Begin typing your search above and press return to search.

జగన్ సంచలనం..ప్రభుత్వ వైద్యుల ప్రైవేట్ ప్రాక్టీస్ కుదరదంతే!

By:  Tupaki Desk   |   18 Sep 2019 4:23 PM GMT
జగన్ సంచలనం..ప్రభుత్వ వైద్యుల ప్రైవేట్ ప్రాక్టీస్ కుదరదంతే!
X
నవ్యాంధ్రప్రదేశ్ కు నూతన ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన నిర్ణయాలతో ముందుకు సాగుతున్నారు. సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే ప్రతి విషయంలో తనదైన విజన్ తో కూడిన నిర్ణయాలను తీసుకుంటున్న జగన్... తాజాగా ప్రభుత్వ వైద్య సేవలకు సంబంధించి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేసే దిశగానే సాగుతున్న జగన్ తీసుకున్న ఈ నిర్ణయంతో... ఇకపై ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యులుగా పనిచేస్తున్న వారు ప్రైవేట్ ప్రాక్టీస్ చేయడానికి వీల్లేదు. ఈ మేరకు ప్రభుత్వ వైద్యుల ప్రైవేట్ ప్రాక్టీస్ పై నిషేదం విధిస్తూ బుధవారం జగన్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో ప్రభుత్వ వైద్యులు బేసిక్ పే స్కేల్ ను కూడా పెంచేందుకు నిర్ణయించింది.

రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేసే దిశగా చేపట్టాల్సిన చర్యలను సూచించాలంటూ జగన్ సర్కారు... రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సుజాతారావు అధ్యక్షతన ఓ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి - ప్రభుత్వ వైద్య రంగం స్థితిగతులు - ఎదురవుతున్న ఇబ్బందులు - చేపట్టాల్సిన సంస్కరణలకు సంబంధించి సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. ఈ నివేదికలో ప్రధానంగా ఆ కమిటీ వంద మేర సూచనలను చేసి - వాటి అమలుతో ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేసే అవకాశాలున్నాయని తెలిపింది. బుధవారం కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించగా - దానిపై అక్కడికక్కడే జగన్... కమిటీ సభ్యులతో పాటు ఉన్నతాదికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సమీక్షలో ప్రదానంగా ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యులుగా పనిచేస్తున్న మెజారిటీ మంది డాక్టర్లు... ప్రైవేట్ ప్రాక్టీస్ ను కూడా నిర్వహిస్తున్నారన్న అంశంపై కీలక చర్చ జరిగింది. ఓ వైపు ప్రభుత్వాసుపత్రుల్లో విధులు నిర్వర్తిస్తూనే వైద్యులు ప్రైవేట్ ప్రాక్టీస్ కొనసాగించడానికి గల కారణాలను కూడా జగన్ ఆరా తీశారు. ప్రభుత్వ వైద్యులుగా డాక్టర్లకు అందుతున్న వేతనం చాలా తక్కువగా ఉందని, దీంతోనే చాలా మంది ప్రభుత్వ వైద్యులు ప్రైవేట్ ప్రాక్టీస్ బాట పడుతున్నారని కమిటీ నివేదించింది. ఈ క్రమంలో కాసులు కురిపించే ప్రైవేట్ ప్రాక్టీస్ కే ప్రాధాన్యం ఇస్తున్న ప్రభుత్వ వైద్యులు... ప్రభుత్వాసుపత్రుల్లో తాము నిర్వర్తించాల్సిన విధులను గాలికి వదిలేస్తున్నారన్న వాదన కూడా వినిపించింది. ఈ పరిస్థితిని మారిస్తే తప్పించి ప్రభుత్వ వైద్య రంగం బాగుపడదని కూడా కమిటీ నివేదించింది. దీంతో అక్కడికక్కడే సంచలన నిర్ణయం తీసుకున్న జగన్... రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యుల ప్రైవేట్ ప్రాక్టీస్ పై నిషేదం విదిస్తున్నట్లుగా ప్రకటించారు.

ఈ నిబంధనతో ఏర్పడే ఇబ్బందులను కూడా అవగాహన చేసుకున్న జగన్... ప్రభుత్వ వైద్యులు సర్కారీ కొలువులకు చెల్లుచీటి ఇవ్వకుండా ఉండేలా.. కమిటీ సూచించిన మేరకు ప్రభుత్వ వైద్యుల బేసిక్ పే స్కేళ్లను భారీగా పెంచనున్నట్లుగా కూడా కీలక ప్రకటన చేశారు. ఈ పే స్కేళ్లను ఏ మేర పెంచాలన్న విషయాన్ని తేల్చేందుకు త్వరలోనే ఓ కమిటీని వేయనున్నట్లుగా కూడా జగన్ ప్రకటించారు. సదరు కమిటీ నివేదిక అందగానే ప్రభుత్వ వైద్యులకు పే స్కేళ్లను పెంచుతామని కూడా జగన్ పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రభుత్వ వైద్యుడితో ఆరోగ్యశ్రీ కేసును చేయించే ప్రైవేట్ ఆసుపత్రులను ఆరోగ్య శ్రీ జాబితా నుంచి తొలగించే విషయాన్ని కూడా అమలులోకి తెచ్చేలా ఆలోచన చేస్తున్నట్లుగా జగన్ పేర్కొన్నారు. మొత్తంగా ఈ చర్యలు అమలు అయితే నిజంగానే సర్కారీ వైద్యం బాగుపడటం ఖాయమనే వాదన వినిపిస్తోంది.