పవన్ షాకిచ్చినా ఆ పార్టీకి మోజు తగ్గలేదు

Fri Aug 17 2018 19:27:09 GMT+0530 (IST)

ఆంధ్రప్రదేశ్ లో వామపక్ష పార్టీల నేతల తీరుపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. జనసేన పార్టీ అధినేత - సినీ నటుడు పవన్ కళ్యాణ్ పై ఆ పార్టీ నేతలు కనబరుస్తున్న ప్రత్యేక ప్రేమ వెనుక మర్మం ఏంటని చర్చించుకుంటున్నారు. కొద్దికాలం క్రితం వరకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వామపక్షాలతో ఓ రేంజ్ లో సఖ్యతను కనబర్చిన సంగతి తెలిసిందే. పవన్ ఏర్పాటు చేసిన జాయింట్ ఫ్యాక్ట్స్ ఫైండింగ్ కమిటీ మొదలుకొని గత నెలలో విజయవాడలోని ఓ హోటల్ లో నిర్వహించిన సదస్సుల వరకు వామపక్షాల భాగస్వామ్యం లేకుండా ఏదీ జరగలేదు. ఇక పవన్ నిర్వహించిన పాదయాత్రలో ఆయన తర్వాత సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఎవరంటే...వామపక్షాల నేతలే. అలాంటి వామపక్షాలతో పవన్ పొత్తు పెట్టుకోకుండా ఎలా ఉంటారని అందరూ అనుకున్నారు. అయితే ఈ చర్చకు ఫుల్ స్టాప్ పెడుతూ పవన్ తనే సొంతంగా బరిలో దిగనున్నట్లు ప్రకటించారు. పొత్తులు లేవని తేల్చిచెప్తూ...175 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ జనసేన రంగంలోకి దిగుతుందని క్లారిటీ ఇచ్చారు. తద్వారా పవన్ ఫ్యాన్స్ కు తీపికబురు ఇస్తే..వామపక్షాలకు షాక్ ఇచ్చారు.అయినప్పటికీ తాజాగా పవన్ పట్ల వామపక్ష నేతలు ప్రత్యేక ప్రేమను కనబరుస్తున్నారు. తాజాగా ఏపీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సీఎం చంద్రబాబు నాయుడు దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పవన్కు అన్ని రంగాలపై సంపూర్ణ అవగాహన ఉందని జనసేనాని తరఫున వకాల్తా పుచ్చుకున్నారు. బీజేపీతో తనకు సంబంధం లేదని కాబట్టే వామపక్షాలతో కలుస్తున్నారని స్పష్టం చేశారు. బీజేపీతో కలిసేందుకు ఏ పార్టీ సిద్ధంగా లేదన్నారు. తాము పవన్ తో కలిసి రాబోయే ఎన్నికల్లో ముందుకు సాగుతామని వెల్లడించారు. కాగా కొద్దికాలం క్రితం పవన్ ప్రకటనతో వామపక్ష నేతల్లో కలవరం మొలైన సంగతి తెలిసిందే.  పొత్తులు లేవని తేల్చిచెప్తూ...175 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ జనసేన రంగంలోకి దిగుతుందని పవన్ వెల్లడించడంతో...తమతో కలిసి నడిచి తమకు అగ్రతాంబూలం వేసిన పవన్ ఇప్పుడు ఇలాంటి షాకింగ్ నిర్ణయం తీసుకున్నారేంటనే చర్చ వామపక్షాల్లో జరిగింది. తమను వాడుకునేందుకు క్షేత్రస్థాయిలో తమ కార్యకర్తలను ఉపయోగించుకునేందుకు మాత్రమే జనసేనాని దోస్తీకట్టాడా? అంటూ పలువురు వాపోయారు. అయినప్పటికీ పవన్ తో కలిసి ముందుకు సాగేందుకు సీపీఐ నేత చూపుతున్న ఆసక్తి చిత్రంగా ఉందంటున్నారు.