Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ తీరు.. అన్నకు నో.. తమ్ముడికి ఓకే

By:  Tupaki Desk   |   20 Nov 2018 11:50 AM GMT
కాంగ్రెస్ తీరు.. అన్నకు నో.. తమ్ముడికి ఓకే
X
గల్లీలో కాదు.. అధిష్టానం ఢిల్లీలో ఉంటుంది మరి.. అందుకే కాంగ్రెస్ నిర్ణయాలు ఎవ్వరికీ అంతుబట్టడం లేదు.. అర్థం కావు.. కాంగ్రెస్ నిర్ణయాలు సొంత పార్టీ నేతలనే కాదు.. ఇప్పుడు మహాకూటమి మిత్రులను నివ్వెరపోయేలా చేస్తున్నాయని కాంగ్రెస్ నేతలు వాపోతున్నారు.

పార్టీ అంటే పడిచచ్చే అపర సీనియర్ కాంగ్రెస్ వాది మర్రి శశిధర్ రెడ్డికి టికెట్ నిరాకరించడం కాంగ్రెస్ శ్రేణులను నివ్వెరపరుస్తోంది. టీఆర్ ఎస్ ప్రభుత్వం అసంబద్ద నిర్ణయాలపై వరుసగా హైకోర్టు తలుపు తడుతూ గులాబీ నేతలను కంటి మీద కునుకు లేకుండా చేసిన మర్రికి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోవడం అందరినీ షాక్ కు గురిచేసింది. కానీ నామినేషన్ చివరి రోజున అనూహ్యంగా ఆయన సోదరుడు ఉపేందర్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది. నామినేషన్ టైం మరికొద్ది సేపట్లో ముగుస్తుందనగా.. చివరి నిమిషంలో కాంగ్రెస్ బీఫాంతో ఉపేందర్ రెడ్డి నామినేషన్ వేయడం విశేషం. ఇదిప్పుడు హాట్ టాపిక్ మారింది.

మెదక్ టికెట్ ను కాంగ్రెస్ పార్టీ ఉపేందర్ రెడ్డికి ఇచ్చింది. ఆయన చివరి నిమిషంలో మెదక్ శాసనసభకు కాంగ్రెస్ బీఫాంతో నామినేషన్ వేశారు. బీఫాం కోసం వేచి చూసి 3 గంటలకు కొద్దిముందు ఇలా చేశారు. మహాకూటమిలో భాగమైన టీజేఎస్ కు కాంగ్రెస్ ఈ టికెట్ ఇచ్చింది. టీజేఎస్ ఈ సీటులో జనార్ధన్ రెడ్డిని బరిలోకి దింపింది. అయితే స్నేహపూర్వక పోటీలో భాగంగా మెదక్ టికెట్ ను ఉపేందర్ రెడ్డికి ఇచ్చినట్టు కాంగ్రెస్ చెబుతోంది. అక్కడ గతంలో పోటీచేసి ఓడిపోయిన విజయశాంతి ద్వారా మెదక్ నేతలు చేసిన ఒత్తిడికి తలొగ్గి కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకుందట.. దీనిపై టీజేఎస్ నేతలు భగ్గుమన్నారు. కాంగ్రెస్ తమను మోసం చేసిందని మండిపడుతున్నారు.

తమ్ముడు ఉపేందర్ రెడ్డికి మెదక్ సీటు ఇచ్చిన కాంగ్రెస్ అధిష్టానం.. అన్న శశిధర్ రెడ్డికి మాత్రం టికెట్ కేటాయించకపోవడం అందరినీ షాక్ కు గురిచేసింది. మర్రి తనకు తెలిసిన ఢిల్లీ పరిచయాలతో ఎంత ప్రయత్నించినా కాంగ్రెస్ అధిష్టానం నుంచి టికెట్ దక్కించుకోలేకపోయారు. దీంతో ఆయన ఎన్సీపీ బీఫాం సంపాదించి సనత్ నగర్ లో నామినేషన్ వేశారు. అయితే శశిధర్ రెడ్డిని ఉపసంహరించుకునేందుకు తెరవెనుక ప్రయత్నాలను కాంగ్రెస్ నేతలు ప్రారంభించారు. ఇలా అభిమానించే అన్నను వదిలి.. తమ్ముడికి గెలుపు సాధ్యం కానీ సీటు ఇచ్చిన కాంగ్రెస్ వైనం ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది.