కమ్యూనిస్టు నాయకుడికి కరెన్సీ గజమాల

Thu Feb 22 2018 22:40:18 GMT+0530 (IST)

కమ్యూనిస్టులంటే నిరాడంబరులు.. సామాన్యుల కోసం బతికేవారు.. కానీ నోట్ల కట్టలను మెడలో వేసుకుని తిరిగే కమ్యూనిస్టులను ఎక్కడైనా చూశారా..? బెంగాల్లోకానీ - కేరళలో కానీ - త్రిపురలో కానీ ఎక్కడా చూడని విధంగా ఏపీ కమ్యూనిస్టు నేత మెడలో కరెన్సీ గజమాలతో కనిపిస్తున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అవును... సీపీఐ జాతీయ నేత నారాయణ తాజాగా కరెన్సీ నోట్ల గజమాలను ధరించారట. ఆ ఫొటో ఇప్పుడు తెగ షేర్ అవుతోంది.
    
అడపాదడపా గుడులకు వెళ్లడం.. అప్పుడప్పుడూ తాటిచెట్ల కింద కల్లు తాగడం వంటి పనులతో కన్ఫ్యూజ్ చేసే కమ్యూనిస్టు నారాయణ ఈసారి ఏకంగా భారీ షాకిచ్చారు.  చిత్తూరులో జరిగిన సీపీఐ జిల్లా మహాసభలో రూ. 200 - 500 నోట్లతో అల్లిన గజమాలను పార్టీ కార్యకర్తలు ఆయనకు వేయగా.. ఏమాత్రం వద్దనకుండా ఆయన దాన్ని మెడలో వేయించుకుని ఫొటోలకు ఫోజులు కూడా ఇచ్చారు.
    
ఒకప్పుడు ఉత్తర ప్రదేశ్ సీఎంగా పనిచేసిన మాయావతి నోట్ల కట్టల గజమాల వేయించుకుంటే వామపక్ష నేతలు వారం రోజులు ఆమెకు నిద్రపట్టకుండా విమర్శల వర్షం కురిపించారు.  నారాయణ గజమాల ఫొటోను కొందరు సరదా కొద్దీ షేర్ చేస్తుండగా... ఇదేనా కమ్యూనిజం అంటూ నెటిజన్లు దానికి కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి కమ్యూనిస్టు పార్టీని మెయిన్ స్ర్టీమ్ పొలిటికల్ పార్టీల రేంజికి తీసుకొస్తున్నట్లున్నారు నారాయణ.