Begin typing your search above and press return to search.

పవన్ లోని కమ్యూనిస్టును చూసిన నారాయణ

By:  Tupaki Desk   |   30 Aug 2016 10:41 AM GMT
పవన్ లోని కమ్యూనిస్టును చూసిన నారాయణ
X
ఏపీ రాజకీయాల్లో పవన్ పెను ప్రభావం చూపించబోతున్నాడా... ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగబోతున్నాడా? అంటే .. అదంతా ఏమో కానీ రాజకీయ పార్టీలు మాత్రం పవన్ లో ఆ సత్తా ఉందని నమ్ముతున్నాయని మాత్రం చెప్పొచ్చు. అందుకు సీపీఐ జాతీయ నేత నారాయణ వ్యాఖ్యలే ఉదాహరణ. 'చేతనైతే రాజకీయాల్లోకి రా...లేదంటే రజనీకాంత్ లా ఇంట్లో కూర్చో' అంటూ ఇంతకుముందు పవన్ పై మాటలు విసిరిన నారాయణే ఇప్పుడు పవన్ కల్యాణ్ తో చర్చలకు తాము సిద్ధమని ప్రకటించారు. దీంతో పవన్ ఎఫెక్టుపై రాజకీయ పార్టీల్లో మంచి అంచనాలే ఉన్నట్లు అర్థమవుతోంది.

పవన్ తో చర్చలకు తాము సిద్ధమని చెప్పిన నారాయణ మరో అడుగు ముందుకేసి పవన్ కల్యాణ్ లో కమ్యూనిస్టు భావాలు ఉన్నాయని కూడా దువ్వారు. ఏపీలో ఇప్పుడు పొలిటికల్ వ్యాక్యూమ్ ఉందని... పాలక - విపక్షాలపై జనంలో నమ్మకం పోయిందని.. కొత్త పార్టీలు వస్తే ఛాన్సుంటుందని అన్నారు. అధికార - ప్రతిపక్ష పార్టీలు ప్రత్యేకహోదాను నిర్లక్ష్యం చేస్తున్న సమయంలో పవన్ కల్యాణ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తే జనం ఆయన్ను ఆదరిస్తారని నారాయణ విశ్లేషించారు.

నాలుగైదు రోజుల్లోనే నారాయణ మాట మార్చడం వెనుక ఆ పార్టీలోని ఇతర జాతీయ స్థాయి నేతల ప్రభావం ఉన్నట్లు తెలుస్తోంది. పవన్ సభతో సీపీఐ జాతీయ నేతలు కొందరు ఆయనపై దృష్టి పెట్టారని.. ఆయనతో కలిసి పనిచేస్తే ఎలా ఉంటుందని నారాయణను అడిగారని తెలుస్తోంది. దీంతో నారాయణ కూడా పవన్ విషయంలో మనసు మార్చుకుని తమవైపు ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నట్లుగా చెబుతున్నారు. అయితే... పవన్ దీనిపై ఎలాస్పందిస్తాడన్నదే కీలకం. ఆయన టీడీపతో మిత్రపక్షంగా కానీ, ఒంటరిగా కానీ పోటీ చేసే అవకాశముందని భావిస్తున్నారు. వామపక్షాలు కానీ, ఇతర పార్టీలతో కానీ పొత్తు పెట్టుకోరని తెలుస్తోంది.