Begin typing your search above and press return to search.

బాబూ వార‌స‌త్వమేనా.. ప్ర‌జ‌ల‌కు హ‌క్కులొద్దా?

By:  Tupaki Desk   |   17 Oct 2017 7:34 AM GMT
బాబూ వార‌స‌త్వమేనా.. ప్ర‌జ‌ల‌కు హ‌క్కులొద్దా?
X
ఏపీ సీఎం చంద్ర‌బాబుపై సీపీఐ జాతీయ కార్య‌ద‌ర్శి కె. నారాయ‌ణ వ్యంగ్యం - ఆగ్ర‌హం రెండూ క‌ల‌గ‌లిపి నిప్పులు చెరిగారు. బాబు పైకి డంబాలు చెబుతాడ‌ని - కానీ, చేస్తున్న ప‌నులు మాత్రం చాలా చీప్‌ గా ఉన్నాయ‌ని ఎద్దేవా చేశారు. ముఖ్యంగా రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణాల విష‌యంలో బాబు చెబుతున్న దానికీ, క్షేత్ర‌స్థాయిలో జ‌రుగుతున్న దానికీ సంబంధం లేద‌న్నారు. ఈ నిర్మాణాలు ఇప్ప‌ట్లో మొద‌ల‌వుతాయ‌ని తాను విశ్వ‌సించ‌డం లేద‌ని చెప్పారు. తాను కానీ, సీపీఐ కానీ రాజ‌ధానికి వ్య‌తిరేకం కాద‌ని - అయితే - కోర్టులు చంద్ర‌బాబుకు వేస్తున్న మొట్టికాయ‌లు చూస్తుంటే త‌న‌కు ఇలానే అనిపిస్తోంద‌ని అన్నారు. మ‌న‌కు అవ‌స‌ర‌మైన‌, మ‌న అవ‌స‌రాల‌ను తీర్చ‌గ‌లిగిన రాజ‌ధాని చాల‌ని చెప్పారు.

అయితే, చంద్ర‌బాబు మాత్రం అంత‌ర్జాతీయ స్థాయిలో - విదేశీయుల‌కు ఎక్కువ‌గా ఉప‌యోగ‌ప‌డేలా ఈ రాజ‌ధానిని నిర్మించాల‌ని అనుకోవ‌డం, ఆదిశ‌గా వెళ్తున్నందునే తాము విమ‌ర్శిస్తున్నామ‌ని నారాయ‌ణ అన్నారు. ప్ర‌ధానంగా నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోసం వామపక్షాలు పోరాడుతున్నాయ‌ని నారాయ‌ణ నొక్కి చెప్పారు. ఈ క్ర‌మంలోనే విజ‌య‌వాడ‌లో సోమ‌వారం నిర్వహించిన‌ మహాధర్నాలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నిర్వాసితుల సమస్యలు తీర్చకుండా ప్రాజెక్టులు ఎలా పూర్తి చేస్తారని బాబును ప్రశ్నించారు. ప్రాజెక్టులకు తాము వ్యతిరేకం కాదన్నారు. నిర్వాసితుల సమస్యలపై కోర్టులు సైతం చీవాట్లు పెడుతున్నా ప్రభుత్వాలకు బుర్రకెక్కడంలేదని మండిపడ్డారు.

నిర్వాసితులు సంతృప్తి చెందకుండా ప్రాజెక్టు పూర్తి చేయలేరని వ్యాఖ్యానించారు. వంశధార ప్రాజెక్టు నిర్వాసితులతో మాట్లాడేందుకు వెళ్లిన వామపక్ష నేతలను అడ్డుకుని అరెస్ట్ చేయడంపై తీవ్రంగా స్పందించారు. వంశధార ప్రాంతం ఏమైనా పాకిస్థానా.. ఎందుకు నిర్బంధం విధిస్తున్నారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రులు మాత్రం రాజకీయ వారసత్వం కోరుకోవచ్చు - నిర్వాసితులు మాత్రం భూమిపై హక్కు కోరితే చెల్లదంటున్నారని అన్నారు. మీకో నీతి - వారికో నీతా? అని నిల‌దీశారు. మొత్తానికి సీఎం చంద్ర‌బాబుపై నారాయ‌ణ కామెంట్లు సంచ‌ల‌నం సృష్టించాయి.