Begin typing your search above and press return to search.

లీకయ్యింది: ఎంసెట్ పేపర్ @ రూ. 10లక్షలు!

By:  Tupaki Desk   |   27 July 2016 11:25 AM GMT
లీకయ్యింది: ఎంసెట్ పేపర్ @ రూ. 10లక్షలు!
X
ఆంధ్రప్రదేశ్ నిర్వహించిన ఎంసెట్ లో వేలల్లో ర్యాంకులు సంపాదించుకున్న కొంతమంది విద్యార్థులకు తెలంగాణ నిర్వహించిన ఎంసెట్ లో మాత్రం వందల్లోనే ర్యాంకులు రావడంతో ఒక అనుమానం మొదలైంది. ఈ క్రమంలో తమ పిల్లలకు తీవ్ర అన్యాయం జరిగిందంటూ కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులు తెలంగాణ వైద్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డిని ఆశ్రయించారు. దాంతో ఆయన ఈ వ్యవహారంపై దర్యాప్తుకు ఆదేశించగా... షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో తెలంగాణ ఎంసెట్ - 2 పేపర్ లీకయ్యిందని తెలిసింది.

అవును తెలంగాణ ఎంసెట్ - 2 పేపర్ లీకయ్యిందని సీఐడీ అధికారులు నిర్ధారించారు. ఈ మేరకు బెంగళూరు - ముంబై నగరాలతో పాటు ప్రకాశం జిల్లా కనిగిరిలోనూ పోలీసులు దర్యాప్తుచేసి రమేష్ అనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ లీకేజీ వ్యవహారం సుమారు రూ. 15కోట్లకు కుదుర్చుకున్న డీల్ అని తెలుస్తోంది. ఈ లీక్ ద్వారా 30 మంది వరకూ విద్యార్థులు లబ్ది పొందినట్లు అధికారులు నిర్ధారిస్తున్నారు.

ఎంసెట్ పరీక్షకు రెండు రోజుల ముందు ఈ పేపర్ లీక్ అయ్యిందని - దీనికోసం ఒక్కో విద్యార్థి నుంచి సుమారు రూ. 10 లక్షలు వసూలు చేశారని సీఐడీ అధికారులు చెబుతున్నారు. ఇలా లీకైన పేపర్ తో బెంగళూరులో ప్రాక్టీస్ చేయించారని, అదే యధాతథంగా పరీక్షల్లో రాయడంతో అద్భుతమైన ర్యాంకులు వచ్చాయని పోలీసులు తేల్చారు. వైద్యవిద్య పీజీ పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్ చేసినవాళ్లే... ఈ పేపర్ ను కూడా లీక్ చేశారని అధికారులు నిర్ధారించారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఇద్దరిని అదుపులోకి తీసుకోగా తాజాగా మరో ముగ్గురుని అదుపులోకి తీసుకున్నారు.