Begin typing your search above and press return to search.

సీఎం రమేష్.. జ‌గ‌న్...కేటీఆర్... ఓ జీతం

By:  Tupaki Desk   |   27 Aug 2015 5:14 AM GMT
సీఎం రమేష్.. జ‌గ‌న్...కేటీఆర్... ఓ జీతం
X
రాజ‌కీయాల్లో శాశ్వ‌త శ‌త్రువులు...శాశ్వ‌త మిత్రులు ఉండ‌రు అంటారు. అది నిజ‌మ‌ని అనేక సంద‌ర్భాల్లో రుజువు అవుతోంది. అయితే ఇది కేవ‌లం వారి వారి రాజ‌కీయ ప‌రిణామాల విష‌యంలోనే జ‌రుగుతోంది. తాజాగా ఓ మంచి కార్య‌క్ర‌మం కోసం ఇలాంటి ప‌రిణామం ఒక‌టి జ‌రిగింది. అది కూడా ప‌ర‌స్ప‌ర భిన్న ధ్రువాలైన టీఆర్ ఎస్ యువ‌నాయ‌కుడు, రాష్ర్ట మంత్రి కేటీఆర్‌, వైసీపీ అధినేత జ‌గ‌న్‌ తో. చ‌ర్చించింది విద్యుత్ ఉద్యోగుల అంశంపై.

సీమాంధ్ర స్థానిక‌త కార‌ణం చూపి తెలంగాణ సర్కారు 1250 మంది విద్యుత్‌ ఉద్యోగులను రిలీవ్‌ చేసింది. అయితే బదిలీ అయిన ఉద్యోగులు జీతాల్లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేప‌థ్యంలో వారు క‌లిసిన నాయ‌కుల‌కు త‌మ మొర‌ను చెప్పుకొంటున్నారు. ఇదే క్ర‌మంలో టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌ ను విద్యుత్‌ ఉద్యోగులు కొందరు కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. దానిపై స్పందించిన సీఎం రమేశ్‌... వైఎస్‌ జగన్‌ తో ఈ అంశంపై ఫోన్‌ లో మాట్లాడారట‌. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తో మాట్లాడి విద్యుత్‌ ఉద్యోగులకు వేతనాలు ఇప్పించాలని జగన్‌ ను సీఎం ర‌మేశ్ కోరారు.

విద్యుత్ ఉద్యోగులు అంద‌రివారు కావ‌డం, ఉమ్మ‌డి స‌మ‌స్య కావ‌డంతో జగన్ సైతం ఈ ప్ర‌తిపాద‌న‌కు సమ్మతించారు. విద్యుత్‌ ఉద్యోగులతో జ‌గ‌న్ మాట్లాడారు. అయితే... జగన్‌ ఈ విషయంపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ తో కాకుండా, ఆయన తనయుడు కేటీఆర్‌ తో మాట్లాడారు. బదిలీ అయిన ఉద్యోగులకు వేతనాలు ఇప్పించాలని కోరారు. అనంతరం విద్యుత్‌ ఉద్యోగులు తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ను కలిసి తమ కష్టాలు చెప్పుకొన్నారు. అప్పటికే తనతో జగన్‌ మాట్లాడిన నేపథ్యంలో... కేటీఆర్‌ దీనిపై స్పందించి, తెలంగాణ విద్యుత్‌ సంస్థల యాజమాన్యాలతో ఫోన్‌ లో మాట్లాడారు. ''ఉద్యోగుల ఉసురు మనకెందుకు! జీతాలు ఇవ్వండి'' అని కోరారు. అయితే.. పెద్దాయన (కేసీఆర్‌) వేతనాలు చెల్లించవద్దని ఆదేశించారని, ఆ అంశం ఆయన పరిధిలో ఉందని అధికారులు స్పష్టం చేశారు. దీంతో కేటీఆర్‌ కూడా తన నిస్సహాయత వ్యక్తం చేసినట్టు తెలిసింది.

మొత్తంగా ఉద్యోగుల కోసం త‌మ వంతు స‌హ‌కారం అందించి పార్టీలు, ప్రాంతాల‌కు అతీతంగా నేత‌లు ప్ర‌య‌త్నం చేయ‌డం అభినంద‌నీయ‌మే. కానీ తెలంగాణ అధినేత ఎస్ అన‌క‌పోవ‌డంతో స‌మ‌స్య ప‌రిష్కారం కాక‌పోవ‌డ‌మే బాధాక‌రం.