Begin typing your search above and press return to search.

కేసీఆర్ మాట‌ల్లో ప్రైవేట్ డాక్ట‌ర్లు అంత‌కంటే హీనం

By:  Tupaki Desk   |   27 Feb 2017 3:40 PM GMT
కేసీఆర్ మాట‌ల్లో ప్రైవేట్ డాక్ట‌ర్లు అంత‌కంటే హీనం
X
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్‌ లో అంగన్‌వాడీ కార్యకర్తలతో స‌మావేశమై వారి సమస్యలపై చర్చించారు.అంగన్‌ వాడీ కార్యకర్తలకు - సహాయ సిబ్బందికి త్వరలో మరోసారి జీతాలు పెంచుతామని సీఎం ప్రకటించారు. అంగన్‌ వాడీ కార్యకర్తలకు రూ. 10,500, సహాయక సిబ్బందికి రూ. 6000 పెంచుతున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది మరోసారి జీతాలు పెంచుకుందామని చెప్పారు. ఉన్నత విద్యార్హతలు ఉన్న వారికి సూపర్‌ వైజర్‌ గా పదోన్నతి కల్పించాలని అధికారులను ఆదేశించారు. అయితే కార్యకర్తలకు ఎవరికైతే ఇండ్లు లేవో వారికి ఇళ్లు కట్టించే ప్రయత్నం చేద్దామన్నారు. అంగన్‌ వాడీ కార్యకర్తలపై ఉన్నతాధికారుల వేధింపులు లేకుండా చర్యలు తీసుకుంటామని కేసీఆర్ తెలిపారు. అంగన్‌ వాడీల్లో పిల్లలకు తిన్నంత ఆహారం పెట్టాలని కార్యకర్తలను ఆదేశించారు. గతంలో మాదిరిగా గ్రాముల లెక్కన ఆహారం పెట్టొద్దన్నారు. పిల్లల ఆరోగ్యం విషయంలో రాజీ పడొద్దని చెప్పారు. గర్భిణిలకు నాణ్యమైన ఆహార పదార్థాలను అందించాలన్నారు.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెరిగేందుకు అంగన్‌ వాడీలు చర్యలు తీసుకోవాలని కేసీఆర్ ఆదేశించారు. మహిళలకు అవసరం లేకపోయినా గర్భసంచి తొలగిస్తున్నారని, ప్రైవేటు ఆస్పత్రుల వైద్యులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. వారి తీరు రాక్ష‌సుల కంటే హీనంగా ఉంద‌న్నారు. గర్భిణీలకు మూడు విడతల్లో రూ. 12 వేలు ఇచ్చే యోచనలో ఉన్నామని తెలిపారు. ఆడపిల్ల పుడితే రూ. 13 వేలు ఇచ్చే ప్రతిపాదనలు రూపొందిస్తున్నామని చెప్పారు. శిశుమరణాలు తగ్గించేందుకు అందరం తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రంలో మాతా శిశు సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యమిస్తామని సీఎం పునరుద్ఘాటించారు. వారి ఆరోగ్యాన్ని అన్ని విధాలా కాపాడుతామని సీఎం స్పష్టం చేశారు. పేద గర్భిణీలు ప్రసవం సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గర్భిణీగా ఉండి కూడా కుటుంబం గడవడం కోసం కూలీ పనులకు వెళ్లడం అత్యంత బాధ కలిగించే విషయమ‌ని, అందుకే ప్రసవానికి ముందు, ప్రసవం తర్వాత తల్లీ బిడ్డల బాధ్యత తీసుకోవాలని భావిస్తున్నట్లు సీఎం చెప్పారు. గర్భిణీలు, బాలింతలు, శిశువులకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ఆరోగ్య లక్ష్మి పథకంతో పోషకాహారం, పాలు, గుడ్లు అందిస్తామన్నారు. గర్భిణీలు ఆరోగ్యంగా ఉంటేనే పుట్టే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. తెలంగాణ తల్లులు జన్మనిచ్చిన పిల్లలు రేపటి తెలంగాణ సంపద. వారు బాగుంటేనే తెలంగాణ బాగుంటుంది. అందుకే వారికి మంచి పోషణ కావాలని సీఎం వెల్లడించారు.

కాగా, రాష్ట్రంలోని అంగన్‌ వాడీ కార్యకర్తలకు ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి జీతాలు పెంచడంతో వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తెలంగాణ భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి అంగన్‌వాడీ కార్యకర్తలు పాలాభిషేకం చేశారు. సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటామని చెప్పారు. ఏ ప్రభుత్వాలు చేయనటువంటి అభివృద్ధి పనులను సీఎం చేస్తున్నారని కొనియాడారు. బంగారు తెలంగాణ సాధనకు కృషి చేస్తామన్నారు. మమ్మల్ని కేసీఆర్ పిలిచి మరీ మా సమస్యలు పరిష్కరించారని తెలిపారు. దీంతో సీఎం మహిళల పక్షపాతి అని మరోసారి నిరూపితమైందన్నారు. మహిళల సంక్షేమం కోసం పాటుపడుతున్న సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారని పేర్కొన్నారు. ఆశించిన దాని కంటే ఎక్కువనే జీతాలు పెంచారని సంతోషం వ్యక్తం చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/