Begin typing your search above and press return to search.

బాబూ... ఈ స‌వాల్‌ కు సిద్ధ‌మేనా?

By:  Tupaki Desk   |   17 April 2018 6:19 AM GMT
బాబూ... ఈ స‌వాల్‌ కు సిద్ధ‌మేనా?
X
ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌కుండా కేంద్రంలోని న‌రేంద్ర మోదీ స‌ర్కారు చేసిన అన్యాయానికి నిర‌స‌న‌గా ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా నిర‌స‌న‌లు మిన్నంటుతున్నాయి. నిన్న ప్ర‌త్యేక హోదా సాధ‌న స‌మితి ఇచ్చిన బంద్ పిలుపున‌కు రాష్ట్రవ్యాప్తంగా భారీ స్పంద‌న రావ‌డ‌మే ఇందుకు నిద‌ర్శ‌నంగా చెప్పుకోవాలి. స‌మితి ఇచ్చిన పిలుపున‌కు రాష్ట్రంలోని ప్ర‌దాన పార్టీలు వైసీపీ, సీపీఐ, సీపీఎం, లోక్ స‌త్తా, జ‌న‌సేన త‌దిత‌ర పార్టీల‌న్ని మ‌ద్ద‌తుగా నిలిచాయి. మొత్తంగా నిన్న‌టి బంద్‌... ప్ర‌త్యేక హోదా కాంక్ష జ‌నాల్లో ఏ మేర ఉంద‌న్న విష‌యం తేట‌తెల్ల‌మైంద‌న్న వాద‌న వినిపిస్తోంది. అయితే ప్ర‌త్యేక హోదా కోసం తాను కూడా అలుపెర‌గ‌ని పోరాటం చేస్తున్నాన‌ని చెబుతున్న టీడీపీ మాత్రం ఈ బంద్ కు దూరంగా ఉంది. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న‌ది బీజేపీనే కాబ‌ట్టి... ఏపీలో బీజేపీకి చెందిన నేత‌లు కూడా ఈ బంద్‌లో భాగ‌స్వాములు కాలేదు. బీజేపీ బంద్‌కు దూరంగా ఉన్న‌దంటే అర్థ‌ముంది గానీ... హోదా కోసం పోరాడుతున్నాన‌ని చెబుతున్న టీడీపీ ఈ బంద్ కు దూరంగా ఉండ‌టంపైనే ఇప్పుడు ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డుస్తోంది.

బంద్ గ్రాండ్ స‌క్సెస్ అయిన నేప‌థ్యంలో, తామిచ్చిన పిలుపున‌కు అన్ని పార్టీల నుంచి రాజ‌కీయాలకు అతీతంగా వెల్లువెత్తిన మ‌ద్ద‌తుకు కృత‌జ్ఞ‌త‌లు తెలిపేందుకు నేటి ఉద‌యం ప్ర‌త్యేక హోదా సాధ‌న స‌మితి క‌న్వీన‌ర్‌ చ‌లసాని శ్రీనివాస్ మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న టీడీపీ, ఆ పార్టీ అధినేత‌, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు వైఖ‌రిల‌పై నిప్పులు చెరిగారు. రాష్ట్రానికి న‌ష్టం క‌లిగించే ఈ త‌ర‌హా బంద్ ల‌ను రాష్ట్రంలో నిర్వ‌హించ‌డం కాద‌ని, చేతనైతే... ఢిల్లీలో నిర్వ‌హించాల‌ని నిన్న చంద్ర‌బాబు వ్యాఖ్యానించిన సంగ‌తి తెలిసిందే. అంతేకాకుండా బంద్ కార‌ణంగా ఒక్క ఆర్టీసీకే నిన్న రూ.12 కోట్ల న‌ష్టం వాటిల్లింద‌ని కూడా బాబు లెక్క‌లు విప్పారు. ఈ వ్యాఖ్య‌ల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన చ‌ల‌సాని.. రాష్ట్రానికి జ‌రిగిన న‌ష్టంపై రాష్ట్రంలో కాకుండా ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో ధ‌ర్నాలు, బంద్ లు నిర్వ‌హించామంటారా? ప‌్ర‌శ్నించారు. తాము చేప‌ట్టిన ఉద్య‌మానికి మ‌ద్ద‌తు తెల‌పాల్సిన గురుతర బాధ్య‌త‌ను మ‌రిచి ప్ర‌జ‌లు సంపూర్ణంగా స‌హ‌క‌రించిన బంద్ పై వ్య‌తిరేఖ వ్యాఖ్య‌లు చేస్తారా? అని ఆయ‌న మండిప‌డ్డారు.

ఇక ఆ త‌ర్వాత మైకందుకున్న సీపీఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణ‌... బాబుకు గ‌ట్టి స‌వాలే విసిరారు. ఏపీకి జరిగిన అన్యాయానికి నిర‌స‌న‌గా త‌న జ‌న్మ‌దిన‌మైన ఈ నెల 20న విజ‌య‌వాడ‌లో ఒక్క‌రోజు నిరాహార దీక్ష చేస్తాన‌ని ప్ర‌క‌టించిన చంద్ర‌బాబు తీరుపై విస్మ‌యం ప్ర‌క‌టించారు. త‌మ‌ను ఢిల్లీలో ధ‌ర్నాలు చేయాలంటూ సూచించే చంద్ర‌బాబు.... తాను మాత్రం త‌న దీక్ష‌కు విజ‌య‌వాడ‌లోని పీడ‌బ్ల్యూడీ గ్రౌండ్స్‌ ను ఎందుకు ఎంచుకున్నార‌ని ప్ర‌శ్నించారు. త‌మ‌కు సూచించిన‌ట్లుగానే స‌ద‌రు ఒక్క‌రోజు ఉప‌వాస దీక్ష‌కు ఢిల్లీలోని జంత‌ర్‌మంత‌ర్ వ‌ద్దో, ప్ర‌ధాని నివాసం ముందో నిర్వ‌హించి ద‌మ్మూ, ధైర్యం చంద్ర‌బాబుకు ఉందా? అని కూడా ఆయ‌న ఘాటు స‌వాలే విసిరారు.

ఇదిలా ఉంటే... ఇదే విష‌యంపై విశాఖ‌లో మీడియాతో మాట్లాడిన వైసీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి - ఆ పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి... చంద్ర‌బాబును ఏపీకి విల‌న్‌ గా అభివ‌ర్ణించేశారు. అస‌లు రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా రాక‌పోవ‌డానికి చంద్ర‌బాబే కార‌ణ‌మ‌ని కూడా సాయిరెడ్డి ఆరోపించారు. ప్ర‌త్యేక హోదాకు బ‌దులుగా ప్ర‌త్యేక ప్యాకేజీ ఇస్తామ‌ని చెప్పిన కేంద్రం మాట‌కు త‌లూపిన చంద్ర‌బాబు...గ‌డ‌చిన నాలుగేళ్ల పాటు ప్ర‌త్యేక హోదాను విస్మ‌రించార‌ని, ఇప్పుడు కొత్త‌గా మాట మార్చేసి ప్ర‌త్యేక హోదా కోసం ఉద్య‌మం చేస్తున్నామంటున్న చంద్ర‌బాబును జ‌నం న‌మ్మే ప‌రిస్థితి లేద‌ని ఆయ‌న ఆరోపించారు. మొత్తంగా నిన్న జ‌రిగిన బంద్‌పై ఏ ఒక్క‌రి ప్ర‌మేయం లేకుండా త‌న‌కు తానుగా మాట్లాడిన చంద్ర‌బాబు... అన్ని పార్టీల నేత‌ల‌కు టార్గెట్ అయిపోయారు.