Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ కుమార‌ర‌త్నాల మ‌రో కుంభ‌కోణం!

By:  Tupaki Desk   |   29 Aug 2015 9:26 AM GMT
కాంగ్రెస్ కుమార‌ర‌త్నాల మ‌రో కుంభ‌కోణం!
X
కుంభ‌కోణాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ అన్న పేరున్న కాంగ్రెస్‌ కు క‌ష్ట కాలం మొద‌లైన‌ట్లుగా. భూస‌మీక‌ర‌ణ బిల్లు.. ల‌లిత్ మోడీ అంశంతో ఈ మ‌ధ్య కాలంలో ఇరుకున‌ప‌డితే.. తాజాగా కాంగ్రెస్ నేత‌ల పుత్ర‌ర‌త్నాలు య‌వ్వారాలు ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి.

రాజ‌స్థాన్‌ లో బ‌య‌ట‌ప‌డిన అంబులెన్స్ ల కుంభ‌కోణంలో.. కాంగ్రెస్ అగ్ర‌నేత‌ల్లో ఒక‌రి పుత్ర‌ర‌త్నం పేరు వెల్ల‌డి కావ‌టంతో పాటు..ఈ వ్య‌వ‌హారంలో కూరుకుపోతున్న సంకేతాలు క‌నిపిస్తున్నాయి.ఇప్ప‌టికే చిదంబ‌రం కుమారుడు కార్తీ మీద ఆరోప‌ణ‌లు ఉండ‌టం తెలిసిందే. తాజాగా వాయిలార్‌ ర‌వి.. రాజ‌స్థాన్ మాజీ ముఖ్య‌మంత్రి అశోక్ గెహ్లాట్ కుమారుడి పేరు బ‌య‌ట‌కు రావ‌టం క‌ల‌క‌లం రేపుతోంది.

గ‌తంలో రాజ‌స్థాన్ ముఖ్య‌మంత్రిగా వ‌సుంధ‌ర రాజె వ్య‌వ‌హ‌రించిన స‌మ‌యంలో.. 108 అంబులెన్స్ లు ఏర్పాటు చేశారు. ఆ త‌ర్వాత వ‌చ్చిన ఎన్నిక‌ల్లో ఆమె ఓట‌మి పాలుకావ‌టం..కాంగ్రెస్‌పార్టీ విజ‌యం సాధించ‌టం జ‌రిగింది. ఇదిలా ఉంటే.. రాజ‌స్థాన్ ముఖ్య‌మంత్రిగా అశోక్ గెహ్లాట్ అధ‌కారంలోకి వ‌చ్చారు. అప్ప‌టికే 108 సేవ‌లు అందిస్తున్న ఈఎంఆర్ ప‌నితీరు బాగోలేదంటూ కొత్త‌గా టెండ‌ర్లు పిలిచారు.

అనంత‌రం జిక్వెట్జాహెల్త్ కేర్‌ సెంట‌ర్ కు టెండ‌ర్ ల‌భించింది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. ఈ జిక్వెట్జాహెల్త్ కేర్ సెంట‌ర్ కు వ్య‌వ‌స్థాప‌క డైరెక్ట‌ర్ గా వాయిలార్ ర‌వి కుమారుడు ర‌వికృష్ణ‌.. చిదంబ‌రం..స‌చిన్ పైల‌ట్ లు డైరెక్ట‌ర్లుగా వ్య‌వ‌హ‌రించ‌టం. అప్పుడెప్పుడో అంబులెన్స్ య‌వ్వారం ఇప్పుడు తెర మీద ఎందుకొచ్చిందంటే..ఈ మ‌ధ్య‌న ఈ అంశంపై కాగ్ దుమ్ము దులిపేయ‌టంతో వ‌సుంధ‌ర రాజె ప్ర‌భుత్వం చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించింది. కాగ్ నివేదిక ప్ర‌కారం.. బిల్లుల దాఖ‌లు మొద‌లు.. ప‌లు అంశాల్లో భారీ అవ‌క‌త‌వ‌క‌లు చోటు చేసుకున్నాయ‌ని తేల్చారు.

తాజాగా.. ఈ కేసును సీబీఐకి బ‌దిలీ చేస్తూ రాజ‌స్థాన్ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకోవ‌టంతో కాంగ్రెస్ నేత‌లు ఉక్కిరిబిక్కిరి అవుతోంది. మ‌రోవైపు.. కాంగ్రెస్ మాత్రం వ‌సుంధ‌ర రాజె స‌ర్కారు ప్ర‌తీకార చర్య‌ల‌కు పాల్ప‌డుతుంద‌ని పేర్కొంటున్నారు. మొత్తానికి కాంగ్రెస్‌ నేత‌లే కాదు.. వారి పుత్ర‌ర‌త్నాలు కూడా అవినీతి ఆరోప‌ణ‌ల్లో చిక్కుకోవ‌టం గ‌మ‌నార్హం.