Begin typing your search above and press return to search.

వెంక‌య్య మెడకు చుట్టుకున్న జ‌గ‌న్ స‌వాల్‌

By:  Tupaki Desk   |   27 Sep 2016 4:57 PM GMT
వెంక‌య్య మెడకు చుట్టుకున్న జ‌గ‌న్ స‌వాల్‌
X
ఆంధ్ర‌ప్రదేశ్‌ కు ప్ర‌త్యేక హోదా సాధించేందుకు త‌న పార్టీల‌కు చెందిన ఎంపీల‌తో అవ‌స‌ర‌మైతే రాజీనామా చేయిస్తాన‌ని వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌ చెప్పిన సంగ‌తి తెలిసిందే. ఈ ప్ర‌క‌టన పట్ల ఆయా పార్టీలు ప‌లుర‌కాలుగా స్పందించ‌గా అధికార బీజేపీతో సిద్ధాంత వైరుధ్యాలున్న క‌మ్యూనిస్టు పార్టీ మ‌రో ర‌కంగా రియాక్ట‌యింది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ జగన్ సవాలును కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ముడిపెట్టారు.

ప్రత్యేక హోదా గురించి గొప్పలు చెప్తున్న వెంకయ్యనాయుడు నిజంగా అంతగొప్ప ప్యాకేజీ ఇస్తే... ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రంలో బీజేపీకి చెందిన ఇద్ద‌రు ఎంపీలు - నలుగురు ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి తిరిగి వారిలో ఒక్క‌రిని గెలిపించుకోవాలని సూచించారు. అలా చేస్తే కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరిస్తామని రామకృష్ణ ప్రకటించారు.

ప్రత్యేక హోదా సాధనా సమితి ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజాబ్యాలెట్‌ ను ఉద్దేశిస్తూ కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు "ఎందుకంత తొంద‌ర? ఎలాగూ అసలైన బ్యాలెట్ 2019లో ఉందిగా అంతవరకూ ఆగండి" అంటూ ప్రజాబ్యాలెట్‌ ను అపహాస్యం చేసే విధంగా వెంకయ్య వ్యాఖ్యానించార‌ని రామ‌కృష్ణ త‌ప్పుప‌ట్టారు. 2019 కంటే అంత‌లోపు ప్రజాభిప్రాయం ఏవిధంగా ఉందో తెలుసుకోవాలంటే బీజేపీ ఎంపీలు - ఎమ్మెల్యేల‌ను రాజీనామాలు చేయించి తిరిగి గెలిపించుకోవాలని రామ‌కృష్ణ‌ డిమాండ్ చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి ప్రజలను ఒప్పించామనుకుంటున్న వెంక‌య్య‌నాయుడు అది నిజ‌మో కాదో తెలుసుకునేందుకు ఆ పార్టీ ప్ర‌జాప్ర‌తినిధులున్న ఆరు స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల‌న్నారు. వీటిలో ఏఒక్క స్థానం నుండి మీరు గెలిచినా మేము ప్రత్యేక హోదా గురించి మాట్లాడకుండా ఉంటామని, మీరిచ్చిన ప్రత్యేక ప్యాకేజీని ఆమోదిస్తామని రామ‌కృష్ణ‌ స్పష్టం చేశారు. నిజంగా వెంకయ్యకు చిత్తశుద్ధి - ప్రజలపై నమ్మకం - ప్రజాభిప్రాయంపై గౌరవం ఉంటే ఈ సవాలును స్వీకరించాలని డిమాండ్ చేశారు.

ప్రత్యేకంగా ఈ ఆరు మందినే రాజీనామా చేయమని కోరడానికి రామ‌కృష్ణ‌ కారణాలు కూడా తెలిపారు. బీజేపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో రాష్ట్రానికి కచ్చితంగా పదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించిన కారణంగానే గెలిచారు కనుక రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలు పెడితే ప్రత్యేక ప్యాకేజీ అంగీకారమైతే ప్రజలు గెలిపిస్తారని, లేదంటే ఓడిస్తారని రామ‌కృష్ణ అన్నారు. ఇప్పటికైనా డొంకతిరుగుడు మాటలకు స్వస్తి చెప్పి తమ ఛాలెంజ్‌ ను స్వీకరించాలన్నారు. అలాగే చట్టబద్ధతలేని ప్రత్యేక ప్యాకేజీని ఏవిధంగా అంగీకరిస్తారో విశేష అనుభవం కలిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు వివరణ ఇవ్వాలని రామ‌కృష్ణ డిమాండ్ చేశారు. విభజన హామీల్లోని విశాఖ రైల్వేజోన్ - వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక నిధులు - కడప ఉక్కుఫ్యాక్టరీ - ఓడరేవు ఇవ్వకపోయినా ప్యాకేజీ బ్రహ్మాండంగా ఉందని గొప్పలు చెప్పుకోవడం చంద్రబాబుకే చెల్లిందన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/