కాంగ్రెస్ కు కష్టం... సీపీఐకి దుఃఖం

Fri Nov 09 2018 11:38:29 GMT+0530 (IST)

పొత్తులో సీట్లు పంచడం ఆస్తుల పంచడం కంటే కష్టమైన పనే. ఎంతో కాలం నుంచి వేచి చూసిన సీట్లు ఆశించిన వారికి ఎవరికీ రాకుండా ఎవరికో వెళ్లిపోతుంటే కష్టపడిన వాళ్లు ఖర్చుపెట్టిన వాళ్లు బాగా నొచ్చుకుంటారు. కాస్త బలమయిన వాళ్లయితే తిరగబడతారు. అందుకే  ఇది అంత ఈజీగా తేలే తంతు కాదు. ఇక కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీలో అయితే మరీ కష్టం. తిరుగుబాట్లపై అదుపుండదు. ఇక పొత్తు పెట్టుకున్న చిన్న పార్టీలు ఉండలేక - వెనక్కు రాలేక ఇబ్బంది పడాలి. ప్రస్తుతం ఇదే స్థితిలో ఉంది సీపీఐ (తెలంగాణ).కెసిఆర్ పాలన బంగారు పాలన కాదు... అరాచక పాలన అంటూ దాడి చేసిన పార్టీలన్నీ తెలంగాణ గడ్డపై ఇపుడు ఏకం అయ్యాయి. మహాకూటమిగా ఏర్పడ్డాయి. దాదాపు రెండు నెలల సంకటం తర్వాత విసిగించి విసిగించి సీట్లు పంచింది కాంగ్రెస్. అయితే - ఇంతా చూస్తే నిరాశ. కొట్లాడి కోదండరాం సీట్లు బాగానే తెచ్చుకున్నారు గాని దశాబ్దాల నాటి సీపీఐ పార్టీకి మాత్రం సంతృప్తి లేదు. కేవలం మూడు సీట్లు ఇస్తామని కాంగ్రెస్ తేల్చింది.

అయితే ఉపశమనంగా మరో రెండు ఎమ్మెల్సీలు ఇస్తామని చెబుతోంది. అయితే కాంగ్రెస్ ఇచ్చిన షాక్ ఏంటంటే... కొత్తగూడెంపై ఆశలు పెట్టుకున్న సీపీఐకు హ్యాండిచ్చారు. హుస్నాబాద్ - బెల్లంపల్లి (ఎస్సీ) వైరా (ఎస్టీ) స్థానాలు సీపీఐకు ఇచ్చినట్టు టీపీసీసీ ఇన్ ఛార్జి కుంటియా ప్రకటించారు. అయితే ఎమ్మెల్సీలు ఒకటి తగ్గించి ఎమ్మెల్యే టిక్కెట్ ఒకటి పెంచమని సీపీఐ అడుగుతోంది. ఆ ఒక్కటీ కూడా కొత్త గూడెం కావాలని ఆరాటపడుతోంది. అయితే కాంగ్రెస్ మాత్రం ఆ గెలిచే అవకాశాలున్న సీటు కాంగ్రెస్ అయితే బెటరని లేకపోతే చేజారిపోయే ప్రమాదం ఉంటుందని చెబుతోంది. మొత్తానికి సీపీఐ చాలా అయిష్టంగా మహాకూటమిలో కొనసాగుతోంది. ఇది మహాకూటమికి కొన్ని చోట్ల నష్టం చేసే ప్రమాదం లేకపోలేదు.