Begin typing your search above and press return to search.

సుప్రీం చీఫ్ జ‌స్టిస్ మీద‌నే లైంగిక ఆరోప‌ణ‌లు

By:  Tupaki Desk   |   20 April 2019 7:35 AM GMT
సుప్రీం చీఫ్ జ‌స్టిస్ మీద‌నే లైంగిక ఆరోప‌ణ‌లు
X
విన్నంత‌నే నోట మాట రాని ప‌రిస్థితి. ఆయ‌న మామూలు వ్య‌క్తి కాదు. దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానానికి చీఫ్ జ‌స్టిస్. అలాంటి ఆయ‌న‌పై లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌లు చేస్తూ ఒక మ‌హిళ చేసిన ఫిర్యాదు తీవ్ర క‌ల‌క‌లాన్ని రేపుతున్నాయి. ఫిర్యాదు చేయాల‌న్న ఆలోచ‌న రావ‌టానికి సైతం భ‌య‌ప‌డే అత్యున్నత స్థానంలో ఉన్న ప్ర‌ధాన న్యాయ‌మూర్తి మీద ఫిర్యాదు చేసిన వైనం ఇప్పుడు పెను సంచ‌ల‌నంగా మారింది.

సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా వ్య‌వ‌హ‌రిస్తున్న గొగోయ్ పై లైంగిక ఆరోప‌ణ‌లు చేశారు 35 ఏళ్ల మ‌హిళ‌. సుప్రీంకోర్టులో జూనియ‌ర్ కోర్టు అసిస్టెంట్ గా ప‌ని చేస్తున్న ఆమె.. తాజాగా 22 మంది న్యాయ‌మూర్తుల‌కు స‌మ‌ర్పించిన అఫిడ‌విట్ లో ఈ ఆరోప‌ణ‌లు చేశారు. గ‌త ఏడాది అక్టోబ‌రు 10.. 11 తేదీల్లో జ‌స్టిస్ గొగోయ్ త‌న ప‌ట్ల అనుచితంగా ప్ర‌వ‌ర్తించార‌ని.. త‌న కుటుంబాన్ని వేధింపుల‌కు గురి చేసిన‌ట్లుగా ఆమె ఆరోపించారు.

ప్ర‌ధాన న్యాయ‌మూర్తి వేధింపుల‌ను తిర‌స్క‌రించినందుకు త‌న‌ను.. త‌న కుటుంబాన్ని తీవ్రస్థాయిలో ఇబ్బందుల‌కు గురి చేస్తున్న‌ట్లుగా ఆమె త‌న ఫిర్యాదులో పేర్కొన్నారు. త‌న‌కు న్యాయం చేయాల‌ని కోరుతూ సుప్రీంకోర్టు జ‌డ్జిల‌ను ఆశ్ర‌యించారు. దీనిపై ఈ రోజు సీజేఐ నేతృత్త‌వంలోని ధ‌ర్మాస‌నం విచార‌ణ చేప‌ట్టింది. ఇదిలా ఉంటే.. ఈఉదంతంపై గొగోయ్ స్పందించారు.

ఇర‌వై ఏళ్ల పాటు నిస్వార్థంగా సేవ‌లు అందించిన త‌న‌పై ఇలాంటి ఆరోప‌ణ‌లు చేయ‌టాన్ని న‌మ్మ‌లేక‌పోతున్న‌ట్లుగా ఆయ‌న వ్యాఖ్యానించారు. త‌న‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల్ని ఆయ‌న ఖండించారు. త‌న‌ను తొల‌గించాల‌నే ప్ర‌య‌త్నంలో భాగంగానే ఇలాంటివి జరుగుతున్న‌ట్లుగా అభిప్రాయ‌ప‌డ్డారు. ఈ దేశంలో దేశ అత్యున్న న్యాయ‌స్థానం ప్ర‌ధాన న్యాయ‌మూర్తికే ఇబ్బంది ఎదురైతే.. మామూలోళ్ల ప‌రిస్థితి ఏంటి? ఈ ఉదంతాన్ని విన్నంత‌నే దేశం ఎక్క‌డికి వెళుతోందన్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయం.