సీఎం రమేశ్ మేనల్లుడు ఆత్మహత్య!... పాపం టీ ఇంటర్ బోర్డుదేనా?

Sat Apr 20 2019 22:12:14 GMT+0530 (IST)

టీడీపీ సీనియర్ నేత ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ ఇంట విషాదం నెలకొంది. ఇంటర్ విద్యనభ్యసిస్తున్న సీఎం రమేశ్ మేనల్లుడు ధర్మారామ్... పరీక్షల్లో ఫెయిలయ్యానన్న మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. నిన్న రాత్రే ఈ ఘటన చోటుచేసుకోగా... కాస్తంత ఆలస్యంగా ఈ విషయం వెలుగు చూసింది. మేనల్లుడి ఆత్మహత్యతో సీఎం రమేశ్ ఇంట ఇప్పుడు విషాదం అలముకుంది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే... సీఎం రమేశ్ మేనల్లుడు ధర్మారామ్ కుటుంబం హైదరాబాద్ లోని శ్రీనగర్ కాలనీ వాసవి భువన అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటోంది. ఇంటర్మీడియట్ విద్య కోసం నారాయణ కాలేజీలో చేరిన ధర్మారామ్ ఇటీవలే పరీక్షలు రాశాడు.అయితే నిన్న వెలువడిన ఫలితాల్లో అన్ని సబ్జెక్టుల్లో పాసైన ధర్మారామ్ ఓ సబ్జెక్టులో ఫెయిల్ అయ్యాడట. దీంతో రాత్రి దాకా విచార వదనంతోనే గడిపిన ధర్మారామ్... రాత్రి తాము ఉంటున్న అపార్ట్ మెంట్ ఏడో అంతస్తు నుంచి కిందకు దూకాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన ధర్మారామ్ ను అతడి కుటుంబ సభ్యులు హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూనే ధర్మారామ్ మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసినా... దీనిని గోప్యంగానే ఉంచారు. నేటి మధ్యాహ్నం గాంధీ ఆసుపత్రిలో ధర్మారామ్ మృతదేహానికి పోస్ట్ మార్టం పూర్తి చేసి మృతదేహాన్ని అతడి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

ఇదిలా ఉంటే... ఈ దఫా ఇంటర్ ఫలితాల్లో పెద్ద ఎత్తున పొరపాట్లు జరిగాయని విద్యార్థుల తల్లిదండ్రులు నేటి మధ్యాహ్నం ఇంటర్ బోర్డు కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. పరీక్షకే హాజరు కాని విద్యార్థిని పాస్ చేసిన అధికారులు... ఓ జిల్లాలో టాపర్గా నిలిచిన విద్యార్థికి ఓ సబ్జెక్టులో సున్నా మార్కులు వేశారు. మొత్తంగా ఫలితాలన్నీ తప్పుల తడకలుగా ఉన్నాయన్న ఆరోపణలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ధర్మారామ్ విషయంలోనూ బోర్డు తప్పిదం ఏమైనా ఉందా? అన్న కోణంలోనూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థులకు సంబంధించి కీలక దశ అయిన ఇంటర్ లో... బోర్డు తప్పిదాల వల్ల తమ పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిపోయిందని కూడా ధర్నాలో పాల్గొన్న తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ధర్నాకు దిగిన విద్యార్థుల తల్లిదండ్రులకు సరైన సమాధానాలు చెప్పాల్సిన బోర్డు కార్యదర్శి అశోక్ నిర్లక్ష్యంగా సమాధానాలిచ్చిన తీరు కూడా ఇప్పుడు సంచలనంగానే మారిపోయింది. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్న ఇంటర్ బోర్డుపై చర్యలు ఎందుకు తీసుకోరన్న వాదన క్రమంగా బలపడుతోంది. మరి ధర్మారామ్ విషయంలోనూ ఇంటర్ బోర్డు తప్పిదం ఏమైనా ఉందా? అన్న కోణంలో అనుమానాలు వ్యక్తమవుతుండగా.... ఈ అనుమానాలు నిజమే అయితే మాత్రం ధర్మారామ్ ఆత్మహత్య రెండు తెలుగు రాష్ట్రాల్లో పెను కలకలమే రేపడం ఖాయమేనన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.