Begin typing your search above and press return to search.

అమ‌రావ‌తి భూ కుంభ‌కోణంపై సీఐడీ నివేదిక సిద్దం!

By:  Tupaki Desk   |   13 Oct 2019 8:56 AM GMT
అమ‌రావ‌తి భూ కుంభ‌కోణంపై సీఐడీ నివేదిక సిద్దం!
X
ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి భూముల కుంభ‌కోణంపై జ‌గ‌న్ స‌ర్కారు నియ‌మించిన సీఐడీ బృందం త‌న నివేదిక‌ను సిద్ధం చేసింది. వైసీపీ ప్ర‌తిప‌క్షంలో ఉన్న స‌మ‌యంలో అమ‌రావ‌తి భూముల విష‌యంలో అనేక ఆరోప‌ణ‌లు చేసిన విష‌యం తెలిసిందే. ఇక్క‌డ భూముల‌ను అడ్డు పెట్టుకుని ఇన్‌ సైడ‌ర్ ట్రేడింగ్ జ‌రిగింద‌ని - భారీ ఎత్తున అప్ప‌టి సీఎం చంద్ర‌బాబు త‌న అనుయాయుల‌కు ల‌బ్ధి క‌లిగించేలా వ్య‌వ‌హ‌రించార‌ని ఆరోప‌ణ‌లు సంధించింది. రాజ‌ధాని ఎక్క‌డ వ‌స్తుంద‌నే విష‌యాన్ని ముందుగానే ప‌సిగ‌ట్టి.. టీడీపీ నాయ‌కులు - పార్టీ అధినేత‌ - అప్ప‌టి సీఎం చంద్ర‌బాబు త‌న వారికి మేళ్లు చేశార‌ని అప్ప‌టి వైసీపీ నాయ‌కులు పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు గుప్పించారు.

ఏపీలో రాజ‌ధాని ఏర్పాటు కోసం నియ‌మించిన శివ‌రామ‌కృష్ణ‌న్ క‌మిటీ ఇచ్చిన నివేదిక‌ను ప‌క్క‌న పెట్టి గుంటూరులోని ప‌చ్చ‌ని పొలాల‌తో క‌ళ‌క‌ళ‌లాడుతున్న తుళ్లూరు ప్రాంతాన్ని చంద్ర‌బాబు రాజ‌ధాని కోసం ఎంపిక చేసుకున్నారు. అయితే, ఈ విష‌యాన్ని ఆయ‌న ముందుగానే త‌న వారికి లీక్ చేయ‌డంతో అప్ప‌టి మంత్రులు నారాయ‌ణ‌ - గంటా శ్రీనివాస‌రావు - ప్ర‌త్తిపాటి పుల్లారావు - దేవినేని ఉమా - ఎంపీలు గ‌ల్లా జ‌య‌దేవ్‌ - ముర‌ళీ మోహ‌న్‌ - అప్ప‌టి కేంద్ర మంత్రి సుజ‌నా చౌద‌రి - ఎమ్మెల్యే ధూళిపాళ్ల న‌రేంద్ర కుమార్ స‌హా ప‌లువురు ఇక్క‌డ భారీ ఎత్తున భూముల‌ను చౌక‌గా ద‌క్కించుకున్నారు. ఈ క్ర‌మంలోనే ఇన్‌ సైడ‌ర్ ట్రేడింగ్‌ కు తెర‌దీశారని - అప్ప‌ట్లో జ‌గ‌న్ స‌హా వైసీపీ నాయ‌కులు ఆరోపించారు.

ముఖ్యంగా ఇక్క‌డి రైతుల‌ను మ‌భ్య‌పెట్టి - వారికి ఇక్క‌డ రాజ‌ధాని వ‌స్తుంద‌ని కూడా చెప్ప‌కుండానే త‌క్కువ ధ‌ర‌ల‌కు భూముల చేజిక్కించుకున్నారు. అదే స‌మ‌యంలో ల్యాండ్ పూలింగ్ ద్వారా కూడా కొంత మేర‌కు భూములు సొంతం చేసుకున్నారు. అనంత‌రం - రాజ‌ధాని ప్ర‌క‌ట‌న చేశారు. ఈ నేప‌థ్యంలో రాష్ట్రంలో ఏర్ప‌డిన జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఆయా భూముల విష‌యంపై విచార‌ణ చేసి - నిజాల‌ను నిగ్గు తేల్చేందుకు సీఐడీ అధికారుల‌తో ప్ర‌త్యేకంగా ఓక‌మిటీని ఏర్పాటు చేసి విచార‌ణ‌కు ఆదేశించింది. ఈ క‌మిటీ త‌న నివేదిక‌ను సిద్ధం చేసిన‌ట్టు తాజాగా తెలిసింది.

రాబోయే రెండు మూడు వారాల్లో ఈ నివేదిక‌ను క్షుణ్ణంగా అధ్య‌య‌నం చేయ‌నున్న జ‌గ‌న్ ప్ర‌భుత్వం రాజ‌ధాని ప‌నుల‌ను పునఃప్రారంభించాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు తెలిసింది. అదేస‌మ‌యంలో ఇన్‌ సైడ‌ర్ ట్రేడింగ్‌ కు పాల్ప‌డిన వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకునేందుకు కూడా సిద్ధ‌మ‌వుతున్న‌ట్టు స‌మాచారం. ఇక‌, ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న స‌మాచారం మేర‌కు సీఐడీ అధికారులు రాజ‌ధాని భూముల విష‌యంలో జ‌రిగిన అవ‌క‌త‌వ‌క‌ల‌ను క్షుణ్ణంగా ప‌రిశీలించారు.

నేల‌పాడు - తుళ్లూరు - దొండ‌పాడు - ఇన‌వోలు - శాఖ‌మూరు - నీరు కొండ‌ - కుర‌గ‌ల్లు - ఉండ‌వ‌ల్లి - వెంక‌ట‌పాలెం గ్రామాల‌ను జ‌ల్లెడ ప‌ట్టిన క‌మిటీ - ఇక్క‌డ జ‌రిగిన లావాదేవీలు - ఎవ‌రెవ‌రికి ఎంతెంత ల‌బ్ధి చేకూరింద‌నే విష‌యాల‌ను త‌న నివేదిక‌లో స్ప‌ష్టం చేసింద‌ని స‌మాచారం. దీనిపై జ‌గ‌న్ ప్ర‌భుత్వం త్వ‌ర‌లోనే చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించ‌నుంద‌ని తెలుస్తోంది. దీంతో టీడీపీ నాయ‌కులు చిక్కుల్లో ప‌డ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.