Begin typing your search above and press return to search.

ఏపీలో క‌ల‌క‌లం!... సీఎంఆర్ ఎఫ్ చెక్ బౌన్స్‌!

By:  Tupaki Desk   |   20 April 2019 1:39 PM GMT
ఏపీలో క‌ల‌క‌లం!... సీఎంఆర్ ఎఫ్ చెక్ బౌన్స్‌!
X
ఏపీలో ఇప్పుడు ఓ విష‌యం పెను క‌ల‌క‌ల‌మే రేపింది. ముఖ్య‌మంత్రి స‌హాయ నిధి (సీఎంఆర్ ఎఫ్‌) త‌ర‌ఫున ఇచ్చిన ఓ చెక్ బౌన్స్ అయిపోయింది. తెలుగు నేల విభ‌జ‌న త‌ర్వాత క‌నీసం రాజ‌ధాని కూడా లేకుండా ఏర్పాటైన ఏపీ తీవ్ర ఆర్థిక క‌ష్టాల‌తోనే ప్ర‌యాణం ప్రారంభించిన విష‌యం తెలిసిందే. అయితే ప్ర‌భుత్వ పాల‌న‌ - అత్య‌వస‌రాల‌కు వినియోగించే నిధుల విష‌యంలో పెద్ద‌గా ఇబ్బందేమీ లేకున్నా.. అభివృద్ధి నిధుల‌కు మాత్రం నిత్యం కొర‌తే. సీఎం రిలీఫ్ ఫండ్ అంటే... అత్య‌వ‌స‌రం కిందే లెక్క క‌దా. అస‌లు సీఎంఆర్ ఎఫ్ ఖాతాలో నిధులు లేకుండా ఉండే ప‌రిస్థితి దాదాపుగా ఉండ‌దు క‌దా. మ‌రి సీఎంఆర్ ఎఫ్ ద్వారా ఇచ్చిన చెక్ బౌన్స్ ఎలా అవుతుంది? సీఎంఆర్ ఎఫ్ ఖాతాలో డ‌బ్బుల్లేకుంటేనే క‌దా.. ఆ చెక్ బౌన్స్ అయ్యేది. నిజ‌మే.. సీఎంఆర్ ఎఫ్ లో డ‌బ్బుల్లేవు. కాబ‌ట్టే ఆ చెక్ బౌన్స్ అయ్యింది.

అయినా ఆ బౌన్స్ అయిన చెక్కు విలువ ఎంతో తెలుసా? కేవ‌లం రూ.26,920 మాత్ర‌మే. సీఎంఆర్ ఎఫ్ లో కోట్ల‌లో నిధులుండాల్సి ఉంటే... క‌నీసం వేల‌ల్లో కూడా నిధులు లేవ‌ని ఈ ఉదంతం చెబుతోంది. అందుకే ఇప్పుడీ విష‌యం ఏపీలో పెను సంచ‌ల‌నంగానే మారిపోయింది. ఉమ్మ‌డి రాష్ట్రానికి సీఎంగా ఉన్న స‌మ‌యంలో సీఎంఆర్ ఎఫ్ కింద సాయం చేసే విష‌యాన్ని అస‌లు ప‌ట్టించుకున్న‌ట్లుగానే క‌నిపించ‌ని టీడీపీ అధినేత‌ - ఏపీ ఆప‌ద్ధ‌ర్మ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు.. న‌వ్యాంధ్ర సీఎంగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత చేతికి ఎముక లేని రీతిలోనే సాయం చేస్తున్నారు. సీఎంఆర్ ఎఫ్ కింద సాయం కోసం త‌న వ‌ద్ద‌కు వ‌చ్చే ఏ ఒక్క‌రిని కూడా చంద్ర‌బాబు కాద‌న‌డం లేదు. అడిగిన మేర‌కు - అవ‌స‌రం మేర‌కు నిధుల‌ను భారీగానే విడుద‌ల చేస్తున్నారు.

ఈ క్ర‌మంలో క‌ర్నూలు జిల్లా పాణ్యంకు చెందిన గంగాధ‌ర్ రెడ్డి త‌న భార్య జ్యోతి అనారోగ్యం పాలైతే.. చికిత్స కోసం సీఎం కార్యాల‌యాన్ని సంప్ర‌దించారు. ఆయ‌న ప‌రిస్థితిని ప‌రిశీలించిన సీఎం కార్యాల‌యం జ్యోతి వైద్య ఖ‌ర్చుల నిమిత్తం రూ.26,920ల‌ను విడుద‌ల చేస్తూ నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు టీడీపీ నేత‌ల ద్వారా స‌ద‌రు చెక్కును అందుకున్న గంగాధ‌ర్ రెడ్డి... దానిని బ్యాంకులో వేసుకునేందుకు వెళితే.. నిధులు లేని కార‌ణంగా స‌ద‌రు చెక్ ను రిజెక్ట్ చేస్తున్న‌ట్లు బ్యాంకు అధికారులు బ‌దులిచ్చార‌ట‌. దీంతో గంగాధ‌ర్ రెడ్డి ప‌రిస్థితి అయోమ‌యంలో ప‌డిపోయింది. గంగాధ‌ర్ రెడ్డి అమోయ‌మంలో ప‌డితే... సీఎంఆర్ ఎఫ్ లో నిదుల్లేవ‌న్న విష‌యం తెలిసి ఏపీ ప్ర‌జ‌లు మ‌రింత‌గా ఆందోళ‌న చెందక త‌ప్ప‌ని ప‌రిస్థితి నెల‌కొంది. మ‌రి ఈ ప‌రిస్థితికి కార‌ణాలేమిట‌న్న విష‌యం ఎప్పుడు తేలుతుందో చూడాలి.