Begin typing your search above and press return to search.

రెండేళ్ల తర్వాత ఈ మాటలేంది కేసీఆర్

By:  Tupaki Desk   |   30 July 2016 7:14 AM GMT
రెండేళ్ల తర్వాత ఈ మాటలేంది కేసీఆర్
X
ఏదైనా వ్యవస్థలో మార్పులు రావాలంటే ఏం చేస్తారు? విపక్షంలో ఉంటే పోరాటం చేస్తారు. అధికారంలో ఉంటే విధానాలు రూపొందిస్తారు. కానీ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తీరు ఇందుకు భిన్నంగా కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి దాదాపు పాతిక నెలలు పూర్తి అయిన పరిస్థితి. వ్యవస్థలో మార్పులు తేవటానికి.. వ్యవస్థల్ని ప్రక్షాళన చేయటానికి ఈ సమయం సముచితమైనదే. కానీ.. ఏళ్లకు ఏళ్లకు తరబడి కొన్ని అంశాల్ని అస్సలు పట్టించుకోని కేసీఆర్.. ఉన్నట్లుండి వాటి మీద దృష్టి పెట్టి ఉమ్మడి రాష్ట్ర విధానాలు అంటూ తిట్టి పోయటంలో లాజిక్కు ఏమిటో అస్సలు అర్థం కాదు.

తెలంగాణ ఉద్యమంలో నీళ్లు..నిధులు.. నియమకాలు తర్వాత ఎక్కువగా వినిపించిన అంశం విద్యావ్యవస్థే. విద్యావిధానం తీరును తీవ్రంగా తప్పు పట్టే కేసీఆర్.. దాన్ని సమూలంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని పదే పదే చెబుతుండేవారు. మరి.. ఇన్ని మాటలు చెప్పే కేసీఆర్.. తాను పవర్ లోకి వచ్చిన తర్వాత అయినా ఆ రంగం మీద ప్రత్యేక దృష్టిసారించారా? అంటే అది లేదు. యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న వీసీల నియామకాన్ని పూర్తి చేసేందుకు ఆయన పాతిక నెలలు తీసుకున్నారు.

తీరిగ్గా వీసీల నియమకాన్ని పూర్తి చేసిన కేసీఆర్.. తాజాగా పలువురు మంత్రులు.. వీసీలతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన చెప్పిన మాటలు వింటే కాస్త సిత్రంగా అనిపించక మానవు. వర్సిటీల్లో పెడ ధోరణలు పారదోలటానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని.. నిరుద్యోగులను తయారు చేయొద్దని.. అవసరాలకు తగినట్లుగా మార్పులు చేసి ఉద్యోగ.. ఉపాధి అవకాశాల్ని కల్పించే కోర్సుల్ని ప్రవేశపెట్టాలంటూ క్లాస్ పీకారు. తెలంగాణ రాష్ట్ర పరిస్థితులకు అనుగుణంగా విద్యా విధానం ఉండాలే తప్పించి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వారసత్వాన్ని విడిచిపెట్టాలంటూ చెప్పటం గమనార్హం.

విద్యార్థులకు మంచి భోజనం కల్పించాలని.. వర్సిటీలు నిరుద్యోగుల్ని పెంచేవిగా ఉండకూదన్నారు.కొత్త కోర్సుల్ని ఏర్పాటు చేయాలన్న ఆయన.. తెలంగాణలో ప్రతి ఏడాది 40 నుంచి 45 వేల మంది బీఈడీ.. డీఈడీ లాంటి ఉపాధ్యాయ శిక్షణ పొందుతున్నారని అంత పెద్ద మొత్తంలో ఉపాధ్యాయులఅవసరంలేదని అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన ఇన్ని నెలల తర్వాత ఇలాంటి మాటలు చెప్పే బదులు.. తొలుతే విద్యావిధానం ఎలా ఉండాలన్న విషయాన్ని నిర్ణయించటానికి పరిమిత సమయాన్ని నిర్దేశించి.. అలా వచ్చిన సూచనల్ని పరిశీలించి అమలు చేసి ఉంటే వ్యవస్థలో ఎంతోకొంత మార్పు వచ్చేది కదా? అలాంటిదేమీ లేకుండా నెలలో ఎక్కువ రోజులు ఫాంహౌస్ లో గడిపేస్తూ.. ఉన్నట్లుండి గుర్తుకు వచ్చినట్లుగా మీటింగ్ లు పెట్టేసి.. ఉమ్మడి రాష్ట్ర విధానాల్ని తప్పు పట్టేయటం వల్ల ప్రయోజనం ఏమీ ఉండదన్న విషయాన్ని కేసీఆర్ గుర్తిస్తే బాగుంటుంది. తెలంగాణ రాష్ట్రం వచ్చాక తాము ఎదుర్కొంటున్న సమస్యలకు చెక్ పడుతుందని ఆశించిన విద్యార్థులు.. అలాంటివేమీ జరగక ఆందోళనలతో రోడ్లు ఎక్కి ఏవైతే చేయాలని నినాదాలు చేస్తున్నారో.. వాటినే పాతిక నెలల తర్వాత సమావేశం పెట్టి మరీ కేసీఆర్ సూచనలు చేయటాన్ని ఏమనాలి?