్నారు.

కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీకి పల్లెల గురించీ - రైతుల గురించీ తెలీదనీ - ఇంతో అంతో తెలిసిన వెంకయ్యనాయుడు కూడా ఒక్క పల్లెకు పోయి రైతులతో కూర్చుని నోట్లరద్దు పరిణామాల గురించి ఎక్కడా మాట్లాడలేదని రామ‌కృష్ణ వ్యాఖ్యానించారు. వెంకయ్యనాయుడు ఎప్పడూ విజయవాడ - విశాఖపట్నం - తిరుపతి వంటి పట్టణాల పర్యటనలకే పరిమితమవుతున్నారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మళ్ళీ యు టర్న్ తీసుకుని పెద్దనోట్ల రద్దు చేయమని నేనే చెప్పానంటున్నాడని వ్యాఖ్యానించారు. దీనివల్ల అవినీతి - లంచగొండితనం తగ్గిపోయిందంటున్నారనీ ఏ ఊర్లో అవినీతి తగ్గిందో, ఏ శాఖ‌లో లంచగొండితనం తగ్గిందో చెపితే ఆ ఊరు వెళ్ళి అన్నీ పరిశీలించి మేమే నివేదిక ఇస్తామన్నారు. 2019 ఎన్నికల్లో ఓటుకు రెండువేల రూపాయలు తెలుగుదేశం పార్టీ తరఫున మీరే పంచుతారని రామ‌కృష్ణ విమర్శించారు. అలా పంచబోమని చెప్పగల దమ్ముందా? నిజాయితీ ఉంటే రాబోయే ఎన్నికల్లో ఓటుకు నోటు పంచబోమని చెప్పాలని డిమాండ్ చేస్తున్నామని రామ‌కృష్ణ అన్నారు. ప్రజలను మోసం చేసే మాటలతో పాలకులంతా మభ్యపెడుతున్నారు. ఈ మాయమాటలు మానుకోవాల‌ని హితవు పలికారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/