Begin typing your search above and press return to search.

ఇప్పుడు గొప్పలేంటి సీఎం రమేశ్

By:  Tupaki Desk   |   30 April 2016 5:08 AM GMT
ఇప్పుడు గొప్పలేంటి సీఎం రమేశ్
X
శవాల దగ్గర పేలాలు ఏరుకునేలా వ్యవహరిస్తున్నాయి ఏపీ రాజకీయ పార్టీలు. విభజన కారణంగా ఏపీకి జరిగిన నష్టం ఒక ఎత్తు అయితే.. ఏపీ రాజకీయ పార్టీలు అనుసరిస్తున్న విధానాలతో ఏపీ ప్రయోజనాలు భారీగా నష్టపోతున్న పరిస్థితి. ఎవరికి వారు వారి.. వారి రాజకీయ ప్రయోజనాలు మాత్రమే ముఖ్యంగా మారటమే కానీ.. సీమాంధ్రుల గురించి పట్టించుకున్న దాఖలాలు కనిపించకపోవటం గమనార్హం.

శుక్రవారం చోటు చేసుకున్న పరిణాల్నే చూడండి.. ఏపీకి ప్రత్యేక హోదా అంశానికి సంబంధించి ఏపీ కాంగ్రెస్ నేత.. రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ప్రైవేటు బిల్లు పెట్టి అధికార బీజేపీకి మంట పుట్టించారు. ప్రత్యేక హోదా మీద జరిగిన చర్చ సందర్భంగా ఏపీ కాంగ్రెస్ నేతలు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మీదా.. మోడీ సర్కారు మీద టార్గెట్ చేసే ప్రయత్నం చేసినా.. ఏపీ ప్రయోజనాల గురించి దుమ్ము దులిపే ప్రయత్నం చేశారు.ఏపీ మోడీ సర్కారు ఏమీ చేయలేదన్న విషయాన్ని తేల్చి చెప్పటమే కాదు.. బీజేపీ నేతల నోటి నుంచి మాట రాని పరిస్థితి తీసుకొచ్చారు.

అదే సమయంలో.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మీద కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టనట్లు ఉన్నారని మండిపడ్డారు. మోడీ సర్కారుతో ఉన్న స్నేహం కారణంగా గొంతు పెద్దది చేసి మాట్లాడని వాస్తవాన్ని గుర్తించాల్సిందే. అలా అని ప్రత్యేక హోదా రాకపోవటాన్ని బాబు లైట్ తీసుకున్నారనీ చెప్పలేం. పరిస్థితి ఇబ్బందికరంగా ఉండటంతో ఆయన ఆచితూచి వ్యవహరిస్తున్నారని మాత్రం చెప్పొచ్చు. అయితే.. బాబు ఇబ్బందిని తన రాజకీయ ప్రయోజనంగా మార్చుకునే ప్రయత్నాన్ని కాంగ్రెస్ నేతలు ప్రదర్శించారు. ఇదిలా ఉంటే బీజేపీ నేతలు ఎంత సేపటికి మోడీ మైండ్ సెట్ ను ప్రదర్శించారే కానీ.. ఏపీ మీద ఎలాంటి ప్రేమను చూపలేదు. ఇదిలా ఉంటే.. ఏపీ అధికారపక్ష సభ్యుడు సీఎం రమేష్ కు ఏపీ ప్రయోజనాల కంటే కూడా తమ అధినేత చంద్రబాబు ఇమేజ్ కాపాడుకోవటమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తుంది. ఇలా ఎవరికి వారు.. వారి వారి చట్రంలో ఉండటం.. కోట్లాది సీమాంధ్రుల ప్రయోజనాల కంటే కూడా.. తమ తమ రాజకీయ ప్రయోజనాలకే పెద్ద పీట వేసుకోవటం కనిపిస్తుంది.

ఏపీకి ప్రత్యేక హోదా విషయం మీద కాంగ్రెస్ నేతలు నిలదీస్తున్నప్పడు.. తమ అధినేత చంద్రబాబు మీద విమర్శల్ని తిప్పి కొడుతూనే.. మోడీ సర్కారు అనుసరిస్తున్న వైఖరిని చీల్చి చెండాల్సి ఉన్నా.. అలాంటి పని చేయకపోవటం గమనార్హం. ప్రత్యేక హోదా కోసం తమ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్రంతో ఎన్ని సార్లు చర్చించిందన్న లెక్కలు చెప్పే ప్రయత్నం చేశారే కానీ.. మోడీ సర్కారు తీరుపై ఆగ్రహం ప్రదర్శించింది లేదు. తమ సీఎం బాబు ప్రధాని మోడీని 6సార్లు.. ఆర్థికమంత్రి జైట్లీని 15 సార్లు కలిసి ప్రత్యేక హోదా గురించి మాట్లాడారన్నారు. హోదా ఇష్యూ మీద ఇంత ప్రయత్నం చేసిన తమ అధినేత చంద్రబాబును నిద్రపోతున్నారని కాంగ్రెస్ నేతలు విమర్శించటమేంటని ప్రశ్నించారే తప్పించి ప్రత్యేక హోదా విషయంలో మోడీ సర్కారు తమను తీవ్రంగా ఇబ్బంది పెడుతుందని.. ఇదే తీరు కొనసాగితే ఏపీ ప్రయోజనాలు భారీగా దెబ్బ తింటాయన్న మాట మాత్రం సీఎం రమేశ్ నోటి నుంచి రాకపోవటం గమనార్హం. తమ అధినేత గొప్పలు చెప్పుకోవటానికి చూపించిన ఆత్రుత.. ఏపీ ప్రజల గురించి ఎందుకు చూపించరు?