Begin typing your search above and press return to search.

అదేంది కేసీఆర్‌..ఈసారి స‌ల‌హాలేమీ ఇవ్వ‌లేదా?

By:  Tupaki Desk   |   16 Jun 2018 5:30 PM GMT
అదేంది కేసీఆర్‌..ఈసారి స‌ల‌హాలేమీ ఇవ్వ‌లేదా?
X
పాత్రికేయం స్టైల్ అంత‌కంత‌కూ మారిపోతోంది. గ‌డిచిన నాలుగేళ్లుగా ఈ తీరు కొట్టొచ్చిన‌ట్లుగా క‌నిపిస్తోంది. ప‌దేళ్ల క్రితం ప్ర‌ధాన‌మంత్రిని ముఖ్య‌మంత్రి ఒక‌రు భేటీ అయితే.. అధికారికంగా భేటీ అయిన వైనాన్ని రిపోర్ట్ చేస్తూనే.. ఇద్ద‌రి భేటీ ఎలా జ‌రిగింది? బ‌య‌ట‌కు వ‌చ్చిన విష‌యాల‌కు.. రాని విష‌యాల‌కు పొంత‌న ఏమిట‌న్న‌విశ్లేష‌ణ‌తో కూడిన క‌థ‌నాలు వ‌చ్చేవి.

కానీ.. ఇప్పుడు రిపోర్టింగ్ స్టైల్ మారిపోయింది. అధికారికంగానూ.. కొన్నిసార్లు అన‌ధికారికంగా విడుద‌ల చేసే ముఖ్య‌మంత్రి కార్యాల‌య ప్రెస్ నోట్ ను రాయ‌ట‌మే ఇప్పుడు ఎక్కువ‌గా మారిపోయింది. దీంతో.. కీల‌క భేటీల్లో ఏం జ‌రిగింద‌న్న‌ది అధికారికంగా వెల్ల‌డైన స‌మావేశాన్ని ప్ర‌స్తావించ‌ట‌మే త‌ప్పించి.. మ‌రింకేమీ బ‌య‌ట‌కు రాని దుస్థితి నెల‌కొంది.

తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి ప్ర‌ధాని మోడీని క‌లిసిన ప్ర‌తిసారీ ఆస‌క్తిక‌ర‌మైన వార్త‌లు వ‌చ్చేవి. వాటి సారాంశం ఏమిటంటే.. ప్ర‌ధాని మోడీకి కేసీఆర్ స‌ల‌హాలు.. సూచ‌నలు ఇచ్చారంటూ భారీ వార్త‌లు ప్ర‌ముఖంగా అచ్చేసేవారు. మోడీకి కేసీఆర్ స‌ల‌హాలు ఇవ్వ‌ట‌మా? ఆ సూచ‌న‌ల్ని విన్న వెంట‌నే కేసీఆర్ రావు జీ మీరు అద్భుతమైన విష‌యాన్ని చెప్పార‌న్న‌ట్లుగా ప్ర‌ధాని రియాక్ట్ అయ్యార‌ని.. తెలంగాణ రాష్ట్ర సీఎంకు మోడీ పెద్ద పీట వేసిన‌ట్లుగా వార్త‌లు వ‌చ్చేవి.

కానీ.. ఈసారి అలాంటి వార్త‌లేమీ రాక‌పోవ‌టం గ‌మ‌నించారా? మోడీని క‌లిసిన సంద‌ర్భంగా ప్ర‌ధాని దృష్టికి ప‌ది అంశాల‌తో కూడిన విన‌తిపత్రం ఇవ్వ‌టం.. అదే విష‌యం ప‌త్రిక‌ల్లో ప్ర‌ముఖంగా రావ‌టం జ‌రిగింది. అంత‌కు మించిన ప్ర‌ధాని మోడీతో సీఎం కేసీఆర్ ఏం మాట్లాడార‌న్న విష‌యాలు బ‌య‌ట‌కు రాక‌పోవ‌టం అంటే.. అస‌లేం జ‌ర‌గ‌లేదా? అన్న సందేహం రాక మాన‌దు. గంట భేటీ అంటే.. వాతావ‌ర‌ణం సానుకూలంగా ఉన్న‌ట్లే. మ‌రి.. పాజిటివ్ గా ఉన్న వేళ‌లో మ‌రింత ఫోక‌స్ అయ్యేలా వార్తలు వ‌చ్చేవి. అలా కాకుండా ఉందంటే ఎందుక‌లా? అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం.. త‌న‌కు అపాయింట్ మెంట్ ఇస్తాన‌ని చెప్పి రిజెక్ట్ చేసిన వైనం కేసీఆర్ ను హ‌ర్ట్ చేసింద‌ని.. తాజా భేటీ కూడా నిధుల అవ‌స‌రం కావ‌టంతో త‌ప్ప‌నిస‌రి అయ్యి క‌లిశారే త‌ప్పించి.. వెనుక‌టి రోజుల్లో ఉన్నంత స‌హృద్బావ వాతావ‌ర‌ణం అంత ఎక్కువ‌గా లేద‌న్న మాట వినిపిస్తోంది. అదే స‌మ‌యంలో ఈసారి భేటీ బ‌య‌ట‌కు వెళ్ల‌డించ‌లేని అంశాల‌కు సంబంధించింద‌ని.. ఈ కార‌ణంతోనే ఆ విష‌యాల ప్ర‌స్తావ‌న తీసుకురాకుండా.. ప్రెస్ నోట్ ను పంప‌టం.. మోడీ భేటీకి సంబంధించి ఎవ‌రూ నోరు విప్ప‌క‌పోవ‌టం చూస్తే.. విన‌తుల‌కు మించింది మ‌రేదో ఇద్ద‌రు ముఖ్య నేత‌ల మ‌ధ్య చ‌ర్చ‌కు వ‌చ్చి ఉంటుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.