కేసీఆర్ కు షాక్ తగిలేలా ఎల్ బీనగర్ ఘటన!

Sun Oct 21 2018 17:37:16 GMT+0530 (IST)

ముందస్తు ఎన్నికలకు వెళ్లే ముందు తన ఎమ్మెల్యేలందరితోనూ భేటీ అయ్యారు సీఎం హోదాలో ఉన్న కేసీఆర్. ఆ సందర్భంగా తన ఎమ్మెల్యేలతో మనసు విప్పి మాట్లాడారు. తాను అందరికి టికెట్లు ఇస్తానని.. నలుగురైదుగురు తప్పించి జాబితాలో పెద్దగా మార్పులు ఉండవని.. చెప్పటమేకాదు.. వందకు పైగా స్థానాల్లో టీఆర్ ఎస్ గెలవనుందన్న విషయాన్ని పలు సర్వేలు వెల్లడించినట్లుగా చెప్పారు.వేర్వేరు సంస్థల చేత.. వేర్వేరుగా చేయించిన సర్వేలన్నీ టీఆర్ ఎస్ సర్కారుకు ప్రజలు అనుకూలంగా ఉన్నట్లుగా ఆయన అప్పట్లో చెప్పటమే కాదు.. ఎన్నికల ఎప్పుడైనా రావొచ్చని.. వారి గెలుపు బాధ్యతను తాను తీసుకుంటున్నట్లుగా చెప్పారు. ఎన్నికలు ఎప్పుడన్న విషయాన్ని చెప్పకున్నా.. ఆ మీటింగ్ తోనే ముందస్తు దిశగా కేసీఆర్ అడుగులు వేస్తున్నారన్న విషయంపై అందరికి క్లారిటీ వచ్చేసింది.

అంచనాలకు తగ్గట్లే ముందస్తుకు వెళ్లటం.. ముందే చెప్పినట్లుగా కేసీఆర్ తన సిట్టింగ్ అభ్యర్థులకే టికెట్లు ఇవ్వటం.. మొత్తం 119 స్థానాలకు 105 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. ఇదిలా ఉండగా.. ప్రభుత్వాన్ని రద్దు చేసిన దాదాపు 45 రోజుల తర్వాత ఈ రోజు మరోసారి తన అభ్యర్థులందరితో కలిసి భేటీ అవుతున్నారు.

గడిచిన ఆరేడు వారాల్లో వాతావరణం మారిందని.. కేసీఆర్ కు వ్యతిరేకంగా వాతావరణం మారిందన్న మాట బలంగా వినిపిస్తోంది. దీనికి తోడు. కేసీఆర్ కు వెన్నుదన్నుగా నిలుస్తాయని చెప్పే మీడియా సంస్థల్లోనూ ప్రజల్లో పెల్లుబుకుతున్న వ్యతిరేకతపై పెద్ద ఎత్తున కవరేజ్ ఇవ్వటం కనిపిస్తోంది. అయినప్పటికీ.. తమకు తిరుగులేని రీతిలో ప్రజల్లో మద్దతు ఉందన్న మాటను టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. ప్రజల్లో కేసీఆర్ సర్కారు మీద ఎంత వ్యతిరేకత ఉందన్న విషయంపై ఇప్పటికే పలు వార్తలు వచ్చినా.. 105 మంది అభ్యర్థులతో హైదరాబాద్లో కేసీఆర్ భేటీ అవుతున్న వేళ.. ఊహించిన పరిణామం నగర శివారు నియోజకవర్గమైన ఎల్ బీనగర్ పరిధిలో చోటు చేసుకుంది. టీఆర్ఎస్ అభ్యర్థి రామ్మోహన్ గౌడ్ ప్రచార రథాన్ని ఎల్ బీనగర్ లోని ప్రజలు కొందరు అడ్డుకొని.. వాహనానికి ఉన్న ఫ్లెక్సీల్ని చించివేయటం షాకింగ్ గా మారింది.

గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ ఎస్ తిరుగులేని రీతిలో మెజార్టీ లభించిందని.. సిటీలో పెద్ద ఎత్తున సీట్లు వస్తాయన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి వేళ.. అందుకు భిన్నంగా సిటీలోని ముఖ్యమైన నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి వాహనాన్ని అడ్డుకొని మరీ.. ఫ్లెక్సీలు చించివేయటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఎల్బీ నగర్ అసెంబ్లీ పరిధిలోని బాలాపూర్ మండలం శివాజీ చౌక్ డీఆర్ఎడీఎల్ రోషన్ దౌలాలో ఈ ఉదంతం చోటు చేసుకుంది.

కేసీఆర్ సర్కారు హయాంలో పరిష్కారిస్తామన్న సమస్యలు పరిష్కరించలేదని.. నేతలు ఇచ్చిన హామీలు నెరవేరలేదన్న ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ.. టీఆర్ఎస్ అభ్యర్థి ప్రచార రథాన్ని అడ్డుకోవటం ఇప్పుడు సంచలనంగా మారింది.