బాబు ప్రత్యర్థి పిలుపుతో కేసీఆర్ ఫ్రంట్ వేగం పెరిగింది

Tue Apr 17 2018 11:46:11 GMT+0530 (IST)

జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పును కోరుకుంటూ గులాబీదళపతి కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్కు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల సమయానికి ఫెడరల్ ఫ్రంట్ను బలంగా తీర్చిదిద్దేందుకు కేసీఆర్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. అందులోభాగంగా ఇటీవల బెంగళూరు వెళ్లి జేడీఎస్ అధ్యక్షుడు - మాజీ ప్రధాని దేవేగౌడ - ఆయన కుమారుడు - మాజీ సీఎం కుమారస్వామితో సమావేశమై ఫెడరల్ ఫ్రంట్ పై సమాలోచనలు చేశారు. అంతకుముందు పశ్చిమబెంగాల్ లో టీఎంసీ అధినాయకురాలు  -ఆ రాష్ట్ర సీఎం మమతాబెనర్జీ ఫ్రంట్ ఏర్పాటుపై చర్చించారు. తర్వాత హైదరాబాద్ వచ్చిన జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ కేసీఆర్ ను కలిసి మద్దతు తెలిపారు. ఛత్తీస్ గఢ్ మాజీ సీఎం అజిత్ జోగి కూడా కేసీఆర్ తో ఫోన్ లో మాట్లాడి ఫ్రంట్ కు సానుకూలత వ్యక్తం చేశారు.ఇలా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో సీఎం కేసీఆర్ ముఖ్యపాత్ర పోషిస్తున్న క్రమంలో ఆయనకు అనూహ్య ప్రతిపాదన వచ్చింది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు విధానాల పరంగా పక్కలో బల్లెంలాగా మారిన ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ కు నుంచి గులాబీ దళపతికి ఆహ్వానం అందింది. ఏపీకి రైల్వోజోన్ విషయంలో పట్నాయక్ సర్కారు మోకాలడ్డుతున్న సంగతి తెలిసిందే. ఇలా ఏపీతో వార్ సాగిస్తున్న ఒడిషాముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావును మే మొదటి వారంలో ఒడిషా రావాల్సిందిగా  కోరారు. ప్రస్థుతం ఒరిస్సాలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున మే మొదటి వారంలో భువనేశ్వర్ రావలసిందిగా నవీన్ పట్నాయక్ సీఎం కేసీఆర్ ను ఆహ్వానించారు. దీనికి కేసీఆర్ అంగీకరించారు. దేశ రాజకీయ వ్యవస్థలో గుణాత్మక మార్పు తీసుకరావడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఈ సమావేశం జరగనుందని సమాచారం.

తాజా భేటీ అనంతరం మే నెలలోనే కేసీఆర్  మరోమారు ఢిల్లీ టూర్ పెట్టుకుంటారని తెలుస్తోంది. ఈ సమావేశం సందర్భంగా ఫ్రంట్లో ఏయే పార్టీలు క్రియాశీలంగా ఉండనున్నాయి ఎలాంటి రాజకీయ శైలితో ముందుకు సాగాలి బీజేపీకాంగ్రెస్లకు ప్రత్యామ్నాయంగా తమ ఫ్రంట్ ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటుంది అనే అంశాలను ఢిల్లీ వేదికగా చర్చిస్తారని సమాచారం.