Begin typing your search above and press return to search.

అయోధ్య కేసుపై సుప్రీం కోర్టులో రచ్చ... చీఫ్ జస్టిస్ ఫైర్

By:  Tupaki Desk   |   16 Oct 2019 12:05 PM GMT
అయోధ్య కేసుపై సుప్రీం కోర్టులో రచ్చ... చీఫ్ జస్టిస్ ఫైర్
X
ఎన్నో దశాబ్దాల కాలంగా పరిష్కారం దొరకని సమస్యగా ఉన్న అయోధ్య భూ వివాదంపై సుప్రీం కోర్టులో కేసు నడుస్తూనే ఉన్న సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా కూడా సుప్రీం కోర్టులో రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదంపై విచారణ జరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో బుధవారం కూడా దీనిపై విచారణ కొనసాగింది. అయితే విచారణతో సంబంధం ఉన్న అన్ని సంఘాలు, న్యాయవాదులు కోర్టుకు హాజరయ్యారు. ఇక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం కూడా అన్ని పక్షాల వాదోపవాదనలను వినేందుకు సిద్ధమైంది.

అయితే విచారణ సందర్భంగా ఇరుపక్షాల న్యాయవాదులు ఒకరిపై ఒకరు చేయి చేసుకునేంతవరకు వెళ్ళిపోయారు. దీంతో కోర్టు వాతావరణం వేడెక్కెసింది. మొదట హిందూ మహాసభ తరుపున‌ సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ తన వాదనని వినిపించడం మొదలుపెట్టారు. ఈ సందర్భంగా మాజీ ఐపీఎస్ కిషోర్ రాసిన ‘అయోధ్య రీవిజిటెడ్’ పుస్తకాన్ని కోర్టులో చదివి వినిపించడానికి ప్రయత్నించారు. అయోధ్య భూ వివాదం కేసు విచారణ సందర్భంగా ఈ పుస్తకంలోని కొన్ని అంశాలను ప్రస్తావనకు వచ్చాయి.

అందుకే ఆ పుస్తకంలోని అంశాలని చదవడానికి వికాస్ సిద్ధమయ్యారు. ఆ సమయంలో సున్నీ వక్ఫ్ బోర్డు తరఫున కేసును వాదిస్తోన్న న్యాయవాది రాజీవ్ ధవన్ దాన్ని లాగేశారు. పుస్తకాన్ని తన చేతుల్లోకి తీసుకుని, అందులోని కొన్ని పేజీలను చింపేశారు. ఈ సందర్భంగా వికాస్, తోటి న్యాయవాదులతో కలిసి రాజీవ్ ధవన్ ను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారి మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఒకానొక సమయంలో ఒకరిపై ఒకరు చేయి చేసుకునేంత వరకూ వెళ్లింది పరిస్థితి.

వీరి గొడవని గమనిస్తున్న సుప్రీం ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ ఒక్కసారిగా ఫైర్ అయ్యారు. ముఖ్యంగా హిందూ మహాసభ తరపు న్యాయవాది వికాస్‌ని తీవ్ర స్వరంతో మందలించారు. అసలు మీ వాదన ఇలాగే కొనసాగితే తామేమీ చేయలేమని, వాదనలను ఇక్కడితో ఆపేసి లేచి వెళ్లిపోతామని హెచ్చరించారు. దీంతో హిందూ మహాసభ తరపు న్యాయవాది ప్రధాన న్యాయమూర్తిని క్షమించమని కోరారు. మొత్తానికి సుప్రీంకోర్టులో పెద్ద రచ్చే జరిగింది.

ఇక మొత్తంగా 40 రోజుల పాటు జ‌రిగిన ఈ విచార‌ణ బుధ‌వారంతో ముగిసింది. ప్ర‌స్తుతానికి రిజ‌ర్వ్ అయిన తీర్పు న‌వంబ‌ర్ 17కు ముందే వెలువ‌డే అవ‌కాశం ఉంది. ఇక ఈ కేసులో లిఖిత పూర్వ‌క నివేద‌న‌లు ఇచ్చేందుకు కోర్టు మ‌రో మూడు రోజుల టైం ఇచ్చింది. నవంబర్ 17న సీజేఐ పదవీ విరమణ చేయనుండటంతో ఆలోపే ఆయన తీర్పు వెల్లడించే అవకాశం ఉందని భావిస్తున్నారు.